చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే ప్రతి అర్జీని ఆడిట్ చేయాల్సిందే అని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈనెల 1వ తేదీన సాక్షి దినపత్రికలో ‘కలెక్టరేట్ వద్ద కన్నీటి వేదనలు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై కలెక్టర్ స్పందించారు. సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం అనంతరం అన్ని శాఖల జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పీజీఆర్‌ఎస్లో నమోదయ్యే ప్రతి అర్జీని కచ్చితంగా పరిష్కరించాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్జీల పరిష్కారంలో తక్కువ పురోగతి చూపుతున్న శాఖల పేర్లను వెల్లడించారు.
తప్పులు లేకుండా
రీసర్వే నిర్వహించాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నిర్వహిస్తున్న రీ సర్వే కార్యక్రమం తప్పులు లేకుండా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆదేశించారు. ఆయన సోమవారం క్షేత్రస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నాలుగో దశలో 101 గ్రామాల్లో రీ సర్వే జరుగుతోందన్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు చోటుచేసుకోకూడదన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వేయర్, ఆర్‌ఎస్‌డీటీలు నిత్యం ప్రక్రియను పర్యవేక్షించాలని చెప్పారు. ఈ సమావేశంలో సర్వే శాఖ డీడీ జయరాజ్ పాల్గొన్నారు.
లా కోర్సుల పరీక్ష ఫీజు చెల్లింపునకు 13 చివరి తేదీ
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో మూడు, ఐదేళ్ల లా కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులు పలు సెమిస్టర్ పరీక్షల కోసం ఈనెల 13వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. సమాచారాన్ని ఇప్పటికే అన్ని లా కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపామన్నా రు. అలాగే ఈ నెల 25 నుంచి పలు లా కోర్సుల విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయని షెడ్యూల్ విడుదల చేశామని వెల్లడించారు.
ఐసర్‌లో జాతీయ
సైన్స్ దినోత్సవం
ఏర్పేడు: తిరుపతి భారతీయ సైన్స్ విద్య, పరిశోధన సంస్థ (ఐసర్)లో సోమవారం జాతీయ సైన్స్ దినోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ దినోత్సవ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథులుగా బాంబే ఐఐటీ కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ రుచి ఆనంద్, బోస్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ కౌస్తువ్ సన్యాల్, సైన్స్ కమ్యూనికేటర్ ప్రొఫెసర్ ధనంజయ శర్మ పాల్గొని సైన్స్ రంగంలో భారత్ సాధించిన ప్రగతిని గురించి వివరించారు. ఐసర్ విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శించారు. ప్రయోగ ప్రదర్శనల్లో ఆలోచనల వాస్తవికత, స్పష్టత, ప్రతిబింబించే అంతర్ విభాగ స్ఫూర్తిని ప్రశంసించారు. తిరుపతి ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య మాట్లాడుతూ యువ మనస్సుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. శ్రీజాతీయ సైన్స్ దినోత్సవం కేవలం ఆవిష్కరణల వేడుక మాత్రమే కాదని.. ఉత్సుకత, విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించే బాధ్యత అన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు.
తిరుమలలో మత్తు
మాత్రలిచ్చి.. గొలుసు చోరీ
– మహిళ అరెస్టు
తిరుమల: మత్తు మాత్రలిచ్చి బంగారు తాళిబొట్టు గొలుసు చోరీ చేసిన మహిళను తిరుమల పోలీసులు వన్ టౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. 2020 జనవరి నెలలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన 72 ఏళ్ల వృద్ధురాలు తిరుమలకు వచ్చారు. ఈ క్రమంలో బేడీ ఆంజనేయ స్వామి వద్ద ఆమెను నమ్మబలికిన ఓ మహిళ, టీలో మత్తు మాత్రలు కలిపి ఇచ్చింది. స్పృహ కోల్పోయిన ఆమె మెడలో ఉన్న సుమారు 73 గ్రాముల బంగారు తాళిబొట్టు చైన్‌ను అపహరించింది. ఈ ఘటనపై తిరుమల వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోమవారం తిరుమల హెచ్‌టీ సముదాయం వాహనాల పార్కింగ్ వద్ద నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది. నిందితురాలి వద్ద నుంచి సుమారు 8.4 గ్రాముల బంగారు చైన్, 8 నిద్ర మాత్రలు, ఒక ఇనుప కట్టర్ స్వాధీనం చేసుకున్నారు.


