ఆరోగ్యశాఖలో అవినీతి కంపు | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశాఖలో అవినీతి కంపు

Mar 3 2026 8:10 AM | Updated on Mar 3 2026 8:10 AM

● పైసలిస్తేనే పనులు ● దళారులతో యథేచ్ఛగా వసూళ్లు ● డెప్యుటేషన్లపై విమర్శల వెల్లువ

ఇలా వసూళ్లు చేస్తున్నారట!

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పరిధిలో 50 పీహెచ్‌సీలున్నాయి. 1,200 పైగా ప్రయివేటు ఆస్పత్రులు, సుమారు 300కుపైగా ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లు ఉన్నాయి. ఇందులో రిజిస్ట్రేషన్‌ లెక్కలు చాలా తక్కువగానే ఉన్నాయి. వీటి నిర్వహణతో పాటు కార్యాలయంలో జరిగే పలు కార్యకలాపాల్లో కొందరు అధికారులు, సిబ్బంది దళారులను అడ్డుపెట్టుకుని వసూళ్ల దందాకు తెరలేపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర స్థాయి అధికారులకు పలు ఫిర్యాదులు వెళ్లాయి.

ఆ ఫిర్యాదుల్లో ఏముందంటే!

ఇటీవల జిల్లా నుంచి వైద్యులు, కార్యాలయంలోని ఓ వర్గం రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదులో కొందరు అధికారులు, సిబ్బంది కార్యాలయాన్ని అడ్డంగా పెట్టుకుని అవినీతి, అక్రమాలు చేస్తున్నారని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు ఆకాశరామన్న లేఖ రాశారు. ఆ లేఖలో ఏముందంటే... గ్రేడ్‌–3 ఏఎన్‌ఎంల పదోన్నతుల్లో కొందరు అధికారులు రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై జిల్లా పాలకులకు ఫిర్యాదు వెళ్లిందని, ఆపై ఓ సిబ్బందిపై చర్యలు చేపట్టినట్లు ప్రస్తావించారు. అక్రమ స్కానింగ్‌ల నుంచి కొందరు రూ.3 లక్షలు వసూలు చేశారని రాసుకొచ్చారు. ఆర్‌ఎంపీల తనిఖీల పేరుతో కొంతమంది వద్ద రూ.2 లక్షలు గుంజేశారని ఫిర్యాదులో తెలిపారు. ఏఎన్‌హెచ్‌ఎంలో నకిలీ బిల్లులతో నిధుల దుర్వినియోగం జరిగిందని, జరగని మీటింగ్‌లకు కూడా బిల్లులు పెట్టేశారని లేఖలో రాసుకొచ్చారు. అరియర్స్‌ బిల్లులకు లంచం, కోవిడ్‌ బిల్లుల విషయంలో పలు ఆరోపణలున్నాయి. పలు పోస్టుల భర్తీలో అవినీతి జరిగిందని, డెప్యూటేషన్‌లకు స్థాయిని బట్టి రూ.30 వేల నుంచి రూ.3లక్షల వరకు కొందరు అధికారులు వసూలు చేశారని చెప్పుకొచ్చారు. ఆ శాఖ అధికారు లు ఓ వాహనం కొనుగోలుకు రూ.26 లక్ష ల వరకు కొటేషన్‌ పెడితే.. ఆ కొటేషన్‌ను నమ్మకుండా..ఓ పాలనా అధికారి..రూ.25 లక్షల వాహనాన్ని రూ.20లక్షల్లోనే కొనుగో లు చేయించారనే విషయాన్ని ఓ వర్గ అధికారులు గుర్తుచేస్తున్నారు. అభివృద్ధి పేరు తో వచ్చిన పనుల్లో కూడా కమిషనర్‌ తీసుకున్నట్లు కొంత మంది కార్యాలయ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలను ఓ వర్గ అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ జిల్లా అధికారిని బదిలీ చేసేందుకు రాష్ట్ర స్థాయి అధికారులు సిద్ధమవుతున్నారని ఆ వర్గ అధికారులు బహిరంగంగా చెబుతున్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి కంపు కడుతోంది. పైసలిస్తే పనులు.. లేదంటే వేధింపులు తప్పవనే ప్రచారం జోరందుకుంది. ఆస్పత్రుల్లో వసూళ్లు, బదిలీలు, ఉద్యోగోన్నతులు, డెప్యూటేషన్లలో కాసుల వర్షం కురిసిందని.. ఈ దందా వెనుక దళారుల అండ ఉందనే నగ్న సత్యం చక్కెర్లు కొడుతోంది.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కొందరు అధికారులు, సిబ్బంది చేసే వసూళ్ల పర్వంపై గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌ ఫీజులు రూ.10వేలు ఉంటే.. ముడుపులు లక్షల్లో పలుకుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిని బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే విమర్శలు భగ్గుమంటున్నాయి. దీనితోడు రిజిస్ట్రేషన్‌, రెన్యూవల్‌ పత్రాలను సిద్ధం చేసేందుకు రూ.10వేల వరకు గుంజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీఏ బిల్లులు, పోగ్రాం బిల్లులు, బడ్జెట్‌ బిల్లులు ఇలా ప్రతి పనికీ కాసులు ఇవ్వాల్సి వస్తోందని కొందరు అధికారులు వాపోతున్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రులు చాలా వరకు రిజిస్ట్రేషన్‌ కాకుండా నడుస్తున్నాయి. జిల్లా మొత్తంగా సుమారు 1000పైగా ప్రైవేటు ఆస్పత్రులుంటే అందులో కేవలం 154 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ అయినట్లు తెలుస్తోంది. మిగిలిన ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌ మాటెత్తితే ఆ ఎమ్మెల్యే, ఈ ఎంపీ ఫోన్‌ చేస్తున్నారని.. వారిపై బురదజల్లేస్తున్నారు. జిల్లాలోని కొంత మంది ప్రజాప్రతినిధులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయమైన సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement