సమస్యలు అనేకం....
చిత్తూరు కలెక్టరేట్ : సమస్యలు అనేకం.. పరిష్కారం నామమాత్రంగా మారింది ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారులు పలు మార్లు కలెక్టరేట్‌కు విచ్చేసి అర్జీలు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కాగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్‌వో మోహన్‌కుమార్, ఆర్‌డీవో శ్రీనివాసులు తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 62 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ తెలిపారు.
పట్టించుకోవడం లేదు
చాలా ఏళ్లుగా నగరిలోని 8వ వార్డు ఎస్టీ ఎరుకుల ప్రజలను అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు ఆరోపించారు. కలెక్టరేట్ ఎదుట సమస్యల పరిష్కారానికి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నగరి మున్సిపాలిటీ 8వ వార్డులో గత 30 ఏళ్లుగా గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న ఎస్టీ ఎరుకుల కులస్థులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని, వారికి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. పట్టాలు మంజూరు చేసి శాశ్వత గృహాలు నిర్మించాలని కోరారు. ఈ ధర్నా లో నాయకులు విజయ్, శ్రీనివాసులు, ముత్యాలయ్య, సురేష్ పాల్గొన్నారు.
కలెక్టర్‌కు సమస్యలు మొరపెట్టుకుంటున్న అర్జీదారులు
ధర్నా చేస్తున్న బాధితులు, సీపీఐ నాయకులు


