
పవన్‌కల్యాణ్‌తో వినుత దంపతులు (ఫైల్)
ఆయన వెంటనే స్పందించి ఉంటే డ్రైవర్ హత్య జరిగేది కాదు
చంద్రబాబుతో మాట్లాడి సెటిల్ చేస్తానన్నారు.. కానీ పట్టించుకోలేదు
చెన్నై పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించిన కోట వినుత దంపతులు
పర్సనల్ వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల బ్లాక్ మెయిలింగ్
మా డ్రైవర్‌కు రూ.30 లక్షలు ఇచ్చి వీడియోలు తీయించారు
డ్రైవర్‌ను పిలిపించి మాట్లాడుతుండగా తీవ్ర వాగ్వాదం.. చేయి దాటిన పరిస్థితి
సాక్షి, అమరావతి: ‘మా వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారు. ఆ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు చెప్పాం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన పట్టించుకోలేదు. ఆయన వెంటనే బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే డ్రైవర్ శ్రీనివాస్ హత్య వరకు వ్యవహారం దారి తీసేది కాదు’ అని జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు దంపతులు విస్పష్టంగా వెల్లడించారు.
డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో వారిద్దరినీ చెన్నై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు అక్కడి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు. తమ వ్యక్తిగత వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం పవన్ కల్యాణ్‌కు ముందే తెలుసని వారు కుండబద్ధలు కొట్టడం గమనార్హం. తమ పార్టీ మహిళా నేతను వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసినా ఆయన పట్టించుకోలేదని వారు వాపోయారు. చెన్నై పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు తమ వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి.
గొడవ చేయొద్దు.. సర్దుబాటు చేస్తానన్నారు
‘టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మా బెడ్‌రూమ్‌లో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డు చేయించారు. మా డ్రైవర్ శ్రీనివాస్‌ను ప్రలోభపెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు. అనంతరం ఆ వీడియోలను డ్రైవర్ శ్రీనివాస్ రూ.30 లక్షలకు ఎమ్మెల్యే సుధీర్‌కు విక్రయించారు. వాటితో ఆయన తన వర్గీయుల ద్వారా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయించారు.
ఈ విషయం తెలియగానే శ్రీనివాస్‌ను పని నుంచి తొలగించాం. వ్యక్తిగత వీడియోలతో మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో వెంటనే మా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాం. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీరే ఇదంతా చేయిస్తున్నారని వివరించాం. ఆ విషయాన్ని ఎవరికీ చెప్దొద్దు.. టీడీపీ వారితో గొడవ పడొద్దని ఆయన మాతో చెప్పారు. ‘నేను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సుధీర్‌తో మాట్లాడతాను. విషయాన్ని సర్దుబాటు చేస్తాను.
మీరు పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు. ప్రభుత్వానికి, రెండు పార్టీలకు ఇబ్బంది కలుగుతుంది’ అని పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ అధినేత అలా హామీ ఇవ్వడంతో ఆయన మాటలు విశ్వసించాం. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సుధీర్‌తో ఏం మాట్లాడారో మాకు తెలీదు. కానీ ఎమ్మెల్యే సుధీర్ తన వర్గీయులతో మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ బెదిరింపులు కొనసాగించారు. అంటే పవన్ కల్యాణ్ మా ఆవేదనను పట్టించుకోలేదని స్పష్టమైంది.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకే శ్రీనివాస్‌ను పిలిపించాం
టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు బ్లాక్ మెయిలింగ్ కొనసాగిస్తునే ఉన్నారు. దాంతో శ్రీనివాస్‌ను పిలిపించి గట్టిగా నిలదీశాం. ఎందుకు ఇంత పని చేశావని ప్రశ్నించాం. తనకు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రూ.30 లక్షలు ఇచ్చి ఆ వీడియోలు తీసుకున్నారని అతను తెలిపాడు. అందులో రూ.20 లక్షలు ఖర్చు చేసేశానని, తన వద్ద ఇక రూ.10 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. దాంతో తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి. ఆ ఘర్షణలోనే శ్రీనివాస్ హతమయ్యాడు.

పవన్ స్పందించి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు
వ్యక్తిగత వీడియోలతో తమను బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయాన్ని చెప్పగానే పవన్ కల్యాణ్ బాధ్యతాయుతంగా స్పందిస్తారని ఆశించాం. పార్టీలో ఓ మహిళా నేత ఆవేదనను అర్థం చేసుకుంటారని, న్యాయం చేస్తారని అనుకున్నాం. కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సమస్యనే పట్టించుకోకపోవడం తీవ్ర ఆవేదన కలిగించింది.
పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి, టీడీపీ ఎమ్మెల్యే సుధీర్‌ను కట్టడి చేసి ఉండే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు. మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నప్పుడు అడ్డుకోకుండా ఉన్నా బాగుండేది. దాంతో పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేవారేమో. అటు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ బ్లాక్‌మెయిలింగ్.. మరోవైపు మా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్టించుకోకపోవడం.. దీంతో ఏం చేయాలో మాకు తోచలేదు.
దాంతో డ్రైవర్ శ్రీనివాస్‌తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాం. ఆ తర్వాత మాటా మాటా పెరిగి పరిస్థితి చేయిదాటిపోయింది. అతను హతమయ్యాడు. బ్లాక్ మెయిలింగ్ బాధితులమైన మేము హత్య కేసులో చిక్కుకున్నాం. మా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ తన పంతం నెగ్గించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జికే ఇంతటి దుస్థితి ఏర్పడితే.. ఇక జనసేన పార్టీ సామాన్య కార్యకర్తల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అర్థమవుతోంది’ అని వారు పేర్కొన్నారు.