‘అనంత’ ఫలసాయం హస్తినకు..

Kisan Rail Will Flag Off From Anantapur on September 9 - Sakshi

ఉద్యాన ఉత్పత్తులతో ‘కిసాన్‌ రైలు’

ఢిల్లీలో మంచి ధరలకు విక్రయించుకునే అవకాశం

నేడు ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్, కేంద్ర మంత్రులు

సాక్షి, అనంతపురం అగ్రికల్చర్‌: ‘అనంత’ రైతన్న ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘ఉద్యాన హబ్‌’ కల సాకారమవుతోంది. జిల్లాలో పండిస్తున్న ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్‌ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఢిల్లీకి నేడు ప్రత్యేకంగా ’కిసాన్‌ రైలు’ ప్రారంభం కానుంది. మహారాష్ట్ర తర్వాత ఇది రెండో ‘కిసాన్‌ రైలు’ కావడం గమనార్హం. అనంతపురం రైల్వే స్టేషన్‌ నుంచి బుధవారం ఉదయం 10.30 గంటలకు బయలుదేరే కిసాన్‌ రైలును సీఎం వైఎస్‌ జగన్, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్‌ సి.అంగడి జూమ్‌ ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారు. అక్టోబర్‌ నుంచి రైలును పూర్తిస్థాయిలో నడిపేలా చర్యలు చేపట్టారు.  

కిసాన్‌రైలు తొలి సర్వీసులో 400 టన్నుల టమాటా, చీనీ, బత్తాయి, కర్భూజా, బొప్పాయి, అరటి ఉత్పత్తులను తరలించేందుకు 14 వ్యాగన్లు, ఒక స్లీపర్‌ కోచ్‌ బోగీ సిద్ధం చేశారు. రైతులు, వ్యాపారులతోపాటు అధికారుల బృందం కూడా కిసాన్‌ రైలులో ఢిల్లీ వెళ్లనుంది.

అనంతపురం నుంచి ఢిల్లీలోని అజాద్‌పూర్‌ మార్కెట్‌కు ఉద్యాన ఉత్పత్తులను తరలించి విక్రయించుకునేందుకు దేశ రాజధానిలో తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

కిసాన్‌ రైలు సదుపాయం వల్ల ఏటా 55 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులను తరలించడం ద్వారా రూ.10 వేల కోట్లకు పైగా టర్నోవర్‌ జరిగే అవకాశం ఉందని, ’అనంత’ రైతులకు అదనంగా 20 నుంచి 30 శాతం మేర ఆదాయం సమకూరనుందని అంచనా వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి 36 గంటల వ్యవధిలో చేరుకునే కిసాన్‌ రైలు ద్వారా పండ్ల ఉత్పత్తులకు మంచి ధర లభించే అవకాశం ఉంది. వీటికి బీమా సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతానికి టన్ను రవాణా ఖర్చు రూ.5,135  చొప్పున నిర్ణయించినా రైతులకు వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఏపీఎంఐపీ పీడీ బీఎస్‌ సుబ్బరాయుడు, ఉద్యానశాఖ డీడీ పి.పద్మలత తెలిపారు. ఏర్పాట్లను ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, కలెక్టర్‌ చంద్రుడు  పరిశీలించారు. (12 నుంచి 24 ప్రత్యేక రైళ్లు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top