వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించాం

Kakani Govardhan Reddy In YSRCP Plenary 2022 - Sakshi

రైతులకు అన్ని విధాలుగా సీఎం వైఎస్‌ జగన్‌ అండదండలు

పంటలకు గిట్టుబాటు ధర.. ఉచితంగా పంటల బీమా

నిచ్చెనెక్కి వేరు శనగ కోయాలన్న పవన్‌

డబ్బులిచ్చి వంకాయ పప్పు చేయడం నేర్చుకున్న లోకేష్‌

అధికారంలో ఉండగా రైతులను పట్టించుకోని చంద్రబాబు

వీళ్లు ముగ్గురూ వ్యవసాయం గురించి మాట్లాడటం సిగ్గుచేటు

ఇచ్చిన మాటకంటే మిన్నగా రైతు భరోసా

సున్నా వడ్డీకి పంట రుణాలు

అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తున్న ఆర్బీకేలు

వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో వ్యవసాయ తీర్మానంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

ఎన్నికలకు ముందు ఏటా రూ.12,500 చొప్పున రైతు భరోసా కింద ఐదేళ్లలో రూ.50 వేలు ఇస్తామన్నాం. కానీ ఇచ్చిన మాటకంటే మిన్నగా రూ.13,500 చొప్పున ఐదేళ్లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 52.35 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.23,875.29  కోట్ల సాయం అందించాం.

సున్నా వడ్డీ పంట రుణాలిస్తున్నాం. క్రమం తప్పకుండా రుణాలు చెల్లించిన రైతులకు వడ్డీరాయితీ ఇస్తున్నాం. టీడీపీ హయాంలో చెల్లించాల్సిన బకాయిలతో కలిపి రూ.1,282 కోట్ల వడ్డీ రాయితీ అందించాం.

వైఎస్సార్‌ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా అండదండలందిస్తూ, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ రెండో రోజు వ్యవసాయంపై ప్రవేశపెట్టిన తీర్మానంపై మంత్రి మాట్లాడారు. ‘రైతునని చెప్పుకునే చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌’ వేరు శనగ ఎలా కోయాలంటే నిచ్చెన ఎక్కి కొయ్యాలన్నారు. వంకాయ పప్పు ఎలా వండాలో రూ. 20 వేలు ఖర్చు చేసి నేర్చుకున్నాడు లోకేష్‌. అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు రైతులను పట్టించుకోలేదు.

వీరు ముగ్గురూ ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలంటూ చంద్రబాబు హేళన చేశారు. విద్యుత్‌ బకాయిల కోసం ఆందోళన చేసిన రైతులను పిట్టల్లా కాల్చి చంపారు. రైతులపై అక్రమంగా కేసులు బనాయించారు. అదే చంద్రబాబు ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారు.’ అని ధ్వజమెత్తారు. ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టింది మొదలు గడిచిన మూడేళ్లుగా ప్రతి విషయంలోనూ రైతుకు అండగా నిలిచాం. చేయిపట్టి నడిపిస్తున్నాం. సీఎం జగన్‌ వ్యవసాయ రంగ చరిత్రను తిరగారాస్తున్నారు.

అందుకే నిండు నూరేళ్లూ ఆయనే సీఎంగా ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. పాలకుడు మంచి వాడైతే ప్రకృతి సహకరిస్తుందని మూడేళ్లుగా చూస్తున్నాం. కరువు తీరా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. సంపూర్ణంగా సాగు నీరు అందిస్తున్నాం. లక్ష్యానికి మించి పంటలు పండుతున్నాయి. జగనన్న పాలనలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు’ అని మంత్రి కాకాణి తెలిపారు.

ఏపీలో వ్యవసాయాభివృద్ధిపై మంత్రి చెప్పిన అంశాలు.. 
► పైసా భారం పడకుండా పంటల బీమా అందిస్తున్నాం. చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలతో కలిపి ఇప్పటి వరకు రూ.6,684.84 కోట్ల బీమా అందించాం. గత ఖరీఫ్‌కు సంబంధించి రికార్డు స్థాయిలో రూ.2,977.82 కోట్ల బీమా సొమ్ము జమ చేశాం.
► సీజన్‌ ముగియకుండానే పెట్టుబడి రాయితీ ఇస్తున్నాం. పాత బకాయిలతో కలిపి రూ.1,612.80 కోట్లు ఇచ్చాం. 
► ఇలా వివిధ పథకాల ద్వారా మూడేళ్లలో రైతులకు రూ.1.10 లక్షల కోట్లు నేరుగా లబ్ధి చేకూర్చాం.
► రైతుల కోసం గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేలు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాయి. 
► నాణ్యమైన ఇన్‌పుట్స్‌ అందించేందుకు నియోజకవర్గ స్థాయిలో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. గ్రామ స్థాయిలో అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పరికరాలు అందిస్తున్నాం. ఇటీవలే సీఎం 3,800 ట్రాక్టర్లు, 320 హార్వెస్టర్లు అందించారు. గతంలో రైతురథాల పేరిట దోపిడి జరిగింది.  ఏ కంపెనీ వద్ద ఏ మోడల్‌ ట్రాక్టర్‌ కొనాలో ప్రభుత్వ పెద్దలే నిర్ణయించేవారు. మార్కెట్‌ రేటుకంటే ఎక్కువ రేటుతో కొనాల్సి వచ్చేది. ఆ సొమ్ము టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లేది. కానీ నేడు 175 మోడల్స్‌ రైతుల ముందుంచాం. కోరుకున్న కంపెనీ నుంచి కోరుకున్న మోడల్‌ ట్రాక్టర్‌ కొనుగోలుచేసే అవకాశం కల్పించాం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top