ఏపీ వైపు ఐటీ దిగ్గజాల చూపు..

IT MNC Companies Focus On Build Their Companies In AP - Sakshi

సాక్షి, అమరావతి: అంతర్జాతీయ ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్‌ సంక్షోభం తర్వాత ఐటీ కంపెనీలు చిన్న పట్టణాల వైపు చూస్తుండటంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి వివరిస్తోంది.

దీంతో దిగ్గజ ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్రా, అసెంచర్, హెచ్‌సీఎల్, అదానీలతో పాటు ఐటీ పార్కులను నిర్మించే రహేజా వంటి సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి  ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్‌ తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 3,000 సీటింగ్‌ సామర్థ్యంతో విశాఖలో ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, తొలి విడతలో 1,000 మందితో ప్రారంభించనుంది. ఇందుకోసం మధురవాడ సమీపంలో అందుబాటులో ఉన్న బిల్డింగ్‌లను ఇన్ఫోసిస్‌కు చూపించామని, ఒకటి రెండు నెలల్లో ఆ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. 

ఇదే సమయంలో విజయవాడలో ఇప్పటికే ఉన్న హెచ్‌సీఎల్‌.. తన కార్యకలాపాలను విశాఖకు విస్తరించే యోచనలో ఉంది. విశాఖలో మరో భారీ కేంద్రం ఏర్పాటుకు గల అవకాశాలను హెచ్‌సీఎల్‌ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. వివిధ రంగాల్లో విస్తరించి ఉన్న అదానీ గ్రూపు రూ.14,634 కోట్ల పెట్టుబడితో 130 ఎకరాల విస్తీర్ణంలో డేటా సెంటర్‌తో పాటు ఐటీ పార్కు, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి సంబంధించిన పనులను త్వరలో ప్రారంభించనుంది. యాంకర్‌ కంపెనీలు విశాఖకు వస్తుండటంతో ఐటీ పార్కుల నిర్మాణ రంగ సంస్థల చూపు ఇప్పుడు ఆ నగరంపై పడింది. ఐటీ పార్కుల నిర్మాణ సంస్థ రహేజా గ్రూపు విశాఖలో 17 ఎకరాల విస్తీర్ణంలో ఇన్‌ ఆర్బిట్‌మాల్‌ షాపింగ్‌ మాల్‌తో పాటు ఐటీ పార్కు నిర్మాణం చేపట్టనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ పోర్టుకు సంబంధించిన 17 ఎకరాల భూమిని రహేజా గ్రూపు కొనుగోలు చేసింది. 

విజయవాడకు టెక్‌ మహీంద్ర
టెక్‌ మహీంద్రా తన కార్యకలాపాలను విజయవాడకు విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో సీపీ గుర్నాని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తెలియజేశారు. ఇప్పటికే విశాఖలో ఉన్న తాము విజయవాడలో కూడా అడుగు పెట్టామంటూ సీఎంను కలిసిన అనంతరం గుర్నానీ ట్వీట్‌ చేశారు. అంతకు ముందు దావోస్‌లో గుర్నానిని కలిసిన సీఎం జగన్‌.. రాష్ట్రంలో కార్యకలాపాలను మరింతగా విస్తరించాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. విజయవాడాలోని మేథా టవర్స్‌లో ప్రస్తుతం 100 మందితో కార్యకలాపాలను ప్రారంభించగా, త్వరలో ఆ సంఖ్యను 1,000కి చేర్చాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తగిన భవనాలను కోసం అన్వేషిస్తోంది. 

మరో ఐటీ దిగ్గజ సంస్థ అసెంచర్స్‌ కూడా విజయవాడలో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. 1,000 మంది సీటింగ్‌ సామర్థ్యంతో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా తొలుత 200–300 సీటింగ్‌ సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇదే సమయంలో ఇండియాకు చెందిన అతి పెద్ద ఐటీ కంపెనీ ఒకటి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. రాష్ట్రంలో ఐటీ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా విశాఖ వేదికగా ఒక భారీ ఐటీ సదస్సును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది.

కోవిడ్‌తో చిన్న ఊళ్ల వైపు చూపు
అంతర్జాతీయంగా పని చేస్తున్న ఐటీ నిపుణుల్లో 20 శాతం మంది మన రాష్ట్రం నుంచే ఉన్నారని అంచనా. ప్రతి ఐదుగురిలో ఒకరు మన రాష్ట్రం నుంచి ఉన్నట్లు వివిధ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కోవిడ్‌ తర్వాత చాలా మంది బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి ఆఫీసులకు వెళ్లి పని చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో 10 శాతం మించి ఉద్యోగులు ఆఫీసులకు రావడం లేదు. ఇదే అంశాన్ని వివరిస్తూ ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. తక్షణం ప్రభుత్వం వద్ద బిల్డింగ్‌లు లేకపోవడంతో అందుబాటులో ఉన్న ప్రైవేటు బిల్డింగ్‌లలో కార్యకలాపాలు ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నాం. ఐటీ కంపెనీలను ఆకర్షించే విధంగా రాయితీలతో పాటు, వాటి కార్యకలాపాలు సజావుగా సాగేలా అపిటా (ఏపీఈఐటీఏ– ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ ఏజెన్సీ) ద్వారా చేయూత అందిస్తున్నాం. ప్రభుత్వ చర్యలపై కంపెనీలకు నమ్మకం పెరగడంతో ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకు వస్తున్నాయి.
– ఎం.నందకిషోర్, ఎండీ, ఏపీ టెక్నాలజీస్‌ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌)

చిన్న కంపెనీల ఏర్పాటుకు మార్గం సుగమం 
ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టెక్‌ మహీంద్రా, అసెంచర్స్‌ వంటి ఐటీ యాంకర్‌ కంపెనీలు రాష్ట్రానికి వస్తుండటంతో వాటికి అనుబంధంగా అనేక చిన్న కంపెనీలు ఏర్పాటు కావడానికి మార్గం సుగమం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఏర్పాటు చేయనున్న హై ఎండ్‌ స్కిల్‌ యూనివర్సిటీ అందుబాటులోకి వస్తే మర్ని ఐటీ కంపెనీలు విశాఖకు క్యూ కడతాయి. ఐటీ కంపెనీలను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితాలు ఇస్తోంది. త్వరలో స్థానిక యువతకు ఇక్కడే ఉపాధి లభిస్తుందని ఆశిస్తున్నాం.
– శ్రీధర్‌ కోసరాజు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ (ఐటాప్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top