చెన్నూరు ఆర్బీకేకు ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ | Sakshi
Sakshi News home page

చెన్నూరు ఆర్బీకేకు ఐఎస్‌వో సర్టిఫికేషన్‌

Published Tue, Jan 4 2022 4:05 AM

ISO certification to Chennur YSR Rythu Bharosa Centre - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలోనే రైతులకు సమస్త సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు అరుదైన గౌరవం లభించింది. దశల వారీగా ఆర్బీకేలు ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ సాధించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం ఫలించే దిశగా అడుగుపడింది. ఏడాదిన్నరగా అత్యుత్తమ సేవలందిస్తున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు రైతు భరోసా కేంద్రానికి ఐఎస్‌వో సర్టిఫికేషన్‌–9001–2015 దక్కింది. ఇటీవల చెన్నై నుంచి వచ్చిన ఐఎస్‌వో ఏజెన్సీ బృందం ఈ కేంద్రాన్ని సందర్శించింది. రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత, పారదర్శకంగా అందిస్తున్న సేవలను ప్రామాణికంగా తీసుకొని అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఈ కేంద్రం ఉందని నిర్ధారించింది. ఆ మేరకు చెన్నూరు ఆర్బీకేకి ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ జారీ చేసింది. 

చెన్నూరు ఆర్బీకే ప్రత్యేకతలివే..
చెన్నూరు ఆర్బీకే పరిధిలో 1,600 మంది రైతులుండగా 3 వేల ఎకరాలకు పైగా సాగు భూమి ఉంది. రూ.21.80 లక్షలతో నిర్మించిన నూతన భవనంలో రైతులకు సేవలందిస్తున్నారు. గతేడాది 267 మందికి 44.5 ఎంటీల యూరియా, 45 మందికి 105 బస్తాల పచ్చిరొట్ట, 20 మందికి 30 బస్తాల జీలుగు విత్తనాలు, 40 మందికి 75 బస్తాల వరి విత్తనాలు పంపిణీ చేశారు. సిద్ధారెడ్డిపాళెం, కట్టుబడిపాళెం గ్రామాల్లోని 60 మంది రైతుల క్షేత్రాల్లో రెండు పొలంబడులు నిర్వహించారు. రూ.9.52 కోట్ల అంచనా వ్యయంతో వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ యోజన, సున్నావడ్డీ పంట రుణాలు, పంటల బీమా వంటి పథకాల ద్వారా ఆర్బీకే పరిధిలో అర్హులైన ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చారు. ఆర్బీకేలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా 8.78 కోట్ల విలువైన 1.15 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. 

Advertisement
Advertisement