
దారం, వస్త్ర తయారీలో శిక్షణకు 30 మంది రైతుల ఎంపిక
యంత్రాల కోసం రూ.20.54 లక్షలు మంజూరు
చెన్నూర్: దసలి పట్టుకాయ దిగుబడిలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంటున్న మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టు పరిశ్రమ మరో అడుగు ముందుకేసింది. రైతులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పట్టు దారం, వస్త్ర తయారీకి సన్నద్ధం అవుతోంది. వస్త్ర తయారీకి అవసరమైన యంత్రాల కోసం ప్రభుత్వం రూ.20.54 లక్షలు మంజూరు చేసింది.
దారం, వస్త్రాల తయారీపై శిక్షణకు 30 మంది రైతులను ఎంపిక చేశారు. నెల రోజులపాటు నిపుణులతో చెన్నూర్ పట్టు పరిశ్రమలో శిక్షణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో మూడు నెలల్లో చెన్నూర్ కేంద్రంగా పట్టు వస్త్రాల ఉత్పత్తి ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.
రెండు నెలల శ్రమతో రూ.1.5 లక్షల సంపాదన
అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గిరిజన, ఎస్సీ, బీసీ నిరుపేద రైతులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దసలి పట్టు కాయ సాగును ప్రోత్సహిస్తోంది. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో భూమి లేని రైతులను గుర్తించి దసలి కాయ పండించే విధానంపై శిక్షణ ఇచ్చింది. గత మూడు దశాబ్దాలుగా ఇక్కడ సుమారు వెయ్యి మంది రైతులు 7,500 ఎకరాల్లో దసలి పట్టు కాయలు పండిస్తున్నారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గొల్లతరివిడి, కౌటాల, బెజ్జూర్, మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మన్నెగూడెం, కోటపల్లి మండలం కొత్తపల్లి, రాజారాం, లింగన్నపేట, నాగంపేట, ఎదుల్లబంధం, వేమనపల్లి మండలం ముల్కల్లపేట, చెన్నూర్ మండలం కిష్టంపేట, లింగంపల్లి గ్రామాల్లో దసలికాయను పండిస్తూ ఉపాధి పొందుతున్నారు. రెండు నెలల శ్రమతో ఒక్కో రైతు రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు సంపాదిస్తున్నారు.
మూడు నెలల్లో వస్త్ర తయారీ ప్రారంభం గత ఏడాది దసలి పట్టు రైతుల కిసాన్ మేళాలో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.40 లక్షలు మంజూరు చేసింది. నిర్మాణం పూర్తి కాగా ఇటీవల మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. భవనంలో దారం తీసే యంత్రాలను అమర్చి రీలింగ్ చేసి వస్త్రం ఉత్పత్తి చేస్తాం. త్వరలో రైతులకు శిక్షణ తరగతులు ప్రారంభించి మూడు నెలల్లో వస్త్రం తయారు చేస్తాం. –పార్వతి రాథోడ్, ఏడీ, సెరికల్చర్