
రికవరీ చేసిన ఆభరణాలను పరిశీలిస్తున్న సీపీ
ఎస్‌బీఐ బ్యాంకుకే కన్నం వేసిన క్యాషియర్
సహకరించిన మేనేజర్..మరో 42 మంది
25.17 కిలోల బంగారం, రూ.1.10 కోట్ల నగదు చోరీ
వివరాలు వెల్లడించిన రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా వెల్లడి
గోదావరిఖని/చెన్నూర్: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడు. ఒకసారికాదు.. అనేకసార్లు అదే ఆట ఆడి డబ్బు పోగొట్టుకున్నాడు. ఆ డబ్బు సంపాదించేందుకు మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్‌బీఐలో క్యాషియర్‌గా పనిచేస్తున్న నరిగె రవీందర్ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కోసం 402 గోల్డ్‌లోన్లకు సంబంధించిన 25.17కిలోల బంగారం, రూ.1.10 కోట్ల నగదు చోరీ చేశాడు. రీజియన్ మేనేజర్ రితేశ్‌కుమార్‌గుప్తా ఆగస్టు 23న ఇచ్చిన ఫిర్యాదుతో చోరీ విషయం వెలుగుచూసింది. రంగంలోకి దిగిన పోలీసులు వారంలో రోజుల్లోనే కేసు ఛేదించారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చోరీపై పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదివారం తన కార్యాలయంలో ఆ వివరాలు వెల్లడించారు.75 శాతం బంగారం రికవరీ చేశారు. ప్రధాన నిందితుడు బ్యాంకు క్యాషియర్ నరిగె రవీందర్..బ్యాంక్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్‌లతో కలిసి ఈ మోసానికి పాల్పడ్డాడు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు కేసు విచారణ జరిపి ఛేదించారు.
రూ.40 లక్షల నష్టాన్ని పూడ్చుకునేందుకు..
ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌తో రూ.40 లక్షలు కోల్పోయిన రవీంద ర్.. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు అదే బెట్టింగ్‌పై దృష్టి సారించాడు. దీనికి బ్రాంచ్ మేనేజర్ మనోహర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యో గి సందీప్‌తో కలిసి బంగారం, నగదుకు పక్కా ప్రణాళిక వేశాడు.
పదినెలలుగా.. పకడ్బందీగా..
ఏడాది క్రితం చెన్నూర్ బ్రాంచ్–2 ఎస్‌బీఐ క్యాషియర్‌గా బదిలీపై వెళ్లిన రవీందర్.. బ్యాంక్‌లో కుదువ పెట్టిన బంగారాన్ని తీసి వేరే బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందాడు. ఆ సొమ్మును బెట్టింగ్‌కు వెచ్చించాడు. గతేడాది అక్టోబర్ నుంచి గోల్డ్‌లోన్ చెస్ట్ నుంచి బంగారం తీసి తన స్నేహితులకు ఇచ్చి, ఆ బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టాడు. ఆ డబ్బును తమ బ్యాంకు ఖాతాల్లో జమచేసిన స్నేహితులకు కొంత కమీషన్ కూడా ముట్టజెప్పేవాడు. ఇలా 10 ప్రైవేట్ గోల్డ్ లెండింగ్ కంపెనీలు (ఎస్‌ఎఫ్‌సీ, ఇండెల్‌మనీ, ముత్తూట్‌ఫైనాన్స్, గోదావరి అర్బన్, మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ కార్ప్, ముత్తూట్ మినీ) 44 మంది పేర్లపై 142 గోల్డ్‌లోన్లు తీసుకున్నాడు.
బంగారం లేకుండానే.. గోల్డ్‌లోన్‌లు..
నరిగె రవీందర్ బంగారం లేకుండానే గోల్డ్ లోన్‌లు తీసుకున్నాడు. తన భార్య, బావమరిది, స్నేహితుల పేర్లతో 42 గోల్డ్‌లోన్లు మంజూరు చేసి 4.14 కిలోల బంగారం పేరుతో రూ.1.58 కోట్లు కాజేశాడు. ఏటీఎంలలో నగదు రీఫిల్ చేసే సమయంలో కూడా డబ్బు అపహరించేవాడు. ఈ కేసులో 15.23 కిలోల బంగారం రికవరీ చేశారు. గోల్డ్‌లోన్ మేనేజర్ల పాత్రపై విచారణ జరుగుతోంది.
15.237 కిలోల బంగారం రికవరీ
చోరీ కేసులో ప్రధాన నిందితుడు రవీందర్, మేనేజర్ మనోహర్‌తోపాటు మరో 42 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరి నుంచి 15.237 కిలోల బంగారు ఆభరణాలు, రూ.1.61 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
44 మంది నిందితుల అరెస్ట్..
ప్రధాన నిందితుడు నరిగె రవీందర్, బ్యాంకు మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, లక్కాకుల సందీప్, ఎస్‌బీఎఫ్‌సీ సేల్స్ మేనేజర్ కొంగొంటి భీరే‹Ù, కస్టమర్ రిలేషన్ మేనేజర్ కోదాటి రాజశేఖర్, సేల్స్ ఆఫీసర్ బొల్లి కిషన్‌కుమార్‌తోపాటు మరో 38మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్వల్ప వ్యవధిలోనే కేసును ఛేదించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, చెన్నూర్ సీఐ దేవేందర్‌రావు, రూరల్ సీఐ బన్సీలాల్, శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ తదితరులను సీపీ అభినందించి రివార్డులు అందజేశారు.