
ఆదిలాబాద్ జిల్లా: మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఓ యువకుడు నటనలో ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. పాఠశాలలో చదువుకునే రోజుల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న తను ఇప్పుడు ఏకంగా సినిమాలో హీరోగా నటిస్తూ అందరి మన్ననలు పొంతున్నాడు. ఆయనే కుంటాలకు చెందిన రాధా –శేఖర్ రావు పాటిల్ దంపతుల కుమారుడు దావు నవికేత్. హైదరాబాద్‌లో బీపార్మసీ చదివేందుకు వెళ్లిన నవికేత్ చదువుకునే రోజుల్లో సినిమా రంగంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. చిన్ననాటి నుంచి నటనపై ఉన్న అభిరుచి ఆయనను సినిమాల వైపు మళ్లించింది.
తనదైన గుర్తింపు..
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే అనే మూవీతో వెండితెరపై నటించే అవకాశం నవికేత్‌కు దక్కింది. దేత్తడి యూట్యూబ్ ఛానల్ ద్వారా నటనలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమ అంతా ఈజీ కాదు మూవీలో ప్రత్యేక పాత్రలో మెప్పించాడు. జెర్సీ సినిమాలో హీరో నానితో కలిసి క్రికెటర్‌గా ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. లవ్ స్టోరీ సినిమాలో హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవితో కలిసి నటించడం ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ప్రస్తుతం భార్గవ చారి దర్శకత్వంలో జకాస్ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో ఆలీ, పృథ్వి హాస్యనటులతో డబ్బులు ఎవరికి ఊరికే రావు వర్కింగ్ టైటిల్‌లో హీరోగా అవకాశం సంపాదించాడు. చట్టానికి వ్యతిరేక పనులు చేసే వ్యక్తి చుట్టూ తిరిగే కథ ఆధారంగా వీఎస్వీ(వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన) డైరెక్షన్‌లో రూపొందిస్తున్న విద్రోహి మూవీలో నవికేత్ నటిస్తున్నారు. ఈ మూవీ ఈనెల 24న విడుదల కానుంది. గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్లి సినిమాలో రాణిస్తున్న నవికేత్ కొత్త నటీనటులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
సినిమా రంగంపై ఆసక్తి
చదువుకునే రోజుల్లో నట నపై ఆసక్తి ఉండేది. అదే నన్ను సినిమా రంగం వైపు మళ్లించింది. అందివచ్చిన అవకాశాలను ఎప్పుడూ వదులుకోలేదు. నటనలో ప్రతిభ కనబర్చి మంచి పేరు సంపాదిస్తా.
– దావు నవికేత్, నటుడు టాలీవుడ్‌లో రాణిస్తున్న యువ కెరటం