మందుల కొనుగోళ్లలో మాయాజాలం | Irregularities have also come to light in the procurement of medicines | Sakshi
Sakshi News home page

మందుల కొనుగోళ్లలో మాయాజాలం

Mar 21 2026 4:44 AM | Updated on Mar 21 2026 4:44 AM

Irregularities have also come to light in the procurement of medicines

అజిత్రోమైసిన్‌ వంద మాత్రలు రూ.177కు సరఫరా చేసేలా కాంట్రాక్టు 

ఆ మందులు సరఫరా చేయలేదనే సాకుతో మరో సంస్థ నుంచి రూ.869కు కొనుగోలు  

వెలుగులోకి ఏపీఎంఎస్‌ఐడీసీ మరో బాగోతం

సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ప్రజాధనం దోపిడీతో అవినీతికి కేంద్ర బిందువుగా మారిపోయింది. సంస్థ కేంద్రంగా సాగుతున్న దోపిడీ వెనుక వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మార్కెట్‌లో రూ.1.50 లక్షల కంటే ఎక్కువ విలువ చేయని వ్యాక్యూమ్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ పరికరాన్ని ఏకంగా రూ.3.13 లక్షలకు కొనుగోలు చేసిన దోపిడీ ఉదంతం ఇటీవలే వెలుగు చూసింది.

ఇప్పుడు మందుల కొనుగోళ్లలోనూ అక్రమాలు బయటపడ్డాయి. అజిత్రోమైసిన్‌ 500 ఎంజీ వంద మాత్రలను రూ.177కు సరఫరా చేసేలా యూనిక్యూర్‌ ఇండియా సంస్థ గతంలో రేట్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకుంది. ఆ సంస్థ మందులు సరఫరా చేయలేదన్న సాకుతో స్ట్రైడ్‌ ఆర్గానిక్‌ సంస్థతో ఏకంగా రూ.869 చొప్పున చెల్లించి మాత్రల కొనుగోళ్లు చేపడుతోంది. అంటే రూ. 692 ఎక్కువ చెల్లిస్తున్నారు. 

కనీసం ప్రయత్నించకుండా 
నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఎల్‌–1 సంస్థ మందులు సరఫరా చేయకపోతే.. వెంటనే బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టి పెనాల్టీ విధించాలి. ఆ సంస్థ సరఫరా చేసే ధరకే మందుల కొనుగోళ్లకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేíÙంచాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఎల్‌–1 సంస్థ ధరకు ఎల్‌2, ఎల్‌3 సంస్థలు మందులు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంటే అదే ధరకు కొనుగోలుచేయాలి. లేనిపక్షంలో అదే ధరకు కార్పొరేషన్‌లోని ఇతర సరఫరా సంస్థలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. 

ఈ కొనుగోళ్లలో ప్రభుత్వంపై అదనపు భారం పడితే ఆ మొత్తాన్ని కూడా ఎల్‌–1 సంస్థ నుంచే రాబట్టాలి. ప్రస్తుత ఘటనలో ఈ ప్రయత్నాలేమీ చేయకుండా.. నేరుగా ఎల్‌–2 సంస్థను కూడా పక్కనపెట్టి ఎల్‌–3 అయిన స్ట్రైడ్‌ ఆర్గానిక్‌ సంస్థకు వంద మాత్రలకు రూ.869 చెల్లించేలా ఆర్డర్‌లు ఇచ్చేశారు. ఎల్‌–1 యూనిక్యూర్‌ ధర కంటే రూ.692 అధిక మొత్తంతో స్ట్రైడ్‌ ఆర్గానిక్‌ నుంచి మందులు కొనుగోలు చేయడం వెనుక డ్రగ్స్‌ విభాగంలోని కీలక అధికారి పాత్ర ఉందని ఆరోపణలున్నాయి. 

వాస్తవానికి ఎంఎస్‌ఐడీసీ ప్రభుత్వాస్పత్రుల కోసం లక్షల సంఖ్యలో మాత్రలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో హోల్‌సేల్‌ ధరల కంటే అత్యంత తక్కువ ధరకు మందులు సరఫరా చేయడానికి ఫార్మా సంస్థలు పోటీ పడుతుంటాయి. ఈ నేపథ్యంలో అజిత్రోమైసిన్‌ వంద మాత్రలకు రూ.869 చెల్లించడం చూసి మందుల సరఫరా సంస్థలే ఆశ్చర్యపోతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement