నౌకాదళ అమ్ములపొదిలో ఐఎన్‌ఎస్‌ అర్నాలా | Indian Navy strategic plan for coastal defense | Sakshi
Sakshi News home page

నౌకాదళ అమ్ములపొదిలో ఐఎన్‌ఎస్‌ అర్నాలా

Jun 18 2025 3:00 AM | Updated on Jun 18 2025 3:00 AM

Indian Navy strategic plan for coastal defense

విశాఖ కేంద్రంగా నేడు జాతికి అంకితం

శత్రుదేశాల సబ్‌మెరైన్లను తుత్తునియలు చేసే శక్తి, సామర్థ్యాలు దీని సొంతం 

11,098 కి.మీ.తీర ప్రాంత రక్షణకు భారత నావికాదళ వ్యూహాత్మక ప్రణాళిక 

ఆయుధ సంపత్తిని భారత్‌ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకునే స్థాయికి చేరుకుంది. మరో 11వేల కి.మీ.కుపైగా భారత తీర ప్రాంతం శత్రుదుర్భేద్యంగా మారనుంది. ఏకంగా 16 యాంటీ సబ్‌ మెరైన్‌ యుద్ధనౌకలు భారత నావికాదళ అమ్ములపొదిలోకి చేరనున్నాయి. ఇందులో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ షాలో వాటర్‌ క్రాఫ్టŠస్‌ (ఏఎస్‌డబ్ల్యూ–ఎస్‌డబ్ల్యూసీ) ఐఎన్‌ఎస్‌ ‘అర్నాలా’ యుద్ధనౌక తూర్పు నావికాదళంలో ఈ నెల 18వ తేదీ నుంచి సేవలందించేందుకు సిద్ధమైంది. విశాఖపట్నంలోని షిప్‌యార్డు ఇందుకు వేదిక కానుంది. 

ఈ కార్యక్రమంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌తో పాటు తూర్పు నావికాదళం(ఈఎన్‌సీ) కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ రాజేష్‌ పెందార్కర్‌ పాల్గొననున్నారు. మహారాష్ట్రలోని సుప్రసిద్ధ కోట అర్నాలాకు గుర్తుగా తయారు చేసిన ఈ యుద్ధ నౌక ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని, శత్రుదేశాల లక్ష్యాలను అత్యంత కచి్చతత్వంతో విచి్ఛన్నం చేయగలుగుతుందని నావికాదళ వర్గాలు పేర్కొంటున్నాయి. తీర ప్రాంతాల్లో తక్కువ నీటిలోనూ కలియతిరుగుతూ పహారా కాయడం ద్వారా దేశంలోని వాణిజ్య నౌకాశ్రయాలు, నావికాదళ స్థావరాలను రక్షిస్తుంది. 

సముద్ర ఉపరితంతో పాటు లోపలి నుంచి కూడా శత్రుదేశాల దాడులను ఎదుర్కొనే లక్ష్యంతో మొత్తం 16 యుద్ధ నౌకలను రూ.12,622 కోట్లతో కేంద్రం నిరి్మస్తోంది. కొచ్చిన్‌ షిప్‌యార్డులో నిర్మితమైన ఈ అర్నాలాతో పాటు మరో 15 యాంటీ సబ్‌మెరైన్లు వివిధ దశల్లో ఉన్నాయి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

16షాలో వాటర్‌క్రాఫ్ట్స్‌ ఇవే..
మొత్తం 16 యుద్ధ నౌకల్లో ఎనిమిది అర్నాలా తరగతి శ్రేణికి చెందినవి కాగా, మరో 8 మహే తరగతి శ్రేణికి చెందినవి. అర్నాలా, అంజదిప్, అమిని, అభయ్, ఆగ్రే(2), ఆందోథ్, అక్షయ్‌.. ఇవి అర్నాలా శ్రేణికి చెందినవి. మహే, మాల్వాన్, మ్యాంగ్రోల్, మాల్పే, ముల్కి, మగ్దాలా, మచిలీపట్నం(2) మహే తరగతి శ్రేణికి చెందిన యుద్ధ నౌకలు. కాగా, మహే యుద్ధనౌకను ఆగస్టులో అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇక ‘మచిలీపట్నం’ జలాంతార్గమి 2028 జూన్‌ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన వాటిల్లో కొన్ని నిర్మాణ దశలో ఉండగా, మరికొన్ని సముద్రంలో ట్రయల్‌ చేస్తున్నారు. మొత్తంగా ఈ యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్స్‌ అన్నీ నావికాదళంలో చేరితే మన సముద్ర తీరం పూర్తి స్థాయిలో శత్రుదుర్భేద్యంగా మారుతుందనడంలో సందేహం లేదు.

ఇవీ అర్నాలా విశేషాలు.. 
77.6 మీటర్ల పొడవున్న ఈ స్వదేశీ నౌక 1,490 టన్నుల బరువు కలిగి ఉంటుంది. డీజిల్‌ ఇంజిన్‌–వాటర్‌జెట్‌తో కూడిన ప్రొపల్షన్‌ వల్ల ఇది 25 నాట్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. దీని ఇంధన సామర్థ్యం 1800 నాటికల్‌ మైళ్లు. భారతీయ నౌకాదళంలో సేవలందిస్తున్న అభయ్‌ క్లాస్‌ ఏఎస్‌డబ్ల్యూ స్థానంలో ఈ ఐఎన్‌ఎస్‌ అర్నాలా క్లాస్‌ యుద్ధ నౌకను భర్తీ చేయనున్నారు. అభయ్‌ తరగతి నౌకల కంటే వీటి తీరప్రాంత రక్షణ సామర్థ్యం మరింత మెరుగైనదిగా చెబుతున్నారు. ఒక ఆర్‌బీయూ–6000 రాకెట్, రెండు  తక్కువ బరువు కలిగిన అత్యాధునిక టార్పెడోలను ప్రయోగించే లాంచర్స్‌ను దీనికి ఏర్పాటు చేశారు. 

ఇందులో ఇంకా..
» శత్రు జలాంతర్గాములను గుర్తించి, వాటిని అడ్డుకునేందుకు అత్యాధునిక హల్‌–మౌంటెడ్‌ సోనార్‌(హెచ్‌ఎంఎస్‌) 
వ్యవస్థను ఏర్పా­టు చేశా­రు. ఈ సాంకేతికత కూడా స్వదేశీ పరిజ్ఞానమే.
»   ప్రధానంగా ఉపరితలం నుంచి శత్రుదేశాల దాడిని ఎదుర్కొనేందుకు వీలుగా దీనికి ఎలక్ట్రో ఆప్టికల్‌ ఫైర్‌ కంట్రోల్‌ సిస్టం(ఈవోఎఫ్‌సీఎస్‌)తో అనుసంధానించి, 30ఎంఎం నేవల్‌ సర్ఫేస్‌ గన్‌(ఎన్‌ఎస్‌జీ)ను ఉపయోగించేందుకు అనువుగా తయారు చేశారు.
»  వీటిని తీర ప్రాంతాల వద్ద కూడా మోహరించి, 370 కిలోమీటర్ల దూరం వరకూ రక్షించుకునే వెసులుబాటు ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement