కొట్టేశారు! | - | Sakshi
Sakshi News home page

కొట్టేశారు!

Jul 10 2026 7:46 AM | Updated on Jul 10 2026 7:46 AM

వీఎంఆర్‌డీఏ స్థలాలు
లక్కీగా
కమ్యూనిటీ హాల్‌ను కూల్చివేసి మరీ విక్రయం కాలనీ వాసుల అభ్యంతరాలను బేఖాతరు చేసిన వీఎంఆర్‌డీఏ మిథిలాపురిలో కమర్షియల్‌ స్థలం గజం రూ.68 వేలకే అప్పగింత అదే ప్రాంతంలో మార్కెట్‌ ధర గజం రూ.1.5 లక్షలకు పైమాటే ఆన్‌లైన్‌ వేలం పేరుతో ‘లక్కీ’గా కొట్టేసిన వైనం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

కవైపు ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ప్రజల అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాలనూ వదలడం లేదు. ఓపెన్‌ స్పేస్‌లు, పార్కులు, సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలను సైతం విక్రయించేందుకు ప్రభుత్వ సంస్థలే ముందుకు రావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు అదే అనుమానాలకు తావిస్తోంది. మధురవాడ మిథిలాపురి కాలనీలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన 300 గజాల ఓపెన్‌ స్థలాన్ని ఇప్పటికే విక్రయించిన వీఎంఆర్‌డీఏ.. ఇప్పుడు అదే లేఅవుట్‌లో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న 733.63 గజాల అత్యంత విలువైన కమర్షియల్‌ స్థలాన్ని కూడా కారుచౌకగా ఒక ప్రైవేట్‌ సంస్థకు ’లక్కీ’గా కట్టబెట్టింది. అది కూడా మార్కెట్‌ ధరకు దరిదాపుల్లో కాకుండా, దాదాపు రిజిస్ట్రేషన్‌ విలువకే విక్రయించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గజం మార్కెట్‌ ధర రూ.1.50 లక్షలకు పైగానే ఉంది. అలాంటి స్థలాన్ని వీఎంఆర్‌డీఏ గజం కేవలం రూ.68 వేలకే ఆన్‌లైన్‌ వేలంలో విక్రయించింది. అదే ప్రాంతంలో, ప్రధాన రోడ్డుకు లోపల ఉన్న మరో 300 గజాల స్థలాన్ని గతంలో గజం రూ.82 వేల చొప్పున విక్రయించగా.. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న కమర్షియల్‌ బిట్‌ను అంతకంటే తక్కువ ధరకే కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌ విలువ ప్రకారం సుమారు రూ.11 కోట్ల వరకు పలికే ఈ స్థలాన్ని కేవలం రూ.4.98 కోట్లకే అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.

రిజిస్ట్రేషన్‌ ధరకే ’లక్కీ’ ఛాన్స్‌

ఈ స్థలానికి రిజిస్ట్రేషన్‌ విలువ గజానికి రూ.60 వేలు. మార్కెట్‌లో మాత్రం రూ.1.50 లక్షలకు పైగా ధర పలుకుతోంది. అయినప్పటికీ వీఎంఆర్‌డీఏ కేవలం రిజిస్ట్రేషన్‌ ధర కంటే గజానికి రూ.8 వేలు మాత్రమే అధికంగా నిర్ణయించి విక్రయించింది. గత ఏడాది నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలంలో బిడ్‌ దక్కించుకున్న సంస్థకు ఈ ఏడాది జూన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా పూర్తిచేసింది. 733.63 గజాల ఈ స్థలం రిజిస్ట్రేషన్‌ విలువ రూ.4.49 కోట్లు కాగా, కొనుగోలు ధర రూ.4.98 కోట్లు మాత్రమే. అంటే రిజిస్ట్రేషన్‌ విలువ కంటే కేవలం రూ.49 లక్షలు అదనంగా చెల్లించి అత్యంత విలువైన కమర్షియల్‌ స్థలాన్ని సొంతం చేసుకుంది. వాస్తవానికి మార్కెట్‌ విలువకు దూరంగా బిడ్లు నమోదైతే వేలాన్ని రద్దు చేసి తిరిగి నిర్వహించే అవకాశం వీఎంఆర్‌డీఏకు ఉంది. అయినప్పటికీ ఆ నిర్ణయం తీసుకోకుండా అత్యల్ప వ్యత్యాసంతో వచ్చిన బిడ్‌కే స్థలాన్ని అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు స్థానికులు అడ్డుపడుతున్నారంటూ సదరు సంస్థ ఫిర్యాదు చేయడంతో వీఎంఆర్‌డీఏ పోలీసు రక్షణ కోరింది. పోలీసు బందోబస్తుతో స్థలాన్ని అప్పగించే ప్రయత్నం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు పనిచేశాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

కమ్యూనిటీ హాల్‌ను కూల్చేసి..

మిథిలాపురి కాలనీలో సర్వే నంబర్‌ 278/పీలోని ఈ 733.63 గజాల స్థలంలో కాలనీ వాసుల కోసం గతంలో కమ్యూనిటీ హాల్‌ను నిర్మించారు. ఆ తర్వాత దీనిని కొంతకాలం పోలీసు స్టేషన్‌గా, ఆపై గ్రామ సచివాలయంగా కూడా ఉపయోగించారు. ఇటీవల సచివాలయం కొత్త భవనానికి మారిన తర్వాత ఈ భవనాన్ని లైబ్రరీగా మార్చుకోవాలని స్థానికులు భావించారు. అయితే కమ్యూనిటీ హాల్‌ను కూల్చివేసి, ఆ స్థలాన్ని వేలం పేరుతో ఓ ప్రైవేట్‌ సంస్థకు ’లక్కీ’గా అప్పగించేందుకు స్కెచ్‌ వేశారు. వేలంలో అప్‌సెట్‌ ధరను కూడా తక్కువగానే నిర్ణయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్‌ ధరకు సమీపంలో బిడ్లు రాకపోతే వేలాన్ని రద్దు చేసి మళ్లీ నిర్వహించే అధికారం ఉన్నప్పటికీ.. ఆ మార్గాన్ని వదిలేసి పోలీసు బందోబస్తుతో స్థలాన్ని అప్పగించేందుకు వీఎంఆర్‌డీఏ చూపిన హడావుడి వెనుక కారణాలేమిటని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో ’లక్కీ’ చాన్స్‌ ఉండడంతోనే ఇంత తొందరపడ్డారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నమ్మించి ద్రోహం చేశారు

ఇళ్ల స్థలాలతో పాటు అన్ని వసతుల కోసం ప్రత్యేక స్థలాలు ఉంటాయని చెప్పి మాతో డబ్బులు కట్టించుకున్నారు. ఇప్పుడు న్యాయం చేస్తామని చెబుతూనే ఆ స్థలాలను అమ్మేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే స్థలంలో కల్యాణమండపం నిర్మించేందుకు శంకుస్థాపన చేసి టెండర్లు కూడా పిలిచారు. ప్రభుత్వం మారిన తర్వాత అన్నీ మారిపోయాయి. ఇప్పుడు మమ్మల్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటికి మేము భయపడేది లేదు.

– మగ్గూరి వెంకటరావు, అధ్యక్షుడు,

వుడా లేఅవుట్‌ హౌసింగ్‌ స్కీమ్‌ సొసైటీ

పోరాటం కొనసాగుతుంది

1991లో అప్పటి ప్రభుత్వం మిథిలాపురి లేఅవుట్‌ను అభివృద్ధి చేసినప్పుడు అన్ని సామాజిక అవసరాల కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించింది. అవి ఉన్నాయనే నమ్మకంతో మేము ఇక్కడ స్థిరపడ్డాం. ప్రస్తుతం సుమారు 1,600 ప్లాట్లతో పాటు అనేక అపార్ట్‌మెంట్లలో నాలుగు వేల మందికి పైగా నివసిస్తున్నారు. కాలనీ అవసరాల కోసం కేటాయించిన స్థలాలను విక్రయించడం అన్యాయం. వాటిని కాపాడుకునేందుకు అన్ని విధాలా పోరాటం కొనసాగిస్తాం. – త్రిమూర్తుల రాజు, అధ్యక్షుడు,

మిథిలాపురి లేఅవుట్‌ అసోసియేషన్‌

ఇది అన్యాయం

వుడా మా కాలనీని అభివృద్ధి చేసినప్పుడు స్కూల్‌, కమర్షియల్‌, పార్కులు, సామాజిక అవసరాల కోసం ప్రత్యేక స్థలాలు కేటాయిస్తున్నామని బ్రోచర్‌లో స్పష్టంగా చూపించారు. లేఅవుట్‌ మ్యాప్‌లో కూడా అవన్నీ ఉన్నాయి. వాటిని నమ్మే మేము ప్లాట్లు కొనుగోలు చేశాం. ఇప్పుడు కాలనీ వాసుల అవసరాల కోసం నిర్మించిన పాత పోలీసు స్టేషన్‌ భవనాన్ని ఒక్కరోజులోనే కూల్చేసి అమ్మేయడం చాలా అన్యాయం.

–మన్మథరావు, కార్యదర్శి, ఆర్‌సీడబ్ల్యూఏ,

మిథిలాపురి వుడా కాలనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement