అక్కిరెడ్డిపాలెం: సముద్రంలో జరిగిన బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి విశాఖలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారుడు చిన్నాను వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫోన్‌లో చిన్నాతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విజయనగరం జిల్లా అధ్యక్షుడు, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకిరామ్ ఉన్నారు.
ప్రభుత్వం విఫలం
ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉంటే.. ప్రభుత్వం వారిలో ధైర్యం నింపడంలో విఫలమైందని విమర్శించారు. మాజీ సీఎం జగన్ వ్యక్తిగతంగా చిన్నాతో మాట్లాడి ధైర్యం చెప్పడం, అవసరమైతే స్వయంగా విశాఖకు వస్తానని హామీ ఇవ్వడం ఆయన బాధ్యతాయుత నాయకత్వానికి నిదర్శనమన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాణాలతో బయటపడిన చిన్నాకు ప్రత్యేక ఆర్థిక సహాయం, మునిగిపోయిన పడవకు పూర్తి నష్టపరిహారం అందించాలన్నారు.
ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడంతోనే..
మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, బల మైన గాలులు వీస్తాయని ముందుగానే వాతావరణ హెచ్చరికలు జారీ అయినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించలేదన్నారు. మత్స్యకారుల భద్రత కోసం వార్‌రూమ్ ఏర్పాటు చేసి సముద్రంలో ఉన్న పడవలను ట్రాక్ చేయడం, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే రక్షణ చర్యలు చేపట్టే వ్యవస్థను ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రమాద సమాచారం కోస్ట్‌గార్డ్‌కు, సంబంధిత అధికారులకు ముందుగానే అందినప్పటికీ తక్షణ రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వేగంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఉంటే వారిని కాపాడే అవకాశం ఉండేదన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను అధికారులు పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.


