ఏపీలో ఎండ దంచి కొడుతోంది

Huge Sun Intensity and heat winds In AP - Sakshi

అక్కడక్కడా వడదెబ్బ కేసులు నమోదు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఓవైపు కరోనా ఉధృతి కొనసాగుతోంది. అంతేస్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వడదెబ్బ సోకకుండా అవగాహన కల్పించడంతో పాటు అన్ని ఆస్పత్రుల్లోనూ చికిత్సకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

కుటుంబ సంక్షేమ శాఖ అన్ని జిల్లాల అధికారులకు ఎండ వేడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధికారుల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశమున్నట్టు హెచ్చరికలు ఉండటంతో దీనికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా కేసుల కారణంగా ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సెలవులు లేకుండా పనిచేస్తున్నారు. అన్ని సబ్‌సెంటర్లతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సైతం ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌లు సరఫరా చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

పల్లెల్లో విస్తృత ప్రచారం
పల్లెల్లో జనాన్ని అప్రమత్తం చేశారు. ఉపాధి హామీ లేదా ఇతర రైతు పనులకు వెళ్లిన వారిని ఉదయం 11 గంటలలోగా ఇంటికి చేరుకోవాల్సిందిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎఫ్‌ఎం రేడియో, కేబుల్‌ టీవీలు, కళాజాతాల ద్వారా ఎండ తీవ్రత, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి, మండల స్థాయిలో మెడికల్‌ క్యాంపుల నిర్వహణ చేపట్టారు. గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ఏఎన్‌ఎంల ద్వారా ప్రత్యేక మెడికల్‌ కిట్‌లను అందజేస్తున్నారు. సురక్షితమైన తాగునీరు అందించాల్సిందిగా పంచాయతీరాజ్, మునిసిపాలిటీ అధికారులను కోరారు. ఎన్జీవో సంఘాలు ప్రత్యేక చలివేంద్రాలు, మజ్జిగ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

టీకాలకు ఉదయమే రండి
కోవిడ్‌ వ్యాక్సిన్‌తో పాటు చిన్నారులకు ప్రతి బుధ, శనివారాలు వ్యాధినిరోధక టీకాలు నిర్వహణ జరుగుతుంది. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం 9 గంటలలోగా వ్యాక్సిన్‌ తీసుకుని వీలైనంత త్వరగా ఇంటికి వెళ్లాలని కుటుంబ సంక్షేమ శాఖ కోరింది. ప్రతి ఆస్పత్రిలోనూ ఓఆర్‌ఎస్‌ పౌడర్‌తో పాటు, సన్‌స్ట్రోక్‌కు సంబంధించిన అన్ని రకాల మందులూ అందుబాటులో ఉంచారు. గర్భిణులు వైద్య పరీక్షలకు ఉదయం రావాలని, తిరిగి త్వరగా వెళ్లాలని, వారిని ఉదయమే తెచ్చే బాధ్యత ఆశా కార్యకర్తలు చూసుకోవాలని ఆదేశించారు. ఏదైనా సన్‌స్ట్రోక్‌ లక్షణాలుంటే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెంటనే వెళ్లాలని సూచించారు. 108కు ఫోన్‌ చేసి అంబులెన్సులో రావచ్చునని, లేదంటే 104కు కాల్‌ చేసి డాక్టరు సలహాలు తీసుకుని పాటించవచ్చునని కుటంబ సంక్షేమ శాఖ విజ్ఞప్తి చేసింది.

సన్‌స్ట్రోక్‌ లక్షణాలు ఇవే
► విపరీతంగా తలనొప్పి రావడం, కళ్లు తిరిగినట్టుండటం
► నీరసంగా ఉండటం, నాలుక తడారిపోవడం
► ఒళ్లంతా చెమటలు పట్టినట్టు, శరీరం పాలిపోయినట్టు కావడం
► శ్వాస వేగంగా తీసుకోవడం, గుండె దడగా ఉండటం
► శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగడం
► వాంతులు వచ్చినట్టు ఉండటం

ఈ జాగ్రత్తలు తీసుకుంటే సమస్య రాదు
► వీలైనంత వరకు ఎండలో తిరగకపోవడం
► వెళ్లినా గొడుకు విధిగా వాడటం
► కావాల్సినన్ని మంచినీళ్లు దఫాలుగా తాగుతుండటం
► పల్చటి మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవడం
► అలసటగా ఉన్నట్టయితే ఓఆర్‌ఎస్‌ పౌడర్‌ మంచినీళ్లలో కలిపి తాగడం

అన్నీ సిద్ధంగా ఉంచాం
ఓఆర్‌ఎస్‌తో పాటు ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్‌ మందులు సిద్ధంగా ఉంచాం. ఇప్పుడిప్పుడే కొన్ని హీట్‌వేవ్‌ (వడదెబ్బ) కేసులు నమోదవుతున్నాయి. మెడికల్, పారామెడికల్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పాం. ఏరోజుకారోజు వడదెబ్బ కేసులను నివేదికను పంపించాలని కోరాం. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు వృద్ధులు వీలైనంత వరకు ఇంటికే పరిమితం కావాలి.
– డా.గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top