
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. రానున్న మూడు గంటల్లో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది.
కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. చెట్ల కింద ఉండకూడదని.. అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కోనసీమ(జి) ముమ్మడివరంలో 79.7మిమీ, పల్నాడు(జి) గుట్లపల్లిలో 60మిమీ, నెల్లూరు(జి) జలదంకిలో 33.5మిమీ వర్షపాతం నమోదైంది.