
హొళగుంద/శ్రీశైలం ప్రాజెక్ట్/సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి శనివారం వరద నీరు పోటెత్తింది. సగటు ఇన్ ఫ్లో 44,348 క్యూసెక్కులుండగా.. గంటకు 46,500 క్యూసెక్కులు చొప్పున నీరు జలాశయంలోకి చేరుతోంది. మొత్తం 33 గేట్లలో 26 గేట్లను రెండున్నర అడుగుల మేర ఎత్తి 50 వేల క్యూసెక్కుల వరకు నీటిని నదికి వదులుతున్నారు.
కాలువలకు 10 వేల క్యూసెక్కుల వరకూ విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి ఈ ఏడాది ముందుగానే వరద నీటి చేరిక మొదలైంది. దెబ్బతిన్న క్రస్టు గేట్లను దృష్టిలో ఉంచుకుని డ్యాం పూర్తిమట్టం 105.788 టీఎంసీలలో 80 టీఎంసీలకు నీటి నిల్వను కుదించడం తెలిసిందే. డ్యాం 105.788 టీఎంసీల నీటి సామర్థ్యంలో 77.907 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
సాగర్‌కు కొనసాగుతున్న నీటి విడుదల
శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల కొనసాగుతోంది. శుక్రవారం నుంచి శనివారం వరకు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1,40,871 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. శ్రీశైలం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 156,722 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో 6.80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నాగార్జునసాగర్‌కు క్రస్ట్‌గేట్ల ద్వారా 53,940 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన ద్వారా 68,846 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.

శనివారం సాయంత్రానికి శ్రీశైలం డ్యాం నీటిమట్టం 882.40 అడుగులకు చేరుకోగా.. జలాశయంలో 201.1205 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా, ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, శబరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి పోలవరం ప్రాజెక్టుకు 5.52 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. పోలవరం స్పిల్ వే 30.400 మీటర్ల ఎత్తు నుంచి 5.52 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.