ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో గట్టి వానలు | Heavy Rain Forecast To Andhra Pradesh And Telangana For Two Days, Check Out Complete Rainfall Weather Update Inside | Sakshi
Sakshi News home page

Telugu States Rainfall Update: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో గట్టి వానలు

Aug 4 2025 8:00 AM | Updated on Aug 4 2025 9:52 AM

Heavy Rain Forecast To Telugu States For Two days

ఉపరితల ఆవర్తనంతో రెండ్రోజులు వర్షాలు 

దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణకు వర్ష సూచన 

ఉత్తరాంధ్రలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం  

సాక్షి, విశాఖపట్నం: ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపరితల ఆవర్తనం కాస్త ఉపశమనం కలిగించనుంది. ఉత్తర తమిళనాడు, నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై కనిపించనుంది.

ఈ క్రమంలో సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉంది. అదేవిధంగా.. ఉత్తరాంధ్ర­లో మాత్రం ఒకట్రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి. తీరం వెంబడి 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.  

తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు.. 
అల్పపీడనం కారణంగా తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడి ఉంటాయని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

నేడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలపై ఈ వాయుగుండం ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు వివరించారు. ఆగస్టు 5 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

గత 24 గంటల్లో నారాయణపేట జిల్లాలోని మాగనూరులో అత్యధికంగా 3.13 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌లో 2.74 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇక ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతదేశం వైపు ఎక్కువగా కేంద్రీకృతం కావడంతో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. నైరుతి గాలులు పొడిబారిపోవడం కూడా వర్షాలు తగ్గడానికి ఒక ముఖ్య కారణంగా నిపుణులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement