
ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లోనే రూ. 37 వేల కోట్ల అప్పు
ఏడాది లక్ష్యంలో మొదటి త్రైమాసికంలో 46.40% తీసుకున్న ఏపీ
ఏ రాష్ట్రం అందుకోలేనంత వేగంగా రుణాల సేకరణ
రూ.22 వేల కోట్ల పైచిలుకు అప్పులతో తెలంగాణ
ఏడాది లక్ష్యంలో 37.52 శాతం రుణాల సేకరణ... కాగ్ గణాంకాల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల జాతర అప్రతిహతంగా కొనసాగుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశంలోని పలు రాష్ట్రాల ఆదాయ, వ్యయాలకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించిన నివేదికల ప్రకారం బహిరంగ మార్కెట్‌లో రుణాలను ఏపీనే అందరికంటే ఎక్కువగా తీసుకుంటోంది. అప్పుల్లో ఏపీ రూ. 37 వేల కోట్లతో మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్ రూ. 26 వేల కోట్లే తీసుకోవడం గమనార్హం.
కాగ్ ఇటీవల వెల్లడించిన నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత మూడు నెలల (2025 ఏప్రిల్, మే, జూన్) కాలంలో రూ.37.093 కోట్ల అప్పులను సేకరించింది. ఏపీతో పోలిస్తే తెలంగాణ ఒకింత తక్కువే అయినా రూ. 20 వేల కోట్ల అప్పుల చిట్టాను దాటిపోయింది. తెలంగాణతో కొంచెం అటూ ఇటుగా కేరళ, రాజస్తాన్, తమిళనాడు రాష్ట్రాలుండగా, మధ్యప్రదేశ్ మాత్రం తెలంగాణ కంటే ఎక్కువగానే అప్పులు తీసుకుంది. ఇక, దక్షిణాది రాష్ట్రాల పరంగా చూస్తే ఏపీ ఎవరికీ చిక్కనంత దూరంలో నిలిచింది. జాబితాలో ఏపీ తర్వాత తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలున్నాయి.
సగానికి చేరువగా...!
వాస్తవానికి, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇంత మొత్తంలో రుణాలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటాయి. ఈ మేరకు వార్షిక బడ్జెట్ అంచనాల్లో ప్రతిపాదించి అసెంబ్లీ ఆమోదం తీసుకుని ఏడాదిపాటు ఆ రుణాలను క్రమంగా తీసుకుంటాయి. కానీ ఏపీ మాత్రం కేవలం మూడు నెలల కాలంలోనే ఏడాది మొత్తం లక్ష్యంగా పెట్టుకున్న అప్పుల్లో దాదాపు సగం అప్పుడే తీసేసుకున్నట్లు కాగ్ లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం రూ.79,926.89 కోట్లను 2025–26 ఆర్థిక సంవత్సరంలో అప్పుల పద్దు కింద సమకూర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా, అందులో 46.40 శాతం అంటే రూ. 37,093.98 కోట్లను అప్పుడే తీసేసుకుంది. ఇక, తెలంగాణ రూ. 54,009.74 కోట్ల రుణ సేకరణ లక్ష్యంగా పెట్టుకుని తొలి మూడు నెలల కాలంలో 37.52 శాతం అంటే రూ. 20,266.09 కోట్లను సమకూర్చుకుంది.
తెలంగాణలో కొంచెం అటూ ఇటుగా...
తెలంగాణ ఖజానా గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ముందుకెళ్తోంది. గత వార్షిక బడ్జెట్ లక్ష్యంలో తొలి మూడు నెలల్లో 17.80 శాతం నిధులు సమకూరగా, ఈసారి కొంచెం ఎక్కువగా 20.19 శాతం అంటే రూ.57,449 కోట్లు సమకూరాయి. పన్ను ఆదాయంలో గత ఏడాది లక్ష్యంతో పోలిస్తే తొలి మూడు నెలల్లో 16.10 శాతం రాగా, ఈ ఏడాది 35,721.80 కోట్లు (16.20%) వచ్చాయి. జీఎస్టీ, స్టాంపులు, రిజి స్ట్రేషన్లు, అమ్మకపు పన్ను, ఎక్సైజ్, పన్నేతర ఆదాయం...ఇలా అన్ని పద్దుల్లోనూ కొంచెం అటూ ఇటుగా 2024–25 ఆర్థిక సంవత్సరం మాదిరిగానే నిధులు సమకూరుతున్నాయని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి.
అయితే, అప్పులు మాత్రం ఈసారి ఒకింత ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గత ఏడాది పెట్టుకున్న రుణలక్ష్యంలో తొలి మూడు నెలల్లో 26.74 శాతం సమకూర్చుకోగా, ఈసారి మాత్రం 37.52 శాతం రుణాలను తీసేసుకోవడం గమనార్హం. ఇక, ఆదాయ రాబడులు ఎలా ఉన్నాయో వ్యయ లెక్కలు కూడా అలాగే ఉన్నాయని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. అన్ని పద్దుల కింద కలిపి మొత్తం రూ. 57,499. 58 కోట్లు రాగా.. రూ.52,559.96 కోట్లు ఖర్చయ్యాయి. రూ.10,582.85 కోట్లు రెవెన్యూ లోటు నమోదు కాగా, రూ.20,266.09 కోట్ల ద్రవ్య లోటుతో తెలంగాణ ఖజానా ఉందని కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.