
రాబడి లేదు.. ఉన్న సంపద కూడా ఆవిరి
చంద్రబాబు ఏడాది పాలనలో తిరోగమనంలో రాష్ట్రం
2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ గణాంకాలను వెల్లడించిన కాగ్
సంపద పెంచేస్తానని ఎన్నికల ముంగిట పెద్దపెద్ద మాటలు.. తీరా అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్త పాలనతో ఉన్నది ఆవిరి
2023–24లో వైఎస్ జగన్ హయాంలో వచ్చిన రాబడి కూడా రాలేదు
తగ్గిన ఆదాయం.. భారీగా పెరిగిన అప్పులు
2023–24తో పోల్చితే 2024–25లో రూ.5,520 కోట్లు పడిపోయిన రెవెన్యూ రాబడి
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ,అమ్మకం పన్ను ఆదాయం తిరోగమనం
కేంద్ర గ్రాంట్లలో ఏకంగా రూ.14,563 కోట్లు తగ్గుదల
భారీగా అప్పులు చేసినా మూలధన వ్యయం కేవలం రూ.19,176 కోట్లే
భారీగా పెరిగిన రెవెన్యూ, ద్రవ్య లోటు
2023–24 వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మూలధన వ్యయం రూ.23,589 కోట్లు
మహమ్మారులు ప్రబలలేదు.. ప్రకృతి విపత్తులు ముంచెత్తలేదు.. ఆర్థిక సంక్షోభం లాంటివి తలెత్తలేదు..సంక్షేమ పథకాలు ఇచ్చింది కూడా లేదు.. కానీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. రాబడులు పడిపోతుండగా..
గ్రాంట్లు కొడిగడుతున్నాయి. సంపద పెంచేస్తా.. అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ పనిచేయలేకపోగా ఉన్న సంపదను ఆవిరి చేస్తున్నారు. కాగ్ వెలువరించిన నివేదిక ఆధారంగా వెల్లడైన వాస్తవాలు..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ ఏలుబడిలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఓపక్క రెవెన్యూ రాబడి తగ్గుతూ ఇంకోపక్క రాష్ట్ర అప్పులు భారీగా పెరుగుతున్నట్లు తేలింది. మార్చి నెలతో ముగిసిన 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రాబడులు, వ్యయాల లెక్కలను కాగ్ బుధవారం వెల్లడించింది. వీటిని గమనిస్తే.. సంపద సృష్టించడం దేవుడెరుగు.. అస్తవ్యస్త పాలనతో ఉన్న సంపదను కూడా ఆవిరి చేసేస్తున్నారని స్పష్టమవుతోంది.
అంతకుముందు వచ్చిన దానిని కూడా నిలబెట్టలేకపోయారని అర్థమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం కక్షసాధింపులు, రెడ్‌బుక్ వేధింపులపైనే దృష్టిపెట్టి పాలనను గాలికి వదిలేయడమేనని తెలుస్తోంది. సహజంగా ఎలాంటి సంక్షోభాలూ లేకుంటే అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులకు మించిన ఆదాయం వస్తుంది.
కానీ, రాష్ట్రంలో 2023–24లో వచ్చిన ఆదాయం 2024–25లో రాకపోగా రూ.5,520 కోట్లు తగ్గినట్టు కాగ్ గణాంకాలు పేర్కొంటున్నాయి. మరోపక్క రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగినట్లు తేల్చాయి. అంటే, సంపదలోనూ, వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు తేలుతోంది.
అమ్మకం పన్ను తగ్గిందంటే..
» అమ్మకం పన్నుతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం 2024–25లో తగ్గిపోయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అమ్మకం పన్ను రాబడి రూ.1,053 కోట్లు పడిపోయింది. దీని అర్థం ప్రజల కొనుగోలు శక్తి తగ్గడమేనని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజల దగ్గర డబ్బులేక కొనుగోలు శక్తి తగ్గిపోవడం.. అమ్మకం పన్ను ద్వారా రాబడి పడిపోవడానికి ప్రధాన కారణమని అధికార వర్గాలు కూడా తెలిపాయి.
» స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా కుదేలైంది అంటే రియల్ ఎస్టేట్ రంగంలో పురోగతి లేదని స్పష్టమవుతోంది. అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25లో స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్ ఆదాయం రూ.705 కోట్లు తగ్గిపోయింది.
» పన్నేతర ఆదాయం కూడా తిరోగమనంలో ఉందని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. అంతకుముందు ఆర్థిక ఏడాదిలో పోల్చితే 2024–25లో ఇది రూ.842 కోట్లు తగ్గినట్లు కాగ్ గణాంకాలు పేర్కొన్నాయి.
» కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లోనూ భారీగా తగ్గుదల నమోదైంది. 2023–24తో పోల్చితే 2024–25లో గ్రాంట్లు రూ.14,563 కోట్లు తగ్గిపోయాయి.

» బడ్జెట్ అంచనాలను మించి అప్పులు చేసినా మూలధన వ్యయం అంతంత మాత్రంగానే ఉందని కాగ్ గణాంకాలు పేర్కొన్నాయి. తెచ్చిన అప్పును ఆస్తుల కల్పన కోసం మూలధన వ్యయంపై పెట్టాలని ఇటీవల చంద్రబాబు విలేకరుల సమావేశంలో నీతి వాక్యాలు పలికారు. అయితే, 2023–24తో పోల్చితే 2024–25లో మూలధన వ్యయం రూ.4,413 కోట్లు తగ్గిపోయింది. చేసిన అప్పులను ఆస్తుల కల్పనపైనా పెట్టలేదు.. సూపర్ సిక్స్ హామీలనూ అమలు చేయలేదు.
అంతా బడాయి
» విద్య, వైద్యం, పౌష్టికాహారం, సంక్షేమానికి సంబంధించి సామాజిక రంగ వ్యయం కూడా అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25లో రూ.4,696 కోట్లు తగ్గినట్లు కాగ్ స్పష్టం చేసింది. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగినట్లు తేల్చింది.
» కాగ్ గణాంకాలనే చూస్తే 2023–24 కన్నా 2024–25లో రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోయినట్లు తేలుతోంది. అయినా రాష్ట్ర వృద్ధి రేటు పెరిగి పోతోందని.. అదే సంపద అంటూ సీఎం చంద్రబాబు చెబుతున్నారు.
» ఇదంతా కేవలం అప్పులు ఎక్కువగా చేయడానికే తప్ప.. రాష్ట్ర సంపద సృష్టికి కాదని స్పష్టమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.