మూడు కాళ్లతో శిశువు జననం

Guntur GGH Neurosurgery Medical Department have achieved a rare feat - Sakshi

అరుదైన శస్త్రచికిత్స చేసి ఒకటి తొలగింపు

గుంటూరు జీజీహెచ్‌ న్యూరోసర్జన్ల ఘనత

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌ న్యూరోసర్జరీ వైద్య విభాగం రెండో యూనిట్‌ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. మూడు కాళ్లతో జన్మించిన ఆడ శిశువుకు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి విజయవంతంగా మూడో కాలును తొలగించారు. జీజీహెచ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరిజిల్లా చింతలపూడికి చెందిన డి.వెంకటేశ్వరమ్మ, మోహన్‌రావు దంపతులకు మార్చి 4న రెండో సంతానంగా ఆడశిశువు జన్మించింది. బిడ్డకు నడుములోని వెన్నుపాము నుంచి మూడో కాలు బయటకొచ్చింది. దీంతో డెలివరీ చేసిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు శిశువుకు శస్త్రచికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. ఒక్క రోజు వయసున్న ఆడశిశువుకు త్రీడీ ఎమ్మారై, త్రీడీ సీటీస్కాన్‌ చేసి నడుము లోపలి భాగం నుంచి మూడో కాలు వచ్చినట్లు నిర్ధారించామని న్యూరో సర్జరీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి చెప్పారు. అంతేకాకుండా, మూడో కాలి వద్ద పురుష జననాంగాలు ఏర్పడి, రెండు కాళ్లకు సంబంధించిన నరాలు మూడో కాలికి అతుక్కుని ఉన్నట్లు తెలిపారు.

వైద్య పరిభాషలో దీనిని ‘లంబార్‌ మైలోమినింగో సీల్‌ విత్‌ ట్రై పెడస్‌ డిఫార్మెటీ’ అంటారని, ప్రపంచంలో ఇలాంటి కేసులు ఇప్పటివరకు 25 మాత్రమే నమోదయ్యాయని వివరించారు.  ప్రొఫెసర్‌ డాక్టర్‌ దత్తలూరి శేషాద్రి శేఖర్‌ ఆధ్వర్యంలో మార్చి 31న సుమారు మూడు గంటలపాటు ఆపరేషన్‌ చేసి మూడో కాలిని తొలగించామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల రూ.1.5 కోట్ల ఖరీదు చేసే అత్యాధునిక లైకా మైక్రోస్కోప్‌ వైద్య పరికరాన్ని తమ న్యూరోసర్జరీ వైద్య విభాగానికి అందించారని, ఈ పరికరం ద్వారానే ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేయగలిగామన్నారు. ఆపరేషన్‌ ప్రక్రియలో మత్తు వైద్యుడు డాక్టర్‌ నాగభూషణం, న్యూరోసర్జరీ పీజీ వైద్యులు సత్య, ధీరజ్, విజయ్‌ పాల్గొన్నారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న శస్త్రచికిత్సను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, వైద్యులకు బిడ్డ తల్లిదండ్రులు కృతజ్ఙతలు తెలిపారు.

ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా డిస్క్‌ ఆపరేషన్లు
కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో మాత్రమే చేసే డిస్క్‌ ఆపరేషన్లు గుంటూరు జీజీహెచ్‌ న్యూరోసర్జరీ వైద్య విభాగంలో ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం’ ద్వారా ఉచితంగా చేస్తున్నట్లు ప్రొఫెసర్‌ డాక్టర్‌ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి తెలిపారు.  న్యూరోసర్జరీ వైద్య విభాగం రెండో యూనిట్‌లో ఇక నుంచి రెగ్యులర్‌గా కోత, కుట్లు లేని డిస్క్‌ ఆపరేషన్లు, డే కేర్‌ సర్జరీలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top