AP: గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం

Group-1 Mains Exams Are About To Start In AP - Sakshi

సాక్షి, విజయవాడ: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. 6,455 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులకు ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. జూన్ 10 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి.

ఈసారి ఆఫ్ లైన్ లోనే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, ఏపీపీఎస్సీ సెక్రటరీ జె.ప్రదీప్ కుమార్ పరిశీలించారు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ జరగనుంది. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు.

అభ్యర్థులకు బయోమెట్రిక్‌తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం 70 బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 290 మంది దివ్యాంగులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 58 మంది దివ్యాంగులు స్క్రైబ్స్ కు అనుమతి కోరారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు.

ఇది కూడా చదవండి: నేడు ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top