
తాటిచెట్లపాలెం(విశాఖపట్నం): కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని తండ్రి, తన కుమార్తెకు పుట్టిన మగబిడ్డను ఆమెకు తెలియకుండానే దత్తత ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు నేరుగా పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. అరకు ప్రాంతానికి చెందిన పెట్టెల దివ్య (23) అదే ప్రాంతానికి చెందిన జాన్‌బాబును ప్రేమించి వివాహం చేసుకుంది. దివ్య తండ్రి పి. శుక్రకు ఈ వివాహం మొదటి నుంచి ఇష్టం లేదు.
వారిద్దరినీ విడదీయడానికి అతను పలు ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో దివ్య, జాన్‌బాబు మధ్య మనస్పర్థలు రావడంతో వారు విడివిడిగా ఉంటున్నారు. ఈ సమయంలో దివ్య గర్భవతి కావడంతో, ప్రసవం కోసం ఆమె తండ్రి శుక్ర విశాఖలోని కై లాసపురం ప్రాంతానికి తీసుకువచ్చి, అద్దె ఇంట్లో ఉంచాడు. దివ్యకు కేజీహెచ్‌లో మగబిడ్డ జన్మించాడు. బిడ్డకు పచ్చకామెర్లు ఉన్నాయని, అనారోగ్యంగా ఉన్నాడని, వైద్యం చేయించాలని చెప్పి, దివ్యతో పలు పత్రాలపై సంతకాలు చేయించాడు.
అనంతరం తల్లికి తెలియకుండా ఆ బిడ్డను దత్తత పేరుతో విక్రయించాడు. రెండు నెలలు గడిచినా బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో దివ్య తన తండ్రిని నిలదీసింది. సరైన సమాధానం రాకపోవడంతో, దివ్య మొదట కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌లో, ఆపై నేరుగా పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి బిడ్డ ఆచూకీని కనుగొన్నాయి. బిడ్డను మొదట ఆర్‌అండ్‌బీ వద్ద గల శిశుగృహకు అప్పగించారు. సోమవారం పోలీసుల సమక్షంలో ఆ బిడ్డను తల్లిదండ్రులైన దివ్య, జాన్‌బాబులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.