
ఉపాధ్యాయ బదిలీల్లో దక్కని చోటు.. వారి పోస్టింగ్ ఎక్కడో తెలియని వైనం
గత ప్రభుత్వంలో 2008, 1998 డీఎస్సీ వారికి ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీల్లో మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లకు స్థానం లేకుండా పోయింది. వేల సంఖ్యలో రెగ్యులర్ ఉపాధ్యాయులను ప్రభుత్వం మిగులుగా చూపడంతో ఎంటీఎస్ ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటో అర్థంగాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత బదిలీల్లో వీరి పరిస్థితిని అటు విద్యాశాఖ గాని, ఇటు ఉపాధ్యాయ సంఘాలు గాని పట్టించుకోలేదు. దీంతో తమను ఉంచుతారా.. లేక ఏ మారుమూలకు విసిరేస్తారో తెలియక ఎంటీఎస్ టీచర్లు ఆందోళన చెందుతున్నారు.
1998, 2008 డీఎస్సీల ద్వారా ఎంపికై నియామక విధానంలోని తప్పిదాలతో నష్టపోయిన అభ్యర్థులకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం న్యాయం చేసింది. 2008 డీఎస్సీ ద్వారా ఎంపికైన 2,193 మందికి 2021లో గత ప్రభుత్వం మినిమం టైం స్కేల్‌తో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమించింది. అలాగే, 1998 డీఎస్సీ అభ్యర్థులు 4,072 మందికి 2023 ఏప్రిల్‌లో ఎంటీఎస్‌గా మెరిట్ ప్రాతిపదికన పోస్టింగ్స్ ఇచ్చింది. ప్రభుత్వం ఇటీవల ఎంటీఎస్ టీచర్ల సర్విసును 2025–26 విద్యా సంవత్సరానికి పునరుద్ధరించింది. అయితే, ప్రస్తుత బదిలీల్లో రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలు ఇచ్చిందేగాని, ఎంటీఎస్ టీచర్ల బదిలీపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ప్రస్తుత బదిలీల్లోనూ దక్కని చోటు
ఎంటీఎస్ ఉపాధ్యాయులుగా చేరిన 6,265 మందిలో ఇప్పటికే దాదాపు 1000 మంది వరకు సర్విసు నుంచి రిటైర్ అయ్యారు. మిగిలిన వారిలో 1998 డీఎస్సీ వారిలో అత్యధికులు 55 ఏళ్ల వయసుకు దగ్గరగా ఉన్నవారే. ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఆర్థిక భారం నేపథ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. 2008 డీఎస్సీ అభ్యర్థుల పరిస్థితి కూడా అలాగే ఉంది. తమకు జీవో నం.47 ప్రకారం సొంత నివాసాలకు దగ్గరగా ప్రాధాన్యం కల్పించాలని కోరుతున్నారు. ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను కలిసి విన్నవించినా.. జిల్లాల్లో తమ గోడు పట్టించుకోడం లేదని వాపోతున్నారు.
రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలు సైతం ప్రస్తుత బదిలీలపై దృష్టి పెట్టారేగాని, కనీసం మానవతా దృక్ఫథంతో అయినా తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను 9 రకాలుగా విభజించి, ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తోంది. రెగ్యులర్ ఉపాధ్యాయుల సర్దుబాటు అనంతరం ఏవైనా స్థానాలు మిగిలితే అక్కడ ఎంటీఎస్ టీచర్ల సేవలను వినియోగించుకునే యోచనలో విద్యాశాఖ ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఎంటీఎస్ టీచర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుంది. ఈ క్రమంలో మోడల్ ప్రైమరీ స్కూల్, బేసిక్ ప్రైమరీ స్కూళ్లలో ఒక పోస్టునైనా ఎంటీఎస్ టీచర్లకు కేటాయించాలని కోరుతున్నారు.