అహోబిలం రిజర్వాయర్‌కు ‘జియోమెంబ్రేన్‌’ చికిత్స

Geomembrane Treatment For Ahobilam Reservoir - Sakshi

నిర్మాణ లోపాల వల్ల పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో భారీ లీకేజీలు

సాక్షి, అమరావతి: నిర్మాణ లోపాల కారణంగా పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌) స్పిల్‌వే నుంచి భారీగా నీరు లీకవుతోంది. సీపేజీ, లీకేజీల వల్ల ఆ రిజర్వాయర్‌ భద్రతకే ముప్పు పొంచి ఉండటంతో అందులో సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడం లేదు. బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 11.1 టీఎంసీలు కాగా.. గరిష్టంగా 4.11 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచడం లేదు. దీంతో అటు ఆయకట్టుకు సాగునీరు.. ఇటు తాగునీటి అవసరాలను తీర్చలేని దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

స్పిల్‌వే, మట్టి కట్టలలో చిల్లులను ‘జియోమెంబ్రేన్‌ షీట్ల’తో పూడ్చటం ద్వారా 11.1 టీఎంసీలు నిల్వ చేసి అనంతపురం జిల్లాకు మరింత జలభద్రత చేకూర్చాలని నిర్ణయించింది. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ)లో అంతర్భాగంగా పెన్నా నదిపై అనంతపురం జిల్లా కూడేరు మండలం కొర్రకోడు వద్ద 11.10 టీఎంసీల సామర్థ్యంతో పీఏబీఆర్‌ను నిర్మించారు. కాలువ ద్వారా 50 వేలు, యాడికి కెనాల్‌ వ్యవస్థ ద్వారా మరో 50 వేలు కలిపి మొత్తం లక్ష ఎకరాలకు నీళ్లందించేలా ఈ రిజర్వాయర్‌ను నిర్మించారు.

స్పిల్‌వే నిండా చిల్లులే.. 
పీఏబీఆర్‌ స్పిల్‌వే పొడవు 101.44 మీటర్లు. మట్టికట్ట పొడవు 1,920 మీటర్లు. రిజర్వాయర్‌ వద్ద పెన్నా నది గర్భం 400 మీటర్లు. రిజర్వాయర్‌ స్పిల్‌వే ఎత్తు 446 మీటర్లు. ఈ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని లోపాల పుట్టగా నీటి పారుదల నిపుణులు, జల వనరుల శాఖ అధికారులు అభివరి్ణస్తున్నారు. స్పిల్‌వే నిండా చిల్లులే ఉండటంతో రిజర్వాయర్‌లో ఏనాడూ గరిష్టంగా> నీటిని నిల్వ చేయలేని దుస్థితి. కోట్లాది రూపాయలు వెచి్చంచి గ్రౌటింగ్‌ (స్పిల్‌ వే ఎగువన బోర్లు వేసి అధిక ఒత్తిడితో సిమెంట్, కాంక్రీట్‌ మిశ్రమాన్ని పంపి.. చిల్లులను పూడ్చటం) చేసినా చిల్లులు పూడలేదు. లీకేజీలు, సీపేజీ తగ్గలేదు. దాంతో రిజర్వాయర్‌ భద్రత దృష్ట్యా గరిష్టంగా 4.11 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. దీనివల్ల ఆయకట్టుకు నీళ్లందటం లేదు. అనంతపురం నగరంతోపాటు జిల్లాలో అధిక శాతం పట్టణాలు, గ్రామాలకు తాగునీటిని అందించే పథకాలు ఈ రిజర్వాయర్‌పైనే ఆధారపడ్డాయి. సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయకపోవడం వల్ల తాగునీటిని సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడింది.

రిజర్వాయర్‌కు పునరుజ్జీవం 
తమిళనాడులో కడంపరై డ్యామ్, కర్ణాటకలో కృష్ణ రాజసాగర్‌ డ్యామ్‌లలో సీపేజీ, లీకేజీలను జియోమెంబ్రేన్‌ షీట్లు వేయడం ద్వారా తగ్గించారు. ఈ నేపథ్యంలో పీఏబీఆర్‌కు జియోమెంబ్రేన్‌ షీట్లను వేసి, లీకేజీలను అరికట్టాలన్న జల వనరుల శాఖ ప్రతిపాదనకు సర్కార్‌ ఆమోద ముద్ర వేసింది. అత్యంత పటిష్టమైన జియోమెంబ్రేన్‌ షీట్లను అధిక ఒత్తిడితో స్పిల్‌వే, మట్టి కట్టలకు ఎగువన భూమిలోకి దించుతారు. వాటి పునాది స్థాయి కంటే దిగువకు దించుతారు. ఈ షీట్లతో స్పిల్‌వేకు తొడుగు వేస్తారు. దాంతో లీకేజీలు, సీపేజీలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది. అప్పుడు పీఏబీఆర్‌లో పూర్తి స్థాయిలో 11.1 టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం అవుతుంది.

చదవండి: ‘ఎంత కృతజ్ఙత లేని వాడివి నీవు.. చంద్రం’  
ఏం జరిగిందో ఏమో.. యువతి అనుమానాస్పద మృతి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top