
ఒకే సమయంలో నలుగురు చిన్నారులు మృతి
కారులో చిక్కుకుని ప్రాణాలు విడిచిన పిల్లలు
శోకసంద్రంగా మారిన సర్వజన ఆస్పత్రి
అమ్మా... అందరం కలిసి ఆడుకుంటామంటే సరే అన్నారు..
అదే పిల్లల చివరి మాట అని ఆ తల్లులకు తెలియదు..
అక్కడే మృత్యువు కాపుకాసి ఉందని గుర్తించలేకపోయారు..
మూడు గంటల పాటు పిల్లలు కనిపించకపోయే సరికి
తల్లిడిల్లిపోయారు.. ఏమయ్యారో అంటూ ఊరంతా
గాలించారు.. చివరకు కారులో ప్రాణవాయువు అందక విలవిల్లాడుతూ విగత జీవులుగా కనిపించిన పిల్లలను చూసి కుప్పకూలిపోయారు.
విజయనగరం క్రైమ్: సమయం మధ్యాహ్నం 2 గంటలు.. గ్రామంలోని పెళ్లివేడుకలో పెద్దలు, ఆటపాటల్లో చిన్నారులు నిమగ్నమయ్యారు. ఆటలాడుతూ గ్రామ బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఉన్న కారులోకి నలుగురు చిన్నారులు వెళ్లారు. పొరపాటున డోర్లు వేయడంతో లాక్ అయ్యాయి. అంతే.. వారికి ప్రాణ వాయువు అందలేదు. కాపాడాలంటూ వారి ఆర్తనాదాలు బయటకు వినిపించలేదు. మూడుగంటల తర్వాత వెతుకుతూ వెళ్లిన పెద్దలకు కొనఊపిరితో కారులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారులు కనిపించారు. డోర్లు బద్దలగొట్టి చిన్నారులను బయటకు తీసినా ఫలితం లేకపోయింది. చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కారు రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటనతో విజయనగరం సమీపంలోని ద్వారపూడిలో మృత్యుఘోష వినిపించింది. సర్వజన ఆస్పత్రి ప్రాంగణం శోకసంద్రంగా మారింది.
మాటలకందని విషాదం
అందరూ పదేళ్లలోపు పిల్లలే. కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులు వారిని అల్లారు ముద్దుగా సాకుతున్నారు. పిల్లలు ఆడుకుంటేంటే సంబర పడ్డారు. పెళ్లివేడుకలో బిజీ అయ్యారు. ఒకేసారి కారు రూపంలో కంది మణీశ్వరి (6), బూర్లె చారులత (7), పండి ఉదయ్ (7), బూర్లె జాస్రిత(8)ను మృత్యువు కాటేయడంతో కన్నీరుకార్చారు. విగతజీవులుగా మారిన చిన్నారులను పట్టుకుని బోరున విలపించారు.
కడుపుకోత..
మృతిచెందిన చిన్నారుల్లో బూర్లె చారులత, జాస్రిత అక్కాచెల్లెళ్లు. వీరిద్దరూ ఒకే సారి మృతిచెందడంతో తల్లిదండ్రులు ఉమ, ఆనంద్‌లు విషాదంలో ముని గిపోయారు. దేవుడా.. కడుపుకోత మిగిల్చావా అంటూ విలపించారు. సర్వజన ఆస్పత్రి మార్చురీ వద్ద ఉన్న కుమార్తెల మృతదేహాలను చూసిన ఉమ ఓ దశలో సొమ్మసిల్లి పోయింది. ఉదయ్ తల్లిదండ్రులు బుచ్చిబాబు, భవానీ, మణీశ్వరి తల్లిదండ్రులు సురేష్ అరుణలు సైతం బిడ్డల మృతదేహాలను పట్టుకుని రోదించారు.

ఇళ్ల మధ్యనే ఘటన...
మృత్యువుకు కారణమైన కారు వీధిలో ఇళ్ల మధ్యనే ఉంది. దాని పక్కగుండానే అందరూ రాకపోకలు సాగించినా.. అందులో ఉన్న చిన్నారులను గుర్తించలేకపోయారు. వారి ఆర్తనాదాలను ఆలకించలేకపోయారు. కారు అద్దాలు నలుపువి కావడం కూడా దీనికి ఓ కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్‌ఐ అశోక్ కుమార్, వన్‌టౌన్ ఎస్‌ఐ రామ్‌గణేష్‌లు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సర్వజన ఆస్పత్రికి వచ్చి మృతుల వివరాలు సేకరించారు.
కారు ఎవరిది?
బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఆగి ఉన్న కారు ఎవరిది..? అక్కడే ఎందుకు పార్క్ చేశారు? డోర్‌కు లాక్ ఎందుకు వేయలేదు అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ద్వారపూడిలో జరుగుతున్న పెళ్లి వేడుకకు సంబంధించి వైజాగ్ నుంచి ఆ కారు వచ్చినట్టు సమాచారం. కారు ఓనర్, డ్రైవర్ ఒక్కరేనని తెలిసింది. సంబంధిత వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.