పెద పట్టపుపాలెంలో 164 గ్రామాల మత్స్యకారుల సమావేశం
ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్
ఉలవపాడు: మేము కష్టపడి పట్టుకున్న బోట్లను ఎవరో కొందరు రాజకీయ నాయకులు నాశనం చేశారని మత్స్యకార కాపులు ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండల పరిధిలోని పెదపట్టపుపాలెం గ్రామంలో బుధవారం 164 గ్రామాల మత్స్యకార కాపుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలు వెల్లడించారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు కాపు కఠారి శీనయ్య మాట్లాడుతూ ‘‘కడలూరు హైస్పీడ్ బోట్లు మన సముద్ర జలాల్లోకి వస్తున్నాయి. వాటిని పట్టుకోవడానికి దొరకడం లేదు.
తొలుత ఒక బోటును పట్టాం. తర్వాత మరో బోటును పట్టాం. రెండు బోట్లు పట్టుకున్నా అక్కడి నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. తర్వాత మూడో బోటును పట్టాం. నాలుగో బోటు పట్టిన తర్వాత ప్రభుత్వం ఆలోచించింది. ఈ సమయంలో ఎవరో రాజకీయ నాయకులు వాటిని నాశనం చేశారు’’ అని ఆరోపించారు. మత్స్యకార సంఘ నాయకుడు వెంకటరమణ మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి పట్టుకున్న బోట్లను కూడా విడిపించి వాళ్లకు ఇవ్వడం ఎక్కడి న్యాయమన్నారు.
పోలీసు పహారాలో ఉన్న బోట్లను అవతలి రాష్ట్ర మత్స్యకారులు విడిపించుకుని వెళ్లడం వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరనే దాని మీద సమగ్ర విచారణ జరిపించి అసలు దోషులెవరో తేల్చాలన్నారు. మత్స్యకారులను విచి్ఛన్నం చేయాలని చేస్తున్న కుట్ర వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. నమ్ముకున్న నాయకులు, ప్రభుత్వ అధికారులు పొరుగు వారికి కొమ్ము కాస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. కోడూరివారిపాలెం కాపు తిరుపతి మాట్లాడుతూ కడలూరు బోట్ల గురించి ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదని, అన్ని గ్రామాలకు సంబంధించిన కాపులు ఈ విషయంలో ధర్నా చేయడానికి సిద్ధం అన్నారు.
పోతయ్యగారిపాలెం కాపు వాయల మురళి మాట్లాడుతూ పైనుంచి ఇలా బోట్లు వస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వారు మా సముద్ర జలాల్లోకి రాకుండా ప్రభుత్వం అరికట్టాలన్నారు. తాటిచెట్లపాలెం కాపు పల్లెకారి శీనయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కడలూరు బోట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మెరైన్ ఫిషరీస్ యాక్ట్‌ను మరింత పటిష్టం చేయాలని కోరారు. శాటిలైట్, డ్రోన్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో 164 మత్స్యకార గ్రామాల కాపులు, నాయకులు పాల్గొన్నారు.
బోట్ల మాయంపై మత్స్యకారుల తీర్పు
రూ.2.25 కోట్ల జరిమానా
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జువ్వలదిన్నె హార్బర్‌లో బోట్ల మాయంపై మత్స్యకారులు బుధవారం కుల తీర్పు ఇచ్చారు. 164 గ్రామాల మత్స్యకారుల సమావేశంలో బోట్లు మాయం చేసిన ముగ్గురినీ హాజరుపరచగా.. మత్స్యకార కాపులంతా నిర్ణయం తీసుకుని తొలుత రూ.2.40 కోట్ల జరిమానా విధించారు. బోట్లను వదిలిపెట్టిన ముగ్గురూ కాళ్లు పట్టుకోవడంతో ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున తగ్గిస్తూ.. రూ.2.25 కోట్ల జరిమానా నిర్ణయించారు. తాము అంత కట్టలేమని చెప్పడంతో బోట్లు మాయం చేయించిన బీద మస్తాన్‌రావుని అడిగి కట్టండని హుకుం జారీ చేశారు. తక్షణమే ఆ ముగ్గురూ రూ.కోటి చెల్లించినట్టు తెలుస్తోంది. బోట్ల మాయం వెనుక ఎవరు ఉన్నారో తేల్చేందుకు అర్ధరాత్రి తర్వాత మరో సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.


