సంక్రాంతి నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్‌’

Family Doctor To Be Started For Sankranti - Sakshi

వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని వచ్చే నెల మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు పైలట్‌ ప్రాజెక్టు నిర్వహిస్తామని, సంక్రాంతి నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. ఆయన గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ విధానంలో ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉంటారన్నారు. పీహెచ్‌సీలోని ప్రతి వైద్యుడు రోజు మార్చి రోజు 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ)తో వెళ్లి గ్రామాల్లో వైద్య సేవలందిస్తారని చెప్పారు.

ఇందుకోసం పీహెచ్‌సీ పరిధిలోని సచివాలయాలను వైద్యులకు మ్యాపింగ్‌ చేశామన్నారు. 104 ఎంఎంయూ వాహనంతో కలిసి వైద్యుడు ప్రతి గ్రామాన్ని నెలలో రెండుసార్లు  సందర్శిస్తారని తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 656 వాహనాలకు అదనంగా మరో 434 వాహనాలు కొంటున్నట్లు చెప్పారు. ఇవి నవంబర్‌ నెలాఖరుకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి  వస్తాయని, డిసెంబర్‌ నుంచి ప్రతి గ్రామానికి 104 వాహనం రెండు సార్లు వెళుతుందని వివరించారు. పీహెచ్‌సీలో వైద్యుడు సెలవు పెట్టినప్పుడు వైద్య సేవలకు ఇబ్బంది కలగకుండా సమీపంలోని సీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఇంకా ఇబ్బంది ఏర్పడితే సమీప ఏరియా, జిల్లా ఆస్పత్రుల వైద్యులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అదే విధంగా పీహెచ్‌సీ వైద్యులకు సీయూజీ ఫోన్‌ నంబర్లు కేటాయించి, వాటిని విలేజ్‌ క్లినిక్‌లలో ప్రదర్శిస్తామని చెప్పారు. ప్రజలు అవసరమైనప్పుడు ఆ నంబర్లలో ఫ్యామిలీ వైద్యుడిని సంప్రదించవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని విజయవంతం చేయడానికి ఉద్యోగులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఫ్యామిలీ వైద్యుడి విధానం అమలులోకి వస్తే అధిక శాతం జబ్బులకు గ్రామంలోనే వైద్య సేవలు అందుతాయని, ప్రజలకు పెద్దాస్పత్రులకు వెళ్లే భారం తప్పుతుందని వివరించారు.

ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ చికిత్సలు పెంచుతాం
ప్రస్తుతం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్సల కోసం ఖర్చు చేస్తున్న నిధుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల వాటా 25 శాతం ఉంటోందని చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వనరులు మెరుగుపరచడం ద్వారా ఈ వాటాను 50 శాతానికి పైగా పెంచుతామన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ వైద్యుల్లో నైపుణ్యం పెంపు, సమన్వయం ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాల్లో వైద్య శాఖ కార్యకలాపాలను వైద్య కళాశాలల పరిధిలోకి తేనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి ప్రభుత్వం 42 వేలకు పైగా వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టిందన్నారు. త్వరలో మరో 4 వేల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో వైద్య శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏపీ శాక్స్‌ పీడీ నవీన్‌కుమార్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జె.నివాస్‌ పాల్గొన్నారు. 

ప్రధాన ఆస్పత్రుల్లో బ్లడ్, ఆక్సిజన్‌ బ్యాంకులు
ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులన్నింటిలో బ్లడ్‌బ్యాంకులు, ఆక్సిజన్‌ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో గురువారం రెడ్‌క్రాస్‌ సొసైటీ పల్స్‌ ఆక్సీమీటర్లు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను వైద్యశాఖకు అందించింది. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ వీటిని ప్రధాన ఆస్పత్రులకు అందచేస్తామన్నారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ ఏపీ బ్రాంచ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎ.శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ ఫెడరేషన్‌ నుంచి ఏపీ రెడ్‌క్రాస్‌ సొసైటీకి వచ్చిన 4,965 పల్స్‌ ఆక్సీమీటర్లు,  600 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను రాష్ట్ర వైద్యశాఖకు ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్, కుటుంబసంక్షేమ కమిషనర్‌ జె.నివాస్‌ పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top