
భట్టిప్రోలు మండలం పల్లెపాలెం వద్ద నీటిలో చిక్కుకు పోయిన వారిని ఒడ్డుకు చేరుస్తున్న స్థానికులు(ఫైల్)
సాక్షి, రేపల్లె: కృష్ణమ్మ విలయానికి సరిగ్గా నేటికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. కృష్ణమ్మ ఉగ్రరూపం దాలుస్తూ 106 సంవత్సరాల తరువాత 2009, అక్టోబర్ 5న అర్ధరాత్రి సరిగ్గా 12.10 ప్రాంతంలో 10.98 లక్షల క్యూసెక్కుల వరద నీటితో ఉరకలేస్తూ పరుగులు తీసింది. సరిగ్గా ఆదే సమయంలో కరకట్ట మధ్యలో ఏర్పాటు చేసిన పైపులైన్లు లీకై భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామంలోని పల్లెపాలెం వద్ద కరకట్ట క్షణాల్లో కోతకు గురైంది. కళ్లు తెరిచి కళ్లు మూసే సమయానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ గ్రామాలపై విరుచుపడింది. గొడ్డుగోదా, పిల్లాపాపల్ని చంకనేసుకుని ప్రజలు బతుకుజీవుడా అంటూ జనం పరుగులు తీశారు.
క్షణక్షణం భయానక వాతావరణం
కృష్ణానది కరకట్ట తెగిన అనంతరం నీరు ఉప్పొంగుతూ క్షణాల్లో పక్కనే ఉన్న బ్యాంకు కెనాల్‌ను దాటుకుంటూ పంటలు, గ్రామాలపై విరుచుకుపడింది. ఆ ప్రభావంతో రేపల్లె పట్టణం మునిగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అప్పటిæ రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ఆధ్వర్యంలో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.
లంక భూములే రక్షణ కవచాలు
కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ప్రవహించే సమయంలో కరకట్టకు రక్షణ కవచంలా లంక భూములు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. వాటిల్లోని చెట్లు, ప్రవాహాన్ని నిలువరిస్తున్నా యి. సాధారణ నదీ ప్రవాహానికి కరకట్టకు మధ్యలో కిలోమీటరు నుంచి మూడు కిలోమీటర్ల మేర లంకభూమి విస్తరించి ఉంది. ఇప్పటికే ఏయేటికాయేడు వరదల సమయంలో లంక భూమి కోతకు గురవుతోంది. 2009 అక్టోబర్‌లో వ చ్చిన వరద ఉద్ధృతికి మండల పరిధిలోని బొబ్బర్లంక లంక భూములు సుమారు 70ఎకరాల వరకు కోతకు గురయ్యా యి. దీంతో పాటు రేపల్లె మండల పరిధిలో మరో 30 ఎక రాల వరకు కోతకు గురైనట్లు అధికారులు అంచనా వేశారు.
‘సాక్షి’ సాయం మరువేనిది
వరదల సమయంలో సాక్షి ఆధ్వర్యంలో విస్తృతంగా నిర్వహించిన సహాయక కార్యక్రమాలను ప్రజలు నేటి గుర్తు చేసుకుంటున్నారు. రెండు వేల కుటుంబాలకు దుప్పట్లు, బట్టలు, ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.
కరకట్ట పటిష్టతకు ప్రణాళికలు సిద్ధం
రెండు సంవత్సరాల నుంచి వరుసగా వస్తున్న వరదలను దృష్టిలో ఉంచుకుని పెనుమూడి నుంచి లంకెవానిదిబ్బ వరకు కరకట్ట పటిష్టతకు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు ఆదేశాలతో ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రస్తుతం బలహీనంగా ఉన్న పెనుమూడి నుంచి లంకెవానిదిబ్బ వరకు కరకట్ట పటిష్టతతో పాటు రైతులకు వెసులుబాటు కలిగించే విధంగా రోడ్డు నిర్మాణాలకు, గ్రామాల సమీపంలో కరకట్టకు రిటైనింగ్ వాల్ నిర్మాణాల అవసరాలను గుర్తించే కార్యక్రమాలను చేపట్టాం.
–కె.నాగేశ్వరనాయక్, రివర్ కన్జర్షెన్సీ ఏఈఈ