పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Environmental protection is everyones responsibility - Sakshi

పర్యావరణ పరిరక్షణపై భారతి సిమెంట్, సాక్షి మీడియా ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు 

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘పుడమి సాక్షిగా’ పేరిట నిర్వహణ 

గుణదల (విజయవాడ తూర్పు)/తిరుపతి రూరల్, విశాఖ స్పోర్ట్స్‌:  కాలుష్యం నుంచి పుడమిని కాపాడుకోవాలనే లక్ష్యంతో పర్యావరణ పరిరక్షణకు భారతి సిమెంట్, సాక్షి మీడియా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అవగాహన ర్యాలీలు నిర్వహించారు. భావి తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు, మంచి వాతావరణాన్ని అందించే దిశగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా నడుచుకోవాలని వక్తలు అభిలషించారు. విజయవాడలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డులో పర్యావరణ పరిరక్షణపై అవగాహనా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణపై సాక్షి మీడియా అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. రాబోవు తరాలను దృష్టిలో ఉంచుకుని మెరుగైన పర్యావరణం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దేవినేని అవినాష్, సాక్షి మీడియా ప్రతినిధులు విశ్వనాథరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాస్, మధు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. 

తిరుపతిలో భారీ ర్యాలీ.. 
తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి వైఎస్సార్‌ క్రీడా మైదానం వరకు వందలాది మంది యువకులతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్వీ డిఫెన్స్‌ అకాడమీ అధినేత డాక్టర్‌ శేషారెడ్డి, డెమొక్రటిక్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సౌపాటి ప్రకా‹Ùబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ‘సాక్షి’ చైర్‌ పర్సన్‌ వైఎస్‌ భారతిరెడ్డి స్ఫూర్తితో తుడా పరిధిలోని ప్రతి ఇంటికీ పండ్లు, కాయలు, నీడనిచ్చే చెట్లు 10 లక్షలకు పైగా పంపిణీ చేసినట్లు తెలిపారు.  

విశాఖ సాగరతీరంలో వాక్‌థాన్‌ 
విశాఖలో ‘పుడమి సాక్షిగా’ వాక్‌థాన్‌ను సాగరతీరంలోని కాళీమాత ఆలయం వద్ద నుంచి వైఎస్సార్‌ విగ్రహం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏయూ ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, విశాఖ రేంజ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎల్‌. కాళిదాసు వెంకటరంగారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. మంచి పర్యావరణంతో కూడిన భూమి మాత్రమే మనకున్న గొప్ప ఆస్తి అని, ఈ ఆస్తిపట్ల అవగాహన కలిగివుండి ‘సాక్షి’ చేసిన ఈ ప్రయత్నం మరింతగా కొనసాగాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ప్రాంతీయ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ ప్రమో«ద్‌రెడ్డి, ఆంధ్ర మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్, సినీనటుడు జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top