జేసీ బ్రదర్స్‌కు ఈడీ షాక్‌ | Enforcement Directorate shock for JC Brothers | Sakshi
Sakshi News home page

జేసీ బ్రదర్స్‌కు ఈడీ షాక్‌

Published Thu, Dec 1 2022 4:40 AM | Last Updated on Thu, Dec 1 2022 2:32 PM

Enforcement Directorate shock for JC Brothers - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాక్‌ ఇచ్చింది. బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌4 వాహనాలుగా అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసిన కేసులో జేసీ బ్రదర్స్‌కు చెందిన రూ.22.10 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన దివాకర్‌ రోడ్‌లైన్స్, జటాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఆయన వ్యాపార భాగస్వామి సి.గోపాల్‌రెడ్డి కుటుంబానికి చెందిన  సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. రూ.6.31 కోట్ల నగదు, బ్యాంకులో మరికొంత నగదు, బంగారు ఆభరణాలతోపాటు రూ.15.79 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది.

ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. టీడీపీ సీనియర్‌ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి కుటుంబాలు సుప్రీం కోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా దర్జాగా అక్రమ దందాకు పాల్పడ్డాయి. బీఎస్‌ 3 వాహనాలను సుప్రీం కోర్టు నిషేధించింది. అయినా జేసీ కుటుంబం అశోక్‌ లేలాండ్‌ కంపెనీకి చెందిన 154 బీఎస్‌ 3 మోడల్‌ బస్సులు, లారీలను తుక్కు పేరుతో కొన్నది.

జటాధర ఇండస్ట్రీస్‌ పేరున 50 వాహనాలు, సి.గోపాల్‌ రెడ్డి అండ్‌ కో పేరున 104 వాహనాలను కొన్నారు. నిబంధనల ప్రకారం బీఎస్‌ 3 వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయరు. దాంతో ఫోర్జరీ పత్రాలు సృష్టించి, వాటిని బీఎస్‌ 4 వాహనాలుగా ఆ పత్రాల్లో పేర్కొన్నారు. అనంతరం ఫోర్జరీ పత్రాలతో నాగాలాండ్‌ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్‌ చేయించి, ఎన్‌వోసీ పొందారు.

ఆ తర్వాత 15 రోజుల్లోనే ఆ బస్సులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లో 101 వాహనాలు, తెలంగాణలో 33,  కర్ణాటకలో 15, తమిళనాడులో ఒకటి, ఛత్తీస్‌గఢ్‌లో ఒక బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నారు. మరో మూడు వాహనాలు ఎక్కడ ఉన్నాయన్నది తెలియలేదు. ఆ వాహనాల లైసెన్సులకు కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారు.  అంతేకాదు ఆ వాహనాల్లో కొన్నింటిని అక్రమంగా ఇతర రాష్ట్రాల్లోని వారికి విక్రయించేశారు.

అలా విక్రయించాలంటే పోలీసుల నుంచి ఎన్‌వోసీ పొందాలి. కానీ స్థానిక పోలీసు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఎన్‌వోసీలు సృష్టించి మరీ అమ్మేశారు. వాటిని కొన్న వారు తాము మోసపోయామని గుర్తించి అనంతపురంలోని రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారించిన అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు 2020 జూన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డితో పాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులు నమోదు చేశారు. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అరెస్టు చేశారు.

అనంతరం వారు బెయిల్‌పై విడుదల అయ్యారు. వాహనాల బీమాలోనూ ఫోర్జరీకి పాల్పడ్డట్టు దర్యాప్తులో వెల్లడైంది. సమగ్ర సమాచారం కోసం పోలీసులు ‘నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఐసీ)’ రికార్డులను పరిశీలించగా, బీమా పత్రాలన్నీ నకిలీవని వెల్లడైంది. జేసీ కుటుంబం అక్రమాలపై ప్రత్యేకంగా దర్యాప్తు జరపాలని సూచిస్తూ రాష్ట్ర రవాణా శాఖ కేంద్రానికి లేఖ రాసింది.

కేంద్రం కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. సమగ్ర దర్యాప్తు కోసం ఈడీని రంగంలోకి దింపింది. కొన్ని నెలల క్రితం ఈడీ అధికారులు అనంతపురం రవాణా శాఖ అధికారుల నుంచి  ఆధారాలు, కీలక పత్రాలను తీసుకున్నారు. అనంతరం ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ రెడ్డి,  సి.గోపాల్‌ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో, అనంతపురం జిల్లా తాడిపత్రితోపాటు హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో మరిన్ని కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ రెడ్డి ఫోన్‌లను కూడా జప్తు చేశారు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు, ఫోర్జరీ ఎన్‌వోసీలతో వాహనాల కొనుగోలు, అమ్మకాల వెనుక భారీగా నల్లధనం చేతులు మారినట్టు ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.

మనీ లాండరింగ్‌ చట్టాలను ఉల్లంఘించిన కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ రెడ్డిలను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో ఇటీవల విచారించారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసిన ఈడీ అధికారులు జేసీ బ్రదర్స్‌ కుటుంబానికి చెందిన రూ.22.10కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అశోక్‌ లేలాండ్‌లో కొందరి పాత్రపైనా ఈడీ ఆరా
బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌ 4 వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం వెనుక అశోక్‌ లేలాండ్‌ కంపెనీ పాత్ర ఉండొచ్చని ఈడీ భావిస్తోంది. ఆ కంపెనీకి చెందిన కొందరి సహకారంతోనే ఈ దందా సాగించినట్టు ప్రాథమికంగా గుర్తించింది. దాంతో అశోక్‌ లేలాండ్‌ కంపెనీ ప్రతినిధులను కూడా విచారించాలని ఈడీ నిర్ణయించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement