ఏసీ 26 డిగ్రీల కన్నా తగ్గితే ఇల్లు గుల్లే 

Energy saving company awareness on AC consumption - Sakshi

ప్రతి 10 గంటలకు 10 కిలోల కర్బన ఉద్గారాలు 

ఏసీల వార్షిక విద్యుత్‌ డిమాండ్‌ 2,800 ఎంయూలు 

26 డిగ్రీలే ఉంచితే మేలు –19 డిగ్రీలైతే చర్మవ్యాధులు, ఆర్థరైటిస్‌ ఖాయం 

ఏసీల వినియోగంపై ఇంధన పొదుపు సంస్థ అవగాహన 

ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్ధం 

సాక్షి, అమరావతి: ఎండాకాలం.. 24 గంటలూ ఏసీ వేయడం మామూలే. దీనివల్ల కరెంట్‌ బిల్లు పెరగడమే కాదు.. ప్రజలకూ హాని కలుగుతోంది. 8నుంచి 10 గంటల పాటు ఏసీ వేస్తే ఏకంగా 10 కిలోల కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతుంది. ఈ విపత్కర పరిస్థితిని చక్కబెట్టేందుకు ఏసీల వినియోగంపై రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ అవగాహన కార్యక్రమం చేపట్టింది. ప్రజల్లోకి దీన్ని బలంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.  

ఈ వివరాలను ఆ సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో ఏసీల వార్షిక విద్యుత్‌ డిమాండ్‌ 2,800 మిలియన్‌ యూనిట్లు. వీటిని 26 డిగ్రీల స్థాయిలో వాడుకుంటే ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా మేలని ఇంధనశాఖ చెబుతోంది. దీనివల్ల తక్కువ విద్యుత్తు వినియోగమవుతుంది. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ఆరోగ్యంపైనా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చెబుతోంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయంటోంది. గదిలో ఏసీ ఉష్ణోగ్రతలు 19 నుంచి 21 డిగ్రీల వద్ద ఉంటే.. అవి సాధారణ శరీర ఉష్ణోగ్రతల కంటే చాలా తక్కువని, తద్వారా అల్పోష్ణస్థితి, ఆర్థరైటిస్, చర్మ అలర్జీలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తేందుకు అవకాశముందని పేర్కొంది.  

ఇలా చేస్తే మేలు 
ఏసీలు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నడుస్తున్నప్పుడు కంప్రెషర్‌ నిరంతరాయంగా పనిచేయాలని, అందుకు అధిక విద్యుత్‌ అవసరమవుతుందని.. ఫలితంగా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏసీలను ఎప్పుడూ 26, ఆ పైన ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం, ఫ్యాన్‌ స్పీడును తక్కువగా ఉంచడం ఉత్తమమని.. తద్వారా తక్కువ కరెంటు అవసరమవుతుందని పేర్కొంటున్నారు. 26 డిగ్రీల మీద నడపడం ద్వారా ఒక్కో ఏసీకి ఒక్క రాత్రికి కనీసం 5 యూనిట్లు ఆదా చేస్తే.. 10 లక్షల ఇళ్లల్లో రోజుకు 5 మిలియన్‌ యూనిట్లు పొదుపు చేయవచ్చని అంచనా. దీనివల్ల పర్యావరణానికి, ఆరోగ్యానికీ మేలు జరుగుతుందని ఇంధన పొదుపు సంస్థ తెలిపింది.

స్టార్‌ రేటెడ్‌ బెస్ట్‌ 
5 స్టార్‌ ఏసీ వినియోగం వల్ల రోజుకు 4.5 యూనిట్ల విద్యుత్‌ ఆదా అవుతుంది. 1 స్టార్‌ స్లి్పట్‌ ఏసీ (1.5 టన్‌)తో ఏడాదికి రూ.665 ఆదా అయితే.. 5 స్టార్‌ ఏసీతో రూ.2,500 వరకు పొదుపు చేయవచ్చు. ఇళ్లల్లో స్టార్‌ రేటెడ్‌ విద్యుత్తు ఉపకరణాల వినియోగం, కరెంటు బిల్లులపై వాటి ప్రభావం అనే అంశంపై రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి ఏపీఎస్‌ఈసీఎం అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.

ఏసీ ఉష్ణోగ్రతల సెట్టింగుల్లో 1 డిగ్రీ తగ్గితే, విద్యుత్తు వినియోగం 6% తగ్గుతుందని తెలిపారు. కేంద్ర విద్యుత్తుశాఖ సూచన మేరకు స్టార్‌ రేటెడ్‌ ఏసీలను కొనేలా, 26 డిగ్రీల ఉష్ణోగ్రతతో నడిపేలా వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. దేశంలో ప్రస్తుతం మొత్తం ఏసీల స్థాపిత సామర్థ్యం 80 మిలియన్‌ టీఆర్‌ (టన్‌ ఆఫ్‌ రిఫ్రిజిరేటర్‌ (74,234 మెగావాట్లు)). పదేళ్లలోపే ఇది 250 మిలియన్‌ టీఆర్‌ (2,31,982 మెగావాట్లు)కు పెరుగుతుందని.. ఫలితంగా 2030 కల్లా దేశంలో ఏసీల వల్లే కనెక్టెడ్‌ లోడ్‌ 200 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా. దీనివల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top