breaking news
AC use
-
ఏసీ 26 డిగ్రీల కన్నా తగ్గితే ఇల్లు గుల్లే
సాక్షి, అమరావతి: ఎండాకాలం.. 24 గంటలూ ఏసీ వేయడం మామూలే. దీనివల్ల కరెంట్ బిల్లు పెరగడమే కాదు.. ప్రజలకూ హాని కలుగుతోంది. 8నుంచి 10 గంటల పాటు ఏసీ వేస్తే ఏకంగా 10 కిలోల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. ఈ విపత్కర పరిస్థితిని చక్కబెట్టేందుకు ఏసీల వినియోగంపై రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ అవగాహన కార్యక్రమం చేపట్టింది. ప్రజల్లోకి దీన్ని బలంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ వివరాలను ఆ సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో ఏసీల వార్షిక విద్యుత్ డిమాండ్ 2,800 మిలియన్ యూనిట్లు. వీటిని 26 డిగ్రీల స్థాయిలో వాడుకుంటే ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా మేలని ఇంధనశాఖ చెబుతోంది. దీనివల్ల తక్కువ విద్యుత్తు వినియోగమవుతుంది. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ఆరోగ్యంపైనా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చెబుతోంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయంటోంది. గదిలో ఏసీ ఉష్ణోగ్రతలు 19 నుంచి 21 డిగ్రీల వద్ద ఉంటే.. అవి సాధారణ శరీర ఉష్ణోగ్రతల కంటే చాలా తక్కువని, తద్వారా అల్పోష్ణస్థితి, ఆర్థరైటిస్, చర్మ అలర్జీలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తేందుకు అవకాశముందని పేర్కొంది. ఇలా చేస్తే మేలు ఏసీలు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నడుస్తున్నప్పుడు కంప్రెషర్ నిరంతరాయంగా పనిచేయాలని, అందుకు అధిక విద్యుత్ అవసరమవుతుందని.. ఫలితంగా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏసీలను ఎప్పుడూ 26, ఆ పైన ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం, ఫ్యాన్ స్పీడును తక్కువగా ఉంచడం ఉత్తమమని.. తద్వారా తక్కువ కరెంటు అవసరమవుతుందని పేర్కొంటున్నారు. 26 డిగ్రీల మీద నడపడం ద్వారా ఒక్కో ఏసీకి ఒక్క రాత్రికి కనీసం 5 యూనిట్లు ఆదా చేస్తే.. 10 లక్షల ఇళ్లల్లో రోజుకు 5 మిలియన్ యూనిట్లు పొదుపు చేయవచ్చని అంచనా. దీనివల్ల పర్యావరణానికి, ఆరోగ్యానికీ మేలు జరుగుతుందని ఇంధన పొదుపు సంస్థ తెలిపింది. స్టార్ రేటెడ్ బెస్ట్ 5 స్టార్ ఏసీ వినియోగం వల్ల రోజుకు 4.5 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. 1 స్టార్ స్లి్పట్ ఏసీ (1.5 టన్)తో ఏడాదికి రూ.665 ఆదా అయితే.. 5 స్టార్ ఏసీతో రూ.2,500 వరకు పొదుపు చేయవచ్చు. ఇళ్లల్లో స్టార్ రేటెడ్ విద్యుత్తు ఉపకరణాల వినియోగం, కరెంటు బిల్లులపై వాటి ప్రభావం అనే అంశంపై రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఏపీఎస్ఈసీఎం అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. ఏసీ ఉష్ణోగ్రతల సెట్టింగుల్లో 1 డిగ్రీ తగ్గితే, విద్యుత్తు వినియోగం 6% తగ్గుతుందని తెలిపారు. కేంద్ర విద్యుత్తుశాఖ సూచన మేరకు స్టార్ రేటెడ్ ఏసీలను కొనేలా, 26 డిగ్రీల ఉష్ణోగ్రతతో నడిపేలా వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. దేశంలో ప్రస్తుతం మొత్తం ఏసీల స్థాపిత సామర్థ్యం 80 మిలియన్ టీఆర్ (టన్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ (74,234 మెగావాట్లు)). పదేళ్లలోపే ఇది 250 మిలియన్ టీఆర్ (2,31,982 మెగావాట్లు)కు పెరుగుతుందని.. ఫలితంగా 2030 కల్లా దేశంలో ఏసీల వల్లే కనెక్టెడ్ లోడ్ 200 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా. దీనివల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి. -
ఏవండీ సీ దిస్ న్యూస్ ఎప్పుడూ ఏసీలోనే ఉంటే... ఆరోగ్యం వేడెక్కుద్దట!
ఇప్పుడు ఎయిర్కండిషన్ల వాడకం ఎగువ మధ్యతరగతి నుంచి మధ్యతరగతికీ వచ్చేసింది. గతంలో ఏసీలు అమర్చుకోవడం పెద్ద సమస్య కాదుగానీ... దాని కరెంటు ఖర్చు ఎక్కువ అనే ఆందోళన ఉండేది. ఇప్పుడు కరెంటు వినియోగాన్నీ ఆదా చేసే అనేక బ్రాండ్లు వస్తుండటంతో ఏసీల వాడకం పెరిగింది. అనేక కారణాలు ఏసీల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇంట్లో అప్పుడే పుట్టిన చిన్నారి ఎండల తీవ్రత భరించలేదనో, రోగులైన పెద్దవారు ఈ ఎండలను ఎదుర్కోలేరనో ఏసీలను ఆశ్రయించడం మామూలైపోయింది. ఇలాంటి కారణాలతో గతంలో ధనిక వర్గాలకు పరిమితమైన ఏసీలు ఇప్పుడు ఓ మోస్తరు ఆదాయవర్గాలకు దగ్గరవుతున్నాయి. ఏసీల వాడకం కూడా అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. ఆ సమస్యలను అధిగమించడం ఎలాగో చూద్దాం. ఏసీలతో ఉండే ప్రయోజనాలివి... ♦ వాతావరణంలో ఉండే మార్పులేవీ మనపై దుష్ర్పభావం చూపకుండా, మనం ఎప్పుడూ ఒకే తరహా వాతావరణంలో ఉండేందుకు ఏసీలు ఉపయోగపడతాయి ♦ కొన్ని అధునాతన ఎయిర్ కండిషనర్స్‌తో ఉండే కొన్ని ఫిల్టర్స్ చాలా సూక్ష్మస్థాయిలో ఉండే కాలుష్యాల (మైక్రోస్కోపిక్ పొల్యుటెంట్స్) నుంచి మనల్ని కాపాడతాయి. ♦ బయటి చప్పుళ్లు లోపలికి వినిపించనివ్వకుండా శబ్ద కాలుష్యం నుంచి ఎయిర్ కండిషనర్స్ మనల్ని కాపాడుతాయి. పై ప్రయోజనాలను ఇచ్చే ఎయిర్ కండిషన్ల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలూ ఉంటాయి. ఏసీలతో వచ్చే ఆరోగ్య సమస్యలివి... ఎయిర్ కండిషన్లతో వచ్చే ఆరోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావు. తీవ్రమైన తలనొప్పులు, చర్మం పొడిబారిపోవడం, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. దీనితో పాటు అనేక ఇతర సమస్యలూ వచ్చేందుకు అవకాశం ఉంది. ఒక్కొక్కటిగా కొన్ని సమస్యలివే... తీవ్రమైన అలసట - తలనొప్పి : ఎయిర్ కండిషన్ వల్ల వచ్చే చల్లదనం ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉంచడం కోసంతో పాటు... ఆ చల్లదనం గది దాటి బయటకు వెళ్లకుండా ఉంచేందుకు ఏసీ ఉన్న గదిని ఎప్పుడూ మూసే ఉంచాల్సి ఉంటుంది. దాంతో అక్కడి గాలి అక్కడే ఉండిపోతుంది. మనం విడిచే కార్బన్ డై ఆక్సైడ్ కూడా ఆ గదిలోనే ఉంటుంది. ఒకవేళ పరిమితికి మించి జనం ఉన్నప్పుడు అక్కడ ఉన్న గాలిలో అందరూ విడిచే కార్బన్ డై ఆక్సైడ్ పాళ్లు పెరిగిపోతాయి. ఆక్సిజన్ పాళ్లు తగ్గిపోతాయి. దాంతో ఎయిర్ కండిషన్ గదిలో ఉన్నవారికి మెల్లగా తలనొప్పి (డల్ హెడేక్) మొదలవుతుంది. తగినంత ఆక్సిజన్ సరఫరా లేనందువల్ల రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యం ఒకింత తగ్గుతుంది. దాంతో ఏసీలో చాలాసేపు ఉన్నవారికి బాగా అలసిపోయినట్లుగా అనిపిస్తుంటుంది. ఇలా మన రక్తకణాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యపరమైన చేటు జరిగే అవకాశాలూ ఎక్కువ. పొడిచర్మం: ఒకింత వేడిమికీ, ఎండకూ ఉన్నప్పుడు మన చెమట గ్రంథులు చురుగ్గా పనిచేస్తుంటాయి. కానీ ఎప్పుడూ అతి చల్లటి వాతావరణంలో ఉండటం వల్ల చెమట గ్రంథులు పనిచేయడానికి అవకాశం ఉండదు. దాంతో చాలాకాలం పాటు ఎయిర్ కండిషన్లలో ఉన్నవారి చర్మంపై చెమ్మ ఎప్పుడూ ఉండదు. ఇదే పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే వారి చర్మంపై తేమ పూర్తిగా ఆరిపోయి చర్మం పొడిబారిపోయినట్లుగా మారుతుంది. చర్మం ఇలా పూర్తిగా పొడిబారిపోయిన కొన్ని సందర్భాల్లో చర్మంపై దురదలు కూడా రావచ్చు. అప్పటికే ఉన్న వ్యాధుల తీవ్రత పెరగడం : కొందరు వ్యక్తులు అప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఉదాహరణకు ఆస్తమా, రక్తపోటు తక్కువగా ఉండేవారు (లో-బ్లడ్ ప్రెషర్), ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారికి ఎయిర్ కండిషన్ ఉపశమనంలా పనిచేయకపోగా... అది వారి సమస్యలను తీవ్రతరం చేస్తుంది. కిడ్నీలో రాళ్లు : ఎయిర్ కండిషన్లో ఉన్నవారికి దాహం తక్కువ కావడం వల్ల వారు రోజు తాగాల్సిన నీళ్ల కంటే చాలా తక్కువగా నీళ్లు తాగుతుంటారు. దాంతో మూత్రపిండాలలో రాళ్లు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇది చాలా తీవ్రమైన సమస్యకు దారితీయవచ్చు. ఒకరకం నిమోనియా వచ్చే అవకాశం: కొందరిలో ఏసీ వల్ల ఒకరకం నిమోనియా అయిన లెజియోన్నేరిస్ వంటి వ్యాధులు రావచ్చు. ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోవడం : చాలాకాలం పాటు ఎయిర్ కండిషన్ గదుల్లో ఉండేవారికి క్రమంగా ఎండ తీవ్రతను, వేడిమిని తట్టుకోగల సామర్థ్యం తగ్గిపోతుంది. దాంతో వారు బయటకు వచ్చినప్పుడు కొద్దిపాటి ఎండ తీవ్రతనూ భరించలేరు. ఇలా దీర్ఘకాలం పాటు ఏసీల్లో ఉండి బయటకు వచ్చాక వారిలో అకస్మాత్తుగా తల తిరిగినట్లు అనిపించడం, తలనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది అనిపించడం వంటి సమస్యలతో బాధపడతారు. శ్వాసకోశ సమస్యలు : ఏసీలు అమర్చి ఉన్న కార్లను పరిశీలించినప్పుడు ఒక రకమైన ఫంగస్‌తో పాటు కొన్ని రకాల చాలా సూక్ష్మజీవులు ఉన్నట్లు గుర్తించారు. ఈ సూక్ష్మజీవుల వల్ల అలర్జీలు రావచ్చు. ఈ అలర్జీ తీవ్రతరమైనప్పుడు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, ఆస్తమా వంటి పరిణామాలకు దారితీయవచ్చు. కొన్ని చెవి సమస్యలు కూడా : కొన్ని ఏసీల సామర్థ్యం తక్కువ. చవక రకాలకు చెందిన ఏసీలలో ఒక రకమైన శబ్దం నిరంతరం వస్తుంటుంది. ఈ నిరంతర శబ్దానికి గురైన వారి చెవులలో అదే హోరు వినిపిస్తూ ఉంటుంది. దీర్ఘకాలం పాటు ఈ హోరు వింటున్నవారి చెవులు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ఏసీ వాతావరణంలో పెరిగే ఒక రకం బూజు (మోల్డ్) వల్ల కూడా శ్వాసకోశ సమస్యతో పాటు చెవులు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగని ఒకసారి ఏసీకి అలవాటు పడ్డ తర్వాత అందులో ఉన్నా లేకపోయినా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఏసీలోని ఒకే రకమైన స్థిరమైన ఉష్ణోగ్రతకు అలవాటు పడ్డవారు తరచూ బయటకు వెళ్తూ, లోపలికి వస్తూ ఉండాల్సి వస్తుంటే తరచూ తమ పరిసర వాతావరణం మారిపోతూ ఉండటం వల్ల పై బాధలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయి. అనర్థాలను అధిగమించడం ఇలా... ఎయిర్ కండిషనర్స్‌తో ఆరోగ్యపరమైన కొన్ని ప్రయోజనాలతో పాటు, మరికొన్ని నష్టాలు కూడా ఉన్నాయని తేలిపోయింది. కాబట్టి వృత్తిరీత్యా ఏసీలో గడపాల్సి వచ్చి వాటి కారణంగా ఆరోగ్యంపై దుష్ర్పభావం పడుతుంటే ఆ నష్టాలను తెలుసుకుని వాటి గురించి అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే వాటి నుంచి ఆశించే ప్రయోజనం ఉంటుంది. ♦ ఎప్పుడూ ఏసీలో ఉండేవారు అప్పుడప్పుడూ చల్లగాలికి వచ్చి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ ఉండాలి. అయితే చల్లటి వాతావరణం నుంచి అకస్మాత్తుగా బయటకు రాకూడదు. లోపలి వాతావరణంతో పాటు బయటి వాతావరణం కూడా దగ్గర దగ్గరగా ఉండే సమయాలైన ఉదయం, సాయంత్రాలలో బయటకు రావాలి. పైగా ఆ సమయాల్లో వాతావరణంలో కాలుష్యం కూడా ఒకింత తక్కువ. ఏసీలో తప్పక ఉండాల్సి వచ్చిన వారు ఆ వాతావరణానికి అనువైన దుస్తులను ధరించాలి. ఒకవేళ ఆ ఏసీ చల్లదనాన్ని భరించలేకపోతే ఉన్ని దుస్తుల వంటివి వాడాలి. చర్మం పొడిబారుతుండే వాళ్లు తరచూ మాయిశ్చరైజింగ్ క్రీమ్ మేనిపైన రాస్తూ ఉండాలి. ♦ ఏసీలో ఉండేవారు దాహం వేయకపోయినా అప్పుడప్పుడూ నీళ్లు తాగుతూ ఉండాలి. దాంతో కిడ్నీలో ఏర్పడే రాళ్లను నివారించవచ్చు. ♦ ఏసీలోని ఫిల్టర్స్‌ను తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. ఏసీలోని ఫిల్టర్స్‌ను సబ్బుతో కడగాల్సి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఆరిన తర్వాతే మళ్లీ వాటిని బిగించాలి. ♦ ఏసీ కారణంగా ఆరోగ్యంపై దుష్ర్పభావాలు కనిపిస్తుంటే వాటిని వీలైనంతగా అవాయిడ్ చేయాలి. ఎయిర్ కండిషన్ వల్ల కలిగే ప్రయోజనాలూ - నష్టాలను బేరీజు వేసుకొని, దుష్ర్పభావాలను సాధ్యమైనంత తగ్గించుకుంటూ విచక్షణతో ఎయిర్ కండిషన్‌ను వాడితే, దానివల్ల ఒనగూరే ప్రయోజనాలు దక్కుతాయి. ఆరోగ్యమూ కాపాడుకోవచ్చు. డాక్టర్ డి. అరవింద్ కుమార్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్