విద్యుత్‌ సవరణ బిల్లుపై ఉద్యోగుల నిరసన

Employees protest against electricity amendment bill power sector - Sakshi

సాక్షి, అమరావతి: లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టిన విద్యుత్‌ సవరణ బిల్లు 2022ను ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ వ్యతిరేకించింది. బిల్లులు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు పంపినప్పటికీ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులు సర్కిల్, డివిజన్‌ కార్యాలయాల్లో నిరసనలకు దిగారు. విజయవాడలోని విద్యుత్‌ సౌధలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు కార్యాలయం బయటకు వచ్చి ధర్నా చేపట్టారు.

ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ను జేఏసీ చైర్మన్‌ పి.చంద్ర శేఖర్, జనరల్‌ సెక్రటరీ పి.ప్రతాపరెడ్డి, కన్వీనర్‌ బి.సాయికృష్ణ తదితరులు కలిసి బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. కేంద్రం ఈ విషయంలో ముందుకు వెళితే తక్షణమే ఆందోళనలకు దిగేలా కార్యాచరణ రూపొందించినట్టు వెల్లడించారు. 

 ఆందోళనకు ఇదీ కారణం
ప్రైవేటు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు లైసెన్స్‌ విధానాన్ని సులభతరం చేయడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని చెబుతున్నప్పటికీ, విద్యుత్‌ రంగం ప్రైవేటీకరణను అనుమతించడం వల్ల వినియోగదారులపై ధరల భారం పడే అవకాశం ఉందని, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువవుతుందని జేఏసీ అభిప్రాయం పడింది.

బిల్లు ఆమోదం పొందితే టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్‌ సేవల కోసం వినియోగదారులు తమకు నచ్చిన నెట్‌వర్క్‌ను ఎంచుకుంటున్న విధంగా విద్యుత్‌ సరఫరాదారుని కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒకే ప్రాంతంలో పలు కంపెనీలకు విద్యుత్‌ పంపిణీ లైసెన్సులివ్వాల్సి వస్తే వాటి కోసం ’క్రాస్‌ సబ్సిడీ నిధి’ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తుంది. డిపాజిట్‌ సొమ్మును ముందుగా చెల్లించకపోతే డిస్కంలు కోరినంత విద్యుత్‌ను ‘జాతీయ లోడ్‌ డిస్పాచ్‌ కేంద్రం’(ఎన్‌ఎల్డీసీ) సరఫరా చేయదు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top