చనిపోయినా వీడి పోలేక.. 

Elephants returned to the place where elephant deceased - Sakshi

గున్న ఏనుగు మృతి చెందిన చోటుకు తిరిగి వచ్చిన ఏనుగులు 

పూడ్చిన గుంతను తోడేందుకు యత్నం 

ఆగ్రహంతో జనాలపైకి దూసుకొచ్చిన వైనం 

తొండంతో కొట్టడంతో ఓ రైతుకు గాయాలు 

పలమనేరు (చిత్తూరు జిల్లా): తమ బిడ్డ చనిపోయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఏనుగులు కోతిగుట్ట గ్రామంలో గున్న ఏనుగు మృతి చెందిన చోటును విడిచిపెట్టడం లేదు. శనివారం సైతం అక్కడికి వచ్చిన ఏనుగులు బిడ్డ కోసం రోధించాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని కోతిగుట్ట గ్రామ పొలాల్లోకి సమీపంలోని కౌండిన్య అడవి నుంచి చొరబడ్డ ఏనుగుల గుంపులో ఓ గున్న ఏనుగు కరెంట్‌షాక్‌తో మృతిచెందిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి ఈ ఘటన జరగ్గా శుక్రవారం ఉదయం వరకు ఏనుగుల గుంపు మృతి చెందిన గున్న ఏనుగును విడిచిపెట్టి పోలేదు. శనివారం మరోసారి గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు గున్న ఏనుగు మృతి చెందిన ప్రాంతానికి చేరుకున్నాయి. గున్న ఏనుగుకు పోస్టుమార్టం చేసి పూడ్చి పెట్టిన గుంత వద్ద గుమిగూడి రోదించాయి. కొన్ని ఏనుగులు గుంతను తోడేందుకు యత్నించాయి. ఇలా ఉండగా, గ్రామంలోకి వచ్చిన ఏనుగులను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనం అరుపులు కేకలు పెట్టి వాటికి ఆగ్రహాన్ని తెప్పించారు. కేరింతలు కొడుతూ సెల్‌ఫోన్లలో రికార్డు చేయడం చూసి అవి జనంపైకి తిరగబడ్డాయి. గుంపులోని ఓ మదపుటేనుగు రవి అనే రైతును వెంబడించి తొండంతో కొట్టడంతో అతను గాయపడ్డాడు. స్థానికులు అతన్ని పలమనేరు ఆస్పత్రికి తరలించారు.  

భయం గుప్పిట్లో కోతిగుట్ట 
గున్న ఏనుగు మృతిని ఏనుగులు ఏమాత్రం జీర్ణించుకోలేకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవి మళ్లీ మళ్లీ గ్రామంలోకి వచ్చి జనంపై దాడి చేసే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇటీవలే కాలువపల్లి వద్ద ఓ యువకుడు స్మార్ట్‌ఫోన్‌ లైట్‌ వేసి ఏనుగును అదిలించగా అది ఆ యువకుడిని తొక్కి చంపింది. ఏనుగులు పగబట్టి మరిన్ని దాడులు చేసేలా ఉండటంతో కోతిగుట్ట వాసులు భయాందోళనలు చెందుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top