అద్దెకివ్వండి.. ఆదాయం పొందండి!

Electricity Bill Centre Allow To Lease Power Lines Of Transco Discoms - Sakshi

అప్పుల ఊబి నుంచి డిస్కంలను గట్టెక్కించేందుకు కేంద్రం దిశానిర్దేశం

విద్యుత్‌ పంపిణీ, సరఫరా వ్యవస్థలను అద్దెకివ్వాలని ఆదేశం

ట్రాన్స్‌కో, డిస్కంల విద్యుత్‌ లైన్లను లీజుకివ్వాలని సూచన 

పెరిగిపోతున్న డిస్కంల అప్పులను పూడ్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గం

సాక్షి, అమరావతి: విద్యుత్‌ రంగంలో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన సంస్కరణల్లో భాగంగా మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల అప్పులు రూ.1.32 లక్షల కోట్లకు చేరడంతో వాటి వసూలుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం.. తాజాగా రాష్ట్రాలకు ఓ మార్గాన్ని చూపింది. గతేడాది అమల్లోకి తెచ్చిన ఎలక్ట్రిసిటీరూల్స్‌–2021(ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ ప్లానింగ్, డెవలప్‌మెంట్‌ అండ్‌ రికవరీ ఆఫ్‌ ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ చార్జెస్‌)కు కొనసాగింపుగా మరికొన్ని నిబంధనలను ప్రవేశపెడుతూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తద్వారా రాష్ట్రాలు తమ ఆధీనంలోని విద్యుత్‌ సరఫరా నెట్‌వర్క్‌ను అమ్ముకునేందుకు, ఇతరుల నుంచి కొనుక్కునేందుకు, లీజుకు ఇవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ వెసులుబాట్లతో విద్యుత్‌ సంస్థలు ఆదాయాన్ని ఆర్జించి అప్పుల ఊబి నుంచి బయటపడతాయని కేంద్రం చెబుతోంది.

నెట్‌వర్క్‌ సమస్యకు చెక్‌ 
ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌(ఏపీ ట్రాన్స్‌కో)కు ప్రస్తుతం 5,532.161 సీకేఎం(సర్క్యూట్‌ కిలోమీటర్ల) మేర 400 కేవీ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌లు, 12,200.9 సీకేఎం మేర 220 కేవీ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌లు, 13,568.18 సీకేఎం మేర 132 కేవీ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు ఉన్నాయి. మొత్తంగా 400 కేవీ, 220 కేవీ,132 కేవీ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు 354 ఉండగా, వాటి ద్వారా రాష్ట్రంలోని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ సంస్థలకు ఏడాదికి సగటున 70 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్పొరేషన్‌ యాజమాన్యంలోని అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ లైన్లను ప్రయివేటుకు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. డిస్కంల ఆధీనంలోని ట్రాన్స్‌మిషన్‌ లైన్ల లీజుకు అవకాశం కల్పించింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న లైన్లను అద్దె ప్రాతిపదికన ఇకపై ఎవరికైనా ఇవ్వొచ్చు. భవిష్యత్‌లో రానున్న ప్రైవేటు డిస్కంలకు నెట్‌వర్క్‌ సమస్యలు రాకుండా చూడటం దీని ప్రధాన ఉద్దేశం.

ఇదీ చదవండి: రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top