Eenadu False Writings On Cashew Processing Units - Sakshi
Sakshi News home page

జీడిపై చీడ రాతలు! అప్పుడు కిమ్మనని రామోజీ ఇప్పుడు మాత్రం గుండెలు బాదుకుంటున్నాడు

Jul 8 2023 4:23 AM | Updated on Jul 8 2023 12:39 PM

Eenadu false writings on Cashew processing units - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో జీడి తోటల విస్తీర్ణాన్ని చూసినా.. దిగుబడులైనా.. ఎగుమతులైనా గత సర్కారు హయాంతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపయ్యాయి. సాగు విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు ఏకంగా 17 వేల ఎకరాలకుపైగా జీడి తోటలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పునరుద్ధరించింది.

ఇక తితిలీ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర రైతుల నోట్లో మట్టిగొట్టిన చంద్రబాబు నిర్వాకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఆ అన్నదాతలను ఆదుకుంటూ గత సర్కారు ఎగ్గొట్టిన రూ.87.29 కోట్ల పరిహారాన్ని చెల్లించిందీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే.

ప్రపంచాన్ని ముంచెత్తుతున్న వియత్నాం జీడి గింజల దిగుమతులను అరికట్టడం సాధ్యం కాకున్నా ప్రాసెసింగ్‌లో 50 శాతం మాత్రమే వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో 80 శాతం దిగుమతి చేసుకున్న గింజలను వినియోగిస్తే కిమ్మనని ఈనాడు రామోజీ ఇప్పుడు మాత్రం అన్యాయం జరిగిపోతోంది..! బాబోయ్‌ దిగుమతులు పెరిగాయ్‌..! ప్రాసెసింగ్‌ యూనిట్లు మూతబడ్డాయని గుండెలు బాదుకుంటూ తప్పుడు కథనాలకు తెగబడ్డారు!! 

‘ఈనాడు’ ఆరోపణ: 
దిగుబడులు లేక నష్టాల బారిన రైతులు..     
వాస్తవం:  2018 –19లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో 3 లక్షల ఎకరాల్లో జీడితోటలు ఉండగా ఈ విస్తీర్ణం ప్రస్తుతం 3.35 లక్షల ఎకరాలకు పెరిగింది. నాలుగేళ్లలో 35 వేల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి.

టీడీపీ హయాంలో రూ.6.92 కోట్లతో 8,648 ఎకరాల్లో తోటలను పునరుద్ధరిస్తే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ.13.64 కోట్లతో 17,125 ఎకరాల్లో పాత తోటలను పునరుద్ధరించడమే కాకుండా రూ.8.30 కోట్లతో 35 వేల ఎకరాల్లో కొత్త తోటలను విస్తరించింది. ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న తోటబడుల వల్ల ఉత్పత్తి  సగటున 800 కిలోల నుంచి 1,150 కిలోలకు పెరిగింది. ఫలితంగా దిగుబడులు 1.23 లక్షల టన్నుల నుంచి 1.67 లక్షల టన్నులకు పెరిగాయి.

చంద్రబాబు జమానాలో రూ.701.69 కోట్ల విలువైన 12,356 టన్నుల జీడిపప్పు ఎగుమతి కాగా ఇప్పుడు నాలుగేళ్లలో రూ.1,718.85 కోట్ల విలువైన 29,399 టన్నులు ఎగుమతి అయ్యాయి. నాలుగేళ్లలో ఎగుమతులు ఏకంగా 17 వేల టన్నులకు పైగా పెరిగాయి.  సాధారణంగా జీడి పిక్కల కోత మే నెల కల్లా పూర్తయిపోతుంది. ప్రస్తుతం రైతుల వద్ద పది శాతం కూడా పంట లేదు. అలాంటప్పుడు రైతుకు నష్టం ఏ విధంగా జరుగుతుందో రామోజీకే తెలియాలి.  

ఆరోపణ: జీడి రైతుల సంక్షేమాన్ని విస్మరించారు 
వాస్తవం: 2018–19లో తితిలీ తుపాన్‌ కారణంగా జీడి తోటలు పెద్ద ఎత్తున దెబ్బతింటే చంద్రబాబు కేవలం 70 వేల మంది రైతులకు రూ.68.18 కోట్ల పరిహారం విదిల్చారు. 1,38,458 మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.87.29 కోట్ల పరిహారాన్ని సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక అందజేసి రైతులను ఆదుకున్నారు. తుపాన్‌తో నష్టపోయిన ప్రాంతాల్లో 21,250 ఎకరాల్లో తోటల పునరుద్ధరణ, విస్తరణ కార్యక్రమాలు చేపట్టారు.  

ఆరోపణ: జీడిపప్పు ధరల పతనంతో నష్టాలు  
వాస్తవం: రాష్ట్రంలో ఉత్పతయ్యే జీడిపప్పు మొదటి రకంæ కిలో రూ.800, రెండో రకం కిలో రూ.600 ఉంటుంది. అయితే మన జీడిపప్పు ధర వెనుక అసలు కారణాలకు ‘ఈనాడు’ ముసుగేసింది. ప్రపంచంలో అత్యధికంగా జీడిపప్పు ఉత్పత్తి చేసే వియత్నాం నుంచి యూరప్, అమెరికా దేశాలకు ఎగుమతులు జరుగుతాయి. అయితే ఆ దేశాల్లో నిల్వలు ఎక్కువ కావడంతో వియత్నాం నుంచి దిగుమతులను నిలిపివేశాయి.

దీంతో ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా భారీగా దిగుమతి అవుతున్న వియత్నాం జీడిపప్పు స్థానిక మార్కెట్‌లో మొదటి రకం కిలో రూ.600, రెండో రకం రూ.450లకే లభిస్తోంది. గత పదేళ్లుగా ముడి గింజలు కిలో రూ.80 నుంచి రూ.120 మ«ధ్య ఉండగా ఈనాడు మాత్రం  రూ.140 – రూ.150 మధ్య ఉండేవంటూ మరో అబద్ధాన్ని అచ్చేసింది.  

ఆరోపణ: జీడి పరిశ్రమకు చేయూత ఏదీ?  
వాస్తవం: జీడిమామిడి రైతుల సంక్షేమం, నాణ్యమైన జీడి ఉత్పత్తి కోసం నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రధానంగా నాణ్యమైన మొక్కలతో జీడి విస్తీర్ణ పథకం, జీడి తోటలకు బిందు సేద్యం, పాత జీడితోటల పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టారు.

సాగు మెళకువలను నేర్పించడం ద్వారా జీడి  పంట నాణ్యత పెంచేలా  తోటబడి కార్యక్రమం ద్వారా 418 ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించారు. పలాసను జీడిపప్పు ప్రాసెసింగ్‌ క్లస్టర్‌గా అభివృద్ధి చేశారు.  బొబ్బిలి, అనకాపల్లిలోని ప్రభుత్వ ఉద్యానవన క్షేత్రాలతో పాటు బాపట్లలోని జీడిపప్పు పరిశోధనా కేంద్రంలో 4.5 లక్షలకు పైగా అంటుకట్టిన జీడి మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నారు. 

ఆరోపణ: కొత్త యూనిట్లకు ప్రోత్సాహమేది? 
వాస్తవం: ప్రాసెసింగ్‌ యూనిట్ల సామర్థ్యాన్ని పెంచేలా ఆధునికీకరణకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 50 శాతం సబ్సిడీపై రూ.4 లక్షల అంచనాతో ప్యాక్‌ హౌస్‌లు, కలెక్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు రూ.25 లక్షల వరకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. ఇందులో రూ.10 లక్షలు సబ్సిడీగా అందిస్తున్నారు.

మౌలిక సదుపాయాల కల్పనకు రూ.6 లక్షల సబ్సిడీతో రూ.15 లక్షల వరకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. తొలిసారిగా జీడిపిక్కల నిల్వ కోసం రూ.1.69 కోట్లు వెచ్చించి 15 కలెక్షన్‌ సెంటర్లను నెలకొల్పారు. రూ.2.79 కోట్లతో రైతులకు బిందు సేద్యం పరికరాలను సమకూర్చారు.

జీడిపప్పు కెర్నల్‌ ఆయిల్‌ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మెరుగైన విలువ జోడింపు, అధిక ఆదాయం కోసం శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలలో పీపీపీ ప్రాజెక్టుల కింద జీడిపప్పు­లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు.  

ఆరోపణ: నష్టాలు భరించలేక 500 పరిశ్రమలు మూసివేత 
వాస్తవం: ఇంతకంటే పచ్చి అబద్ధం మరొకటి ఉండదు. రాష్ట్రంలో 402 ప్రాసెసింగ్‌ యూనిట్లున్నాయి. ఇవి సంవత్సరానికి 79,140 టన్నుల సామర్థ్యంతో 1.50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో మెజార్టీ యూనిట్లు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలుపుదల చేస్తాయి.

కొన్ని యూనిట్లు ఉత్పత్తిని తగ్గిస్తాయి. అంతేకానీ రాష్ట్రంలో శాశ్వతంగా మూతపడిన పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. పైగా రాష్ట్రంలో ఉన్నవే 402 పరిశ్రమలైతే 500 పరిశ్రమలు ఎలా మూతపడ్డాయో ఈనాడుకే తెలియాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement