హైకోర్టు కీలక వ్యాఖ్యలు
భర్త చికిత్సకు ఆయన ఖాతాలో డబ్బు విత్‌డ్రాకు వెసులుబాటు
సాక్షి, అమరావతి: కోమాలో ఉన్న భర్తను బతికించుకునేందుకు ఓ భార్య చేసిన న్యాయ పోరాటం ఫలించింది. భర్త చికిత్స కోసం ఆయన ఖాతాలో ఉన్న డబ్బు విత్‌డ్రా చేసేందుకు ఆమెకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. ‘భర్త కోమాలో ఉన్నప్పుడు, ఆయన సంక్షేమాన్ని చూసుకోవడానికి భార్య కంటే మెరుగైన వ్యక్తి మరొకరు ఉండరు. మన పురాణాలు సైతం భార్యను భర్తలో సగంగా భావించి, భార్యను అర్ధాంగిని చేశాయి’ అని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.
వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుకు చెందిన సింగవరం నాగమ్మ భర్త సింగవరం సుభాన్ సింగ్ అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్లారు. వైద్య ఖర్చుల కోసం ఆయన ఖాతా నుంచి రూ.14.38 లక్షలు విత్‌డ్రా చేసేందుకు అనుమతినివ్వాలని యాక్సిస్ బ్యాంక్‌ను నాగమ్మ అభ్యర్థించారు. అయితే దీనికి బ్యాంక్ తిరస్కరించింది. విధి లేని పరిస్థితుల్లో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. భర్త చికిత్స నిమిత్తం తమ వద్ద డబ్బు లేదని, ఖాతాలో ఉన్న రూ.14 లక్షలే తమకు దిక్కని ఆమె హైకోర్టుకు నివేదించారు.
ఈ వ్యాజ్యంపై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. సంరక్షకుల నియామకం విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని, దీనిపై సివిల్ కోర్టును ఆశ్రయించడమే మార్గమని ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. కోమాలో ఉన్న వ్యక్తుల సంరక్షణ విషయంలో నిర్దిష్టమైన నిబంధనలు లేనందున ఈ కేసులో హైకోర్టుకున్న అసాధారణ న్యాయపరిధిని ఉపయోగిస్తున్నామన్నారు.
సుభాన్ సింగ్ బ్యాంకు ఖాతా నిర్వహణకు నాగమ్మను సంరక్షకురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకు ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు నాగమ్మకు అనుమతినివ్వాలని యాక్సిస్ బ్యాంక్‌ని ఆదేశించారు. ఖాతా నిర్వహణ వివరాలను ప్రతీ మూడు నెలలకొకసారి హైకోర్టు రిజిస్ట్రార్ కు పంపాలని నాగమ్మను ఆదేశించారు.


