నిపుణుల కమిటీ చెప్పినట్లే రాజధానిలో భూ ప్రకంపనలు

Earthquakes in Capital City Amaravati as the Committee of Experts said - Sakshi

ఆ నివేదికలను తుంగలో తొక్కిన బాబు ..

151వ రోజు రిలే నిరాహార దీక్షల్లో బహుజన నేతలు

తాడికొండ: నిపుణుల కమిటీ చెప్పినట్లుగానే అమరావతి రాజధానిలో భూ ప్రకంపనలు వస్తున్నాయని, ఆ నివేదికను తుంగలో తొక్కిన పాపం చంద్రబాబుదేనని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 151వ రోజు కొనసాగుతున్న దీక్షల్లో పలువురు ప్రసంగించారు. గతంలో శివరామకృష్ణన్‌ కమిటీతో పాటు పలు కమిటీలు ఇది లోతట్టు ప్రాంతమే గాక, భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని, భారీ నిర్మాణాలు చేపట్టేందుకు అనువుగా లేదని,  కుంగిపోతుందని నిపుణుల కమిటీలు చెప్పాయని తెలిపారు. అయితే బాబు అండ్‌కో తమ స్థార్థం కోసం ఆ నివేదికలను పెడచెవిన పెట్టి మూర్ఖంగా రాజధాని నిర్మాణం చేశారని విమర్శించారు.

రాజధాని పర్యటనకు వచ్చిన.. సినిమాల్లేని సినీ నటుడు శివాజీ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని, రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే.. తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఓ టీవీ చానల్‌లో దోపిడీ చేసి.. విదేశాలకు పారిపోవాలని చూసిన శివాజీ ఇప్పటికే జైలు ఊచలు లెక్కించాడని, రాజధాని భూముల స్కామ్‌లో ఉన్న నిందితులంతా జైలు ఊచలు లెక్కించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. బహుజన పరిరక్షణ సమితి నాయకులు పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనారాజు, బేతపూడి సాంబయ్య, మాదిగాని గురునాధం, గంజి రాజేంద్ర, ఈపూరి ఆదాం, నూతక్కి జోషి, కొలకలూరి లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top