ఆర్బీకే ‘కియోస్క్‌’లోనే అన్నీ

Each And Every Information Regarding Farmers And Agriculture Available in the RBK Kiosk - Sakshi

ఇప్పటి వరకు ఇన్‌పుట్స్‌ బుకింగ్‌కే పరిమితం

ఇక నుంచి రైతన్నలకు అందులోనే సమగ్ర సమాచారం 

విత్తు నుంచి విపణి దాకా అన్ని వివరాలు లభ్యం

సాక్షి, అమరావతి: అన్నదాతలకు ఎలాంటి సందేహాలనైనా నివృత్తి చేసేలా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను విజ్ఞాన భాండాగారాలుగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చి దిద్దుతోంది. ఆర్బీకేల్లో ఇప్పటికే వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన మ్యాగజైన్స్, పుస్తకాలతో లైబ్రరీలు, సాగు సూచనలపై వీడియో సందేశాలతో డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా వ్యవసాయ  ఉత్పాదకాలను బుక్‌ చేసుకునేందుకు ఉపయోగిస్తున్న డిజిటల్‌ కియోస్క్‌(2.0)లను సమాచార క్షేత్రంగా రూపొందిస్తోంది. విత్తు నుంచి విపణి వరకు రైతులకు ఉపయోగపడే సమగ్ర సమాచారాన్ని ఈ కియోస్క్‌ల ద్వారా రైతులకు అందిస్తున్నారు.

9,484 ఆర్బీకేల్లో డిజిటల్‌ కియోస్క్‌లు 
రైతుల చెంతకే సాగు ఉత్పాదకాలను అందించాలన్న సంకల్పంతో గ్రామసచివాల యాలకు అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా 10,725 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. 234 ఆర్బీకేలు పట్టణ ప్రాంతాల్లో ఉండగా మిగతావి గ్రామాల్లో రైతులకు సేవలందిస్తున్నాయి. ఇప్పటివరకు 9,484 ఆర్బీకేల్లో డిజిటల్‌ కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. సబ్సిడీ, నాన్‌ సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల వివరాలను వీటిలో పొందుపర్చారు. రైతులు తమకు కావాల్సిన వాటిని ఎంపిక చేసుకొని ఆన్‌లైన్‌ చెల్లింపులు జరపగానే గంటల వ్యవధిలోనే డెలివరీ చేస్తున్నారు. గత ఏడాదిగా కియోస్క్‌లను సాగు ఉత్పాదకాల బుకింగ్‌ కోసమే వినియోగిస్తున్నారు. రైతులకు ఉపయోగపడే సమగ్ర సమాచారాన్ని వీటి ద్వారా అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో కియోస్క్‌లను మల్టీపర్పస్‌ ఇన్ఫర్మేషన్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దారు.   

కియోస్క్‌లలో ప్రదర్శించే సమాచారం..
కియోస్క్‌ల ద్వారా రోజూ పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చే వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన సంక్షిప్త వార్తలు ప్రదర్శిస్తున్నారు. ఆర్బీకేల్లో అందుబాటులో ఉండే సాగు ఉత్పాదకాలు, సీహెచ్‌సీల్లో యంత్ర పరికరాల అద్దెల వివరాలు తెలుసుకోవచ్చు. పంటలవారీగా నాణ్యతా ప్రమాణాలను వెల్లడించడంతోపాటు ఆర్బీకేకు ఐదు కిలో మీటర్ల దూరంలోని సేకరణ కేంద్రాలు, తాజా కనీస మద్దతు ధరల వివరాలు చూడవచ్చు. అన్ని వ్యవసాయ ఉత్పత్తుల తాజా ధరలు, ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లోని వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాంతాల వారీగా గ్రాఫ్‌లతో ధరలు, దిగుబడి, వ్యాపార వివరాలను ప్రదర్శిస్తారు. సమీపంలోని ప్రయోగశాలలు, పరీక్షల వివరాలు తెలుసుకోవచ్చు. వాతావరణ తాజా సమాచారం, మండలాల వారీగా వాతావరణ వివరాలు, తేమ శాతం, గంటల వారీగా ఉష్ణోగ్రతలు, వర్షపాతం వివరాలు ప్రదర్శిస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అర్హతలు ఏమిటి? దరఖాస్తు విధానం వివరాలను కియోస్క్‌ ద్వారా అందిస్తారు. ఆర్బీకే చానల్‌ ద్వారా ఏ సమయంలో ఏ పంటకు చెందిన ప్రసారాలు ఉంటాయో కూడా ప్రదర్శిస్తున్నారు.

ప్రతి సందేహాన్ని నివృత్తి చేసేలా
‘వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సింగిల్‌ ప్లాట్‌ఫామ్‌ కిందకు తెచ్చి రైతులకు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం. ఆర్బీకేల్లో కియోస్క్‌లను బహుముఖ ప్రయోజనాలతో తీర్చిదిద్దాలన్న ఆలోచనతో వివిధ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఉత్పత్తుల ధరలు ఏ మార్కెట్‌లో ఏ సమయంలో ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చు. రైతులకొచ్చే ప్రతీ సందేహాలకు కియోస్క్‌ల ద్వారా జవాబు దొరికేలా మల్టీపర్పస్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్స్‌గా తీర్చిదిద్దుతున్నాం’
– హెచ్‌.అరుణ్‌కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top