‘యాంటిబయోటిక్స్‌’కు బ్రేకులు

Drug Control Department surveillance on sale of antibiotics - Sakshi

విచ్చలవిడి విక్రయాలను నియంత్రించాలని వైద్య శాఖ నిర్ణయం 

రాష్ట్రంలోని అన్ని మందుల దుకాణాలకు హెచ్చరికలు జారీ 

డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా అమ్మితే కఠిన చర్యలు 

యాంటీబయోటిక్స్‌ విక్రయాలపై ఔషధ నియంత్రణ విభాగం నిఘా 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యాంటిబయోటిక్‌ మందుల అతి వినియోగాన్ని నియంత్రించడంపై వైద్య శాఖ దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా మందుల దుకాణాల్లో ఈ మందుల విక్రయానికి కళ్లెం వేయాలని నిర్ణయించింది. యాంటీబయోటిక్స్‌ అతి వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీ­స్తోం­ది. దగ్గు, జలుబు, జ్వరం.. ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా యాంటీబయోటిక్స్‌ వాడుతున్నారు.

వైద్యులు ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే మందుల దుకాణాలకు వెళ్లి సమస్య చెప్పగానే ఈ మందులు ఇచ్చేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి అనంతరం వీటి వినియోగం మరింత పెరిగింది. అధికశాతం మందుల దుకాణాల్లో వీటి విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఈ తరహాలో వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందుల షాపుల్లో జరిగే యాంటిబయోటిక్స్‌ విక్రయాలపై ఔషధ నియంత్రణ విభాగం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

ఇప్పటికే హెచ్చరికలు జారీ
డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ చట్టం 1945లోని షెడ్యూల్‌ హెచ్, హెచ్‌ 1లో ఉండే మం­దులను దుకాణాల్లో వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌ లేకుండా అమ్మకూడదు. వీటి­లో యాంటిబయోటిక్స్‌ కూడా ఉంటాయి. అందువల్ల షెడ్యూల్‌ హెచ్, హెచ్‌ 1 మందుల విక్రయాల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే ఔషధ నియంత్రణ విభాగం అధికారులు మందుల దుకాణాల యజమానులు, అసోసియేషన్‌ ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేశారు.

వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌ లేకుండా ఈ మందులను విక్రయిస్తూ తనిఖీల్లో పట్టుబడినా, ఆధారాలతో ఫిర్యాదులు వచ్చినా నెల రోజుల పాటు లైసెన్స్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు, శాశ్వతంగా అనుమతులు రద్దు కూడా చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి షెడ్యూల్‌ హెచ్, హెచ్‌1 మందుల విక్రయాలపై నిఘా ఉంచుతున్నారు.

రాష్ట్రంలో 42వేల హోల్‌సేల్, రిటైల్‌ మందుల దుకాణాలు ఉన్నాయి. మందులపై ఉన్న బ్యాచ్‌ నంబర్ల ఆధారంగా హోల్‌సేలర్‌ నుంచి ఏ మందులు ఏ రిటైల్‌ దుకాణానికి వెళ్లాయి, అక్కడ వాటి విక్రయాలు, రికార్డులు ఇతర అంశాలపై ఆరా తీస్తున్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు 
మందుల దుకాణాల్లో ఫార్మాసిస్ట్‌ల అందుబాటు, వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ మేరకు హెచ్, హెచ్‌1 మందుల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.

ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం. విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్‌ విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ మందుల వినియోగంపై ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. వైద్యుడి సూచన లేకుండా మందుల దుకాణాల్లో యాంటిబయోటిక్‌ ఇస్తే ప్రశ్నించాలి.
– ఎస్‌. రవిశంకర్‌ నారాయణ్, డీజీ ఔషధ నియంత్రణ విభాగం  

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top