
శ్రీనివాసులు మృతదేహం వద్ద సోదరి కీర్తి రోదన
కన్నీటిపర్యంతమైన గ్రామస్తులు
శోకసంద్రంలో బొక్కిసంపాళెం
‘అన్నా.. మనకు రెక్కలు రాకముందే అమ్మానాన్నను ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడు. అప్పటి నుంచి అష్టకష్టాలు పడి ఇక్కడిదాకా వచ్చాము. అమ్మమ్మ అక్కున చేర్చుకుని పెంచి పెద్ద చేసింది. నా మనవడు ఉన్నాడన్న ధైర్యంతో బతికేస్తోంది. నేను కూడా తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ మా అన్న చూసుకుంటాడనే ఆశతో జీవిస్తున్నాను. ఇప్పుడు మా అందర్నీ దూరం చేసి వెళ్లిపోయావు. మేమెలా బతికేదన్నా’ అంటూ ఆ సోదరి తన అన్న మృతదేహంపై పడి రోదించిన తీరు చూపరుల గుండెల్ని మెలిపెట్టింది. శ్రీనివాసులు అంత్యక్రియల సందర్భంగా ఈ దృశ్యం ఆదివారం శ్రీకాళహస్తి మండలం, బొక్కసంపాళెంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
శ్రీకాళహస్తి: మండలంలోని బొక్కసంపాళెం శోకసంద్రంలో మునిగిపోయింది. జనసేన మాజీ నాయకురాలు వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు, మరో ముగ్గురు కలిసి మా అన్నను చంపేశారంటూ మృతుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతదేహం వద్ద అతడి సోదరి కీర్తి బోరున విలపించడం అక్కడి వారికి కన్నీళ్లు తెప్పించింది. ‘చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాం. ఇపుడు నా రక్తసంబంధమైన అన్నను కూడా కోల్పోయాను’ అని విలపించడం చూపరుల కళ్లు చెమర్చేలా చేసింది. ఏడేళ్ల వయసులో వెంకటగిరి నుంచి వచ్చేసి అమ్మమ్మ వద్ద పెరిగాము. ఇప్పుడు అన్నని పోగొట్టుకున్నానని మృతుని సోదరి, వారిని పెంచిన అమ్మమ్మ రాజేశ్వరి ఆవేదనను చూసి గ్రామస్తులు చలించిపోయారు.
మా అన్నని మాట్లాడనివ్వలేదు
అనంతరం మృతుడు శ్రీనివాసులు చెల్లెలు కీర్తి మాట్లాడుతూ ‘మా అన్న వారి(జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి) ఇంటికి పరిమితమయ్యాడు. చాలాకాలంగా చూడడానికి కూడా కష్టంగా ఉండేది. ఒకరోజు కాలు విరిగిందని చెబితే చూడడానికి వెళ్లా. ఇప్పుడు ఎవరైతే చంపేశారో ఆ రోజు మా అన్నను వారు మాట్లాడనివ్వకుండా చేశారు’ అని వెల్లడించింది. మా అన్నను పంపించేస్తామని చెప్పారే గానీ ఇలా చంపేస్తారని అనుకోలేదని కన్నీటి పర్యంతమైంది. తన అన్న చావుకు కారణమైన వారిని ఎవర్నీ వదలిపెట్టనని, వారికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తామని తెలిపింది. తనకు అండగా ఉండాలని స్థానికులను కోరింది.

‘నాకున్న ఒకే ఒక బంధాన్ని దూరం చేశారు. నా అన్నను అతి కిరాతకంగా చంపేశారు. చిన్నప్పుడే అమ్మానాన్న దూరమయ్యారు. అన్నున్నాడనే ధైర్యంతో బతికేస్తున్నా. ఇప్పుడు ఆ ఒక్క ఆశను కూడా తుంచేశారు. నా అన్నను నాకు లేకుండా చేశారు. పవన్‌కళ్యాణ్ మాకు న్యాయం చేయాలి. న్యాయం కోసం ఎందాకై నా వెళ్తాం..’ అంటూ మృతుడు శ్రీనివాసులు సోదరి కీర్తి మాట్లాడడం అక్కడి వారిని ఆలోచనలో పడేసింది.