స్నేహితుడే చితకబాది.. చనిపోయాడనుకుని తొట్లో వేసి.. | Dispute Between Friends Incident In Prakasam District | Sakshi
Sakshi News home page

స్నేహితుడే చితకబాది.. చనిపోయాడనుకుని తొట్లో వేసి..

Jun 10 2026 9:25 AM | Updated on Jun 10 2026 9:25 AM

Dispute Between Friends Incident In Prakasam District

మోటార్‌ సైకిల్‌పై వచ్చి నీతో పని ఉంది అంటూ..

ముండ్లమూరు: స్నేహితుడే చితకబాది చనిపోయాడనుకుని తొట్లో వేసి వెళ్లాడు. తీవ్రగాయాలతో బతికిబయటపడిన బాధితుడు ఆస్పత్రికి చేరాడు. ముండ్లమూరు మండలంలోని సుంకరవారిపాలెం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. చిట్టిబోయిన వెంకట్రావు, చిట్టిబోయిన రామబ్రహ్మం స్నేహితులు, బంధువులు కూడా.

వారి మధ్య ఏం జరిగిందో ఏమోగానీ.. సుంకరవారిపాలెంలోని తన ఇంట్లో వెంకట్రావు ఉండగా, స్నేహితుడు రామబ్రహ్మం మోటార్‌ సైకిల్‌పై వచ్చి నీతో పని ఉంది అంటూ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో తీసుకెళ్లాడు. సుమారు ఐదు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి నాయుడుపాలెం పొలాల్లోని ఎత్తిపోతల పథకం వద్ద మద్యం సేవించారు.

అనంతరం ఇద్దరూ అద్దంకి వెళ్లి పొద్దుపోయిన తర్వాత నాయుడుపాలెం పొలాల్లోనే ట్యాంకు దగ్గరకు వచ్చారు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదుగానీ.. రామబ్రహ్మం రాయితో వెంకటరావుపై తీవ్రంగా దాడి చేశాడు. చనిపోయాడనుకుని నీటి తొట్టిలో పడేసి వెళ్లిపోయాడు. తెల్లవారేసరికి తీవ్ర గాయాలతో ఉన్న వెంకట్రావుకు మెలకువ వచ్చింది. పూరిమెట్ల వైపు ఒక పశువుల షెడ్డు దగ్గరకి అతి కష్టం మీద వెళ్లి అక్కడున్న వారికి విషయం చెప్పి తన బంధువులకు సమాచారం ఇచ్చాడు.

తీవ్రంగా గాయపడిన వెంకట్రావును బంధువులు వెళ్లి చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కి అతన్ని తరలించారు. దాడి జరిగిన విషయం అద్దంకి పోలీసులకు తెలియజేయగా, కేసు నమోదు చేసి ముండ్లమూరు పోలీసులకు పంపారు. వారి మధ్య ఏం జరిగిందనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement