దిశ యాప్‌.. డౌన్‌లోడ్స్‌ 11 లక్షలు

Disha Mobile App Has Surpassed Record Of 11 Lakh Downloads - Sakshi

మహిళల రక్షణలో ఫలిస్తున్న ప్రభుత్వ ప్రయత్నం

262 కేసుల్లో వారం రోజుల్లోనే చార్జిషీట్లు

పోలీస్‌ కృషికి యూజర్ల ప్రశంసలు

సాక్షి, అమరావతి: మహిళల రక్షణే ధ్యేయంగా ఏపీ పోలీస్‌శాఖ తెచ్చిన దిశ మొబైల్‌ అప్లికేషన్‌ 11 లక్షల డౌన్‌లోడ్స్‌ను అధిగమించి రికార్డు సృష్టించింది. తెలంగాణలో దిశ ఘటనతో మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దిశ చట్టాన్ని తెచ్చేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీన్లో భాగంగా ఆపదలో ఉన్న మహిళలు తక్షణం పోలీసుల సాయం పొందేలా ప్రత్యేకంగా దిశ మొబైల్‌ అప్లికేషన్‌ తెచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఎనిమిదిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ఈ మొబైల్‌ అప్లికేషన్‌ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. మహిళల రక్షణ కోసం ప్రభుత్వ ప్రయత్నం ఫలిస్తోంది. ఈ మొబైల్‌ అప్లికేషన్‌ను ప్లే స్టోర్‌లో అందుబాటలోకి తెచ్చిన పోలీస్‌ కృషిని యూజర్లు ప్రశంసిస్తున్నారు. 

దిశ యాప్‌ సాధించిన రికార్డులు
► 11లక్షలకుపైగా యాప్‌ డౌన్‌లోడ్స్‌
► 79,648 మంది యాప్‌లోని ఎస్‌వోఎస్‌ బటన్‌ ఉపయోగించుకున్నారు. తాము ప్రమాదంలో ఉన్నట్టు పోలీసులకు తక్షణ సంకేతాలిచ్చేలా ఈ బటన్‌ ఉపయోగపడుతోంది. అయితే ఎలా పనిచేస్తోందో తెలుసుకునేందుకు కొందరు, అనుకోకుండా కొందరు బటన్‌ ప్రెస్‌ చేశారు. 
► దిశ యాప్‌ ద్వారా సహాయం కోరిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాష్ట్రంలో 604 మంది మహిళలకు అండగా నిలిచారు. 
► దిశ యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను దర్యాప్తు చేసిన పోలీసులు 122 కేసులు నమోదు చేశారు. 
► బాధిత మహిళలు ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చుననే వెసులుబాటుతో పోలీసులు 341 జీరో ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
► ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి మొత్తం 67 అత్యాచార కేసులు, 195 లైంగిక వేధింపుల కేసుల్లో (మొత్తం 262 కేసులు) దిశ బిల్లులో ప్రతిపాదించినట్టు కేవలం ఏడురోజుల్లోనే పోలీసులు చార్జిషీటు వేయడం రికార్డు. 

79 కేసుల్లో కోర్టు తీర్పులు
దిశ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన కీచకులకు వేగంగా శిక్షలు పడేలా చేయడంలో పోలీసులు పట్టుసాధిస్తున్నారు. 79 కేసుల్లో తీర్పులు వచ్చాయి. వీటిలో 66 కేసుల్లో జైలుశిక్ష, 12 కేసుల్లో జరిమానా విధించగా ఒక కేసులో జువైనల్‌ హోమ్‌కు తరలించారు. 

ప్రతి మహిళా ఉపయోగించుకోవాలి
ప్రతి మహిళా తన మొబైల్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. తనతోపాటు ఏ మహిళకు అన్యాయం జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించేలా ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవాలి. ఈ యాప్‌ను దుర్వినియోగం చేయకూడదు. సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే 11 లక్షల డౌన్‌లోడ్స్‌తో ఈ యాప్‌ రికార్డు సృష్టించింది. యాప్‌ ద్వారా సమాచారం ఇస్తే చాలు.. సమీపంలోని పోలీసులు రంగంలోకి దిగి ప్రమాదం లో ఉన్న మహిళలకు సహాయం అందిస్తున్నారు. ఇబ్బందిపడే ప్రతి మహిళా ఈ యాప్‌ను ఉపయోగించుకునే స్థాయిలో చైతన్యం పెరగాలి. 
– పాలరాజు, ఏపీ పోలీస్‌ టెక్నికల్‌ చీఫ్‌   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top