మరో 6,965 గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలు

Digital libraries in another 6965 villages - Sakshi

స్థల సేకరణ కోసం కలెక్టర్లకు ఆదేశాలు

ఏడాదిన్నర క్రితమే 3,960 లైబ్రరీల నిర్మాణం ప్రారంభం

ఒక్కొక్కటి రూ. 16 లక్షలతో నిర్మాణం

గ్రామ సచివాలయం ఉన్న ప్రతి చోటా ఓ డిజిటల్‌ లైబ్రరీ

సాక్షి, అమరావతి: వర్క్‌ ఫ్రం హోం చేసుకొనే ఐటీ ఉద్యోగులకు అవసరమైన సౌకర్యాలు, విద్యార్థులకు ఆన్‌లైన్, డిజిటల్‌ క్లాసులు, వారికి అవసరమైన సమాచారాన్ని గ్రామ గ్రామాన అందుబాటులో ఉంచేలా డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆకాంక్ష వేగంగా కార్యరూపం దాలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 3,960 డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు జరుగుతోంది.

వీటిలో కొన్ని పూర్తవగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. గ్రామ సచివాలయం ఏర్పాటు చేసిన ప్రతి చోటా డిజిటల్‌ లైబ్రరీ ఉండాలన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కొత్తగా మరో 6,965 గ్రామాల్లో వీటి ఏర్పాటుకు అనుమతి తెలిపింది. వీటితో మొత్తం 10,925 గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలు అందుబాటులోకి రానున్నాయి.

వీటిలో అత్యాధునిక సౌకర్యాలు, ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తారు.  ఉద్యోగులు.. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ఇవి వరమనే చెప్పాలి. వర్క్‌ ఫ్రంహోమ్‌ చేసే ఉద్యోగులు వారి స్వగ్రామం నుంచే ఉద్యోగం చేసుకొనే వెసులుబాటు కలుగుతుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవడానికి, వారికి అవసరమైన సమాచారాన్ని ఆన్‌లైన్, డిజిటల్‌ పద్ధతుల ద్వారా సేకరించుకోవడానికి ఈ లైబ్రరీలు ఉపయోగపడతాయి.

ఒక్కొక్క లైబ్రరీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.16 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇతరత్రా సదుపాయాలకు మరింత ఖర్చు పెడుతోంది. వీటి భవనాలకు స్థల సేకరణ చేయాలని ఆ శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం డిజిటల్‌ లైబ్రరీ భవనాల నిర్మాణానికే ప్రభుత్వం రూ. 1,114 కోట్లు ఖర్చు చేస్తోంది.

వీటితో కలిపి గత మూడున్నర సంవత్సరాల్లో రూ. 9,630 కోట్ల ఖర్చుతో గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌లు, వంటి వాటితో కలిపి గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 44 వేల భవన నిర్మాణాలు సాగుతున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top