ధర్మ ప్రచార నిధి ఏర్పాటు చేయాలి

Dharma Campaigning Treasure Should be established - Sakshi

వాడవాడలా హిందూధర్మ ప్రచారం చేపట్టాలి

విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి

స్వామీజీని కలిసిన మంత్రి వెలంపల్లి, చీఫ్‌ సెక్రటరీ వాణీమోహన్‌

పెందుర్తి: రాష్ట్రంలో దేవదాయ శాఖ ప్రత్యేకంగా ధర్మ ప్రచార నిధిని ఏర్పాటు చేసుకోవాలని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సూచించారు. తద్వారా వాడవాడలా హిందూ ధర్మ ప్రచారం సాగేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీశారదాపీఠాన్ని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, చీఫ్‌ సెక్రటరీ వాణీమోహన్, కమిషనర్‌ హరిజవహర్‌ మంగళవారం సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీల ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. ఆలయాల భద్రత కోసం నియమించిన ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందికి పోలీస్‌ శాఖ ద్వారా శిక్షణ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ వ్యవస్థలో పరిపాలనపరమైన లోపాలను సరిదిద్దుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని చెప్పారు. ప్రధాన దేవాలయాల ప్రచార రథాలకు మరమ్మతులు చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా హిందూ ధర్మ ప్రచారం చేపట్టాలని సూచించారు.

ధర్మ ప్రచారం కోసం శ్రీశారదా పీఠం పెద్ద ఎత్తున కసరత్తులు చేసి కులాలకు అతీతంగా ప్రచారం ఉండేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని వెల్లడించారు. దేవాలయ సాహిత్యం, కవీశ్వరుల రచనలను వెలుగులోకి తీసుకురావాలని స్వామీజీ చెప్పారు. పురాణ సభలను ఏర్పాటు చేసి.. ఎంపిక చేసిన పండితుల ద్వారా ఆలయాల చరిత్ర, స్థల పురాణం పుస్తకరూపంలో తీసుకురావాలన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top