అమెరికా కంటే మిన్నగా.. భారత నేవీలో నీటి అడుగునా పహారా కాసే వాహనాలు..

Development Of Unmanned Vehicles In Sea Bed For Indian Navy - Sakshi

నీటి అడుగునా పహారా కాసే మానవ రహిత వాహనాల తయారీకి చర్యలు 

శత్రు సబ్‌మెరైన్‌లను సులభంగా పసిగట్టేందుకు ప్రయత్నాలు

నిఘాతో పాటు కదన రంగంలోనూ ఉపయోగపడేలా తయారీ   

సాక్షి, విశాఖపట్నం: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ దేశ రక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్న భారత నౌకాదళం.. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తోంది. అండర్‌ వాటర్‌ డొమైన్‌ అవేర్‌నెస్‌లో పూర్తి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మానవ రహిత సాంకేతికత, వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు చర్యలు చేపట్టింది.

డీఆర్‌డీవో సాయంతో సముద్ర గర్భంలోనూ పహారా కాసే మానవ రహిత వాహనాలను తన అమ్ములపొదిలో చేర్చుకునేందుకు సన్నద్ధమవుతోంది. డీఆర్‌డీవో తయారు చేసిన మానవ రహిత విమాన ప్రయోగాలు ఇటీవలే విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే అన్‌మ్యాన్డ్‌ పవర్‌ను మరింత పెంపొందించే దిశగా భారత రక్షణ దళం సిద్ధమైంది. నీటి అంతర్భాగంలో కూడా దూసుకెళ్లే మానవ రహిత వాహనాలు తయారు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కేవలం నిఘాకు మాత్రమే కాకుండా యుద్ధ సమయంలోనూ సత్తా చాటే విధంగా డిజైన్‌ చేస్తున్నారు. 

అమెరికా కంటే మిన్నగా..
ఇప్పటికే అమెరికా నౌకాదళం రిమోట్‌తో నడిచే మానవ రహిత అండర్‌ వాటర్‌ వెహికల్స్‌ను రూపొందించి అగ్రస్థానంలో నిలిచింది. దానికంటే మిన్నగా వాహనాలను తయారు చేసేందుకు భారత్‌ ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం ఉన్న టార్పెడో ట్యూబ్‌ సముద్ర గర్భంలో 2 రోజుల పాటు, హెవీ వెయిట్‌ ట్యూబ్‌ 3 నుంచి 4 రోజుల పాటు ఉండగలవు. కానీ త్వరలో అభివృద్ధి చేయనున్న అటానమస్‌ అన్‌మ్యాన్డ్‌ వెహికల్స్‌(ఏయూవీ) కనీసం 15 రోజుల పాటు సముద్ర గర్భంలో ఉండి పహారా కాయగలవు. ఇప్పటికే ఎల్‌ అండ్‌ టీ సంస్థ అదమ్య, అమోఘ్‌ పేరుతో ఏయూవీలను తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది.

ఈ నేపథ్యంలో డీఆర్‌డీవో తయారు చేసిన అండర్‌ వాటర్‌ లాంచ్డ్‌ అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికల్‌ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసి.. కీలక కార్యకలాపాలకు ఉపయోగించాలని నిర్ణయించారు. మజ్‌గావ్‌ డాక్‌యార్డ్‌ లిమిటెడ్‌లో దీనికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. తొలి దశలో జలాంతర్గాముల పర్యవేక్షణ కోసం, తర్వాత శత్రు సబ్‌మెరైన్ల రాకను పసిగట్టేలా, తుది దశలో సైనిక దాడులకు కూడా ఈ మానవ రహిత సముద్రగర్భ వాహనాలు ఉపయోగపడేలా తీర్చిదిద్దనున్నారు. 

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top