వైద్యుడి కుటుంబం అఘాయిత్యం | Daughter and wife die after being given anesthetic injections by doctor | Sakshi
Sakshi News home page

వైద్యుడి కుటుంబం అఘాయిత్యం

Mar 30 2026 4:00 AM | Updated on Mar 30 2026 4:00 AM

Daughter and wife die after being given anesthetic injections by doctor

మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడంతో మూడేళ్ల కుమార్తె, భార్య మృతి 

మృత్యువుతో పోరాడుతున్న డాక్టర్‌ 

నరసరావుపేట టౌన్‌/నాదెండ్ల: మూడేళ్ల కుమార్తెతో కలిసి ఓ వైద్యుడి కుటుంబం అఘాయిత్యానికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది. భార్య శంకరకుమారి (30), కుమార్తె మౌనిక (3) ప్రాణాలు కోల్పోగా.. భర్త గోపి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి నరసరావుపేట వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 

నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన డాక్టర్‌ కుంభా గోపి భోపాల్‌ ఎయిమ్స్‌ వైద్యశాలలో మత్తు వైద్యుడుగా పనిచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం అనంతపురం జిల్లా ధర్మవరం గ్రామానికి చెందిన శంకరకుమారి(30)ని ప్రేమ వివాహం చేసుకున్నారు. గోపి పనిచేస్తున్న ఆస్పత్రిలోనే భార్య శంకరకుమారి కూడా నర్సుగా పనిచేస్తున్నారు. వీరికి మూడేళ్ల పాప మౌనిక ఉంది. బాలిక మానసిక ఆరోగ్య సమస్యతో జన్మించింది. 

శనివారం రాత్రి డాక్టర్‌ గోపి నరసరావుపేట రైల్వేస్టేషన్‌ సమీపంలోని దినేష్‌ గ్రాండ్‌ లాడ్జిలో రూమ్‌ అద్దెకు తీసుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు వెళ్లిన శంకరకుమారి ధర్మవరం నుంచి ఆదివారం ఉదయం కుమార్తె మౌనికతో భర్త బస చేసిన లాడ్జికి వచ్చింది. కాగా.. కుమార్తెకు మత్తు ఇంజెక్షన్‌  ఇచ్చి భార్యాభర్తలు కూడా ఆ ఇంజెక్షన్లు తీసుకున్నారు. అనంతరం చేతికి నీడిల్‌తో ఉన్న వీడియోలు, లొకేషన్‌ను బంధువుల ఫోన్‌కు పంపారు. 

అప్రమత్తమైన బంధువులు హుటాహుటిన లాడ్జికి చేరుకున్నారు. గదిలోకి వెళ్లి పరిశీలించగా ముగ్గురూ అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే ఆటోలో చిలకలూరిపేట రోడ్డులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మౌనిక మృతి చెందినట్టు ధ్రువీకరించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి తర్వాత శంకరకుమారి కూడా మృతి చెందింది. డాక్టర్‌ గోపి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement