డైకిన్‌ ఏసీలు.. ఇక మేడిన్‌ ఆంధ్రా | Sakshi
Sakshi News home page

డైకిన్‌ ఏసీలు.. ఇక మేడిన్‌ ఆంధ్రా

Published Mon, Nov 20 2023 4:29 AM

Daikin ACs Made In Andhra here after - Sakshi

సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద ఏసీ తయారీ సంస్థ.. జపాన్‌కు చెందిన డైకిన్‌ ఇక నుంచి మేడిన్‌ ఆంధ్రా ఏసీలను విక్రయించనుంది. ఈ మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీసిటీలో జపాన్‌ కంపెనీ ప్రతినిధులు, రాయబా­రుల సమక్షంలో నవంబర్‌ 23న లాంఛనంగా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనుందని రాష్ట్ర పరి­శ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. రూ.1,000 కోట్ల పెట్టుబడితో 75.5 ఎకరాల విస్తీర్ణంలో డైకిన్‌ ఈ యూనిట్‌ను స్థాపించింది. గతేడాది ఏప్రిల్‌లో నిర్మాణ పనులు ప్రారంభించిన డైకిన్‌ రికార్డు స్థాయిలో కేవలం 18 నెలల్లోనే యూనిట్‌ను సిద్ధం చేసింది.

తొలి దశలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌కు ఏటా 10 లక్షల ఏసీలను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఈ యూనిట్‌ ద్వారా సుమారు 3,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన యూనిట్లలో 75 శాతం నియామకాలు స్థానికులకే ఉండాలన్న ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)తో డైకిన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. 2020–21లో డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులకు తమ సంస్థలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించామని డైకిన్‌ వెల్లడించింది. ఎంపికైన ఉద్యోగులకు రూ.1.99 లక్షల వార్షిక వేతనాన్ని అందిస్తున్నట్లు తెలిపింది.

వేగంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు..
రెండో దశలో మరో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ యూనిట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 20 లక్షల ఏసీలకు డైకిన్‌ చేర్చనుంది. 2017లో రాజస్థాన్‌లోని నిమ్రాణాలో రెండో యూనిట్‌ను ప్రారంభించిన డైకిన్‌ ఏపీలో మూడో యూనిట్‌ను ఏర్పాటు చేసింది. దక్షిణాది రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా శ్రీసిటీని ఎంపిక చేసుకున్నట్లు శంకుస్థాపన సమయంలో డైకిన్‌ ఇండియా చైర్మన్‌ అండ్‌ ఎండీ కన్వలజీత్‌ జావా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు వేగంగా మంజూరు చేయడంతో రికార్డు స్థాయిలో డైకిన్‌ ఉత్పత్తికి సిద్ధమైందని తెలిపారు. 

ఏసీ తయారీ హబ్‌గా శ్రీసిటీ..
దేశీయ ఏసీ మార్కెట్‌లో బిలియన్‌ డాలర్ల మార్కును అందుకున్న సందర్భంగా శ్రీసిటీలో మూడో యూనిట్‌ అందుబాటులోకి రావడంపై శ్రీసిటీ వ్యవస్థాపక ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఏసీ తయారీ హబ్‌గా శ్రీసిటీ ఎదుగుతోందన్నారు. డైకిన్‌తో పాటు బ్లూస్టార్, లాయిడ్‌ (హావెల్స్‌), పానాసోనిక్, యాంబర్, ఈప్యాక్‌ వంటి అనేక సంస్థలు ఇక్కడ యూనిట్లను ఏర్పాటు చేశాయన్నారు.  

రాష్ట్రంలో 50 లక్షల ఏసీల ఉత్పత్తి..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా 75 లక్షల గృహవినియోగ ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 50 లక్షల ఏసీలకు పైనే ఉంటుందని అంచనా. ఈ విధంగా చూస్తే వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి ఏసీలో ఒకటి మన రాష్ట్రంలో తయారైందే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మొత్తం ఈ ఆరు యూనిట్లు, వీటికి సరఫరా చేసే ఉపకరణాల యూనిట్లను చూసుకుంటే ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం రూ.3,755 కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ యూనిట్లకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్‌లో ప్రత్యేక కోర్సులను సైతం అందుబాటులోకి తెచ్చింది.   

Advertisement
Advertisement